మా డబ్బులు తిరిగి తీసుకోవాలంటే...

అమ్మానాన్నలు మా చిన్నప్పుడే విడిపోయారు. అప్పటి నుంచి అమ్మమ్మ వాళ్లింట్లోనే ఉంటున్నాం. మామయ్య పిల్లల చదువుల పేరుతో ఇంటికి దూరంగా ఉంటూ అప్పుడప్పుడూ వస్తూ పోతూ ఉంటాడు. మొదటి నుంచీ మా పొలాన్నీ తాతయ్యే సాగు చేస్తూ ఉమ్మడిగా ఖర్చు చేసేవాడు.

Updated : 01 Nov 2022 01:04 IST

అమ్మానాన్నలు మా చిన్నప్పుడే విడిపోయారు. అప్పటి నుంచి అమ్మమ్మ వాళ్లింట్లోనే ఉంటున్నాం. మామయ్య పిల్లల చదువుల పేరుతో ఇంటికి దూరంగా ఉంటూ అప్పుడప్పుడూ వస్తూ పోతూ ఉంటాడు. మొదటి నుంచీ మా పొలాన్నీ తాతయ్యే సాగు చేస్తూ ఉమ్మడిగా ఖర్చు చేసేవాడు. ఎప్పుడూ మేం లెక్కలు అడగలేదు. మాకు ఒక్క రూపాయీ ఇవ్వలేదు. ఇప్పుడు సమస్య ఏంటంటే... గత కొన్నాళ్లుగా తాతయ్య మంచాన పడ్డాడు. ఆయన వైద్యం, కుటుంబ అవసరాల కోసం అన్నయ్య నేనూ లక్షల్లో ఖర్చు చేశాం. దాన్ని అమ్మమ్మ మాకు తిరిగి ఇచ్చెయ్యాలని అనుకుంటోంది. అందుకోసం తాతయ్య పేరిట ఉన్న పొలంలో కొంత అమ్మాలనుకుంటోంది. మామయ్య వాళ్లు ఒప్పుకోవడం లేదు. మా డబ్బులు మేం తీసుకునే దారిలేదా? తాతయ్య ఆస్తిలో కొడుకు బిడ్డలకే కానీ కూతురు పిల్లలకి హక్కు ఉండదా?

- ఓ సోదరి

మీ తాతయ్య పేరిట ఉన్న పొలం అమ్మమ్మ అమ్మడానికి లేదు. దాన్ని ఆవిడ తన పేరు మీదకు మార్పించుకోవడానికి ప్రయత్నమేమైనా చేశారా? సాధారణంగా మ్యుటేషన్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అంటే... రెవిన్యూ రికార్డ్స్‌లో మార్చడానికి కుటుంబ సభ్యులు అందరూ ఒప్పుకోవాలి. లేకపోతే మార్చరు. మీ తాత ఆస్తి ఆయన తండ్రి నుంచి వచ్చింది అయితే అది పిత్రార్జితం. అది ఇప్పటికీ మీ తాతగారి పేరు మీదకి మార్చుకోకపోతే.... తన తండ్రి ఆస్తిలో ఆయనకి ఒక వాటా, మనవలుగా మీకు, మీ అమ్మ, మావయ్యలకు ఒక్కో వాటా చొప్పున సమాన భాగాలు వస్తాయి. ఆయన తన వాటాను నచ్చిన వారికి ఇచ్చుకోవచ్చు. ఎవరికి ఆస్తి చెందాలనుకుంటే వారి పేరు మీద వీలునామా రాయించి రిజిస్టర్‌ చేయించండి. ఈ విషయం గురించి ముందుగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. వీలునామా కాబట్టి ఆయన తదనంతరం అమలు అవుతుంది. లేదా మీ అమ్మమ్మ పేరు మీదకు గిఫ్ట్‌గా బదిలీ చేయమనండి. అలాకాకుండా ఆస్తి మీ తాతగారి పేరు మీద ఉంటే... అది ఆయన స్వార్జితం అవుతుంది కాబట్టి తనకు నచ్చిన వారికి ఇవ్వొచ్చు. హిందూ వారసత్వ చట్టం సెక్షన్‌ 8 ప్రకారం మగవారు ఎవరైనా వీలునామా రాయకుండా చనిపోతే క్లాస్‌-1 వారసులకు అది చెందుతుంది. భార్య, పిల్లల్ని ఈ విభాగంలోకి పరిగణిస్తారు. చనిపోయిన పిల్లల పిల్లలు కూడా వారసులు అవుతారు. మీరు వాళ్ల ఆరోగ్యం కోసం పెట్టే ఖర్చులన్నీ చూపిస్తూ... వాటికి ప్రతిఫలంగా ఆస్తి మీకు చెందేలా వీలునామా రాయించుకోండి. అప్పుడు అది మీకు చెందుతుంది. ఏదైనా ఆయన జీవించి ఉన్నప్పుడే చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్