మహిళల్ని ఏ ప్రశ్నలడగొద్దు?

కోరుకున్న విధంగా హెచ్‌ఆర్‌ విభాగంలో సీనియర్‌ హోదా అందుకున్నా. ఎంపిక ప్రక్రియను చూసుకోవడం నా విధి. మా సంస్థ ఉద్యోగినుల సంఖ్యను పెంచాలన్న లక్ష్యంతో ఉంది. వీళ్ల ఎంపిక విషయంలో జూనియర్లకు శిక్షణా ఇస్తున్నా.

Updated : 09 Nov 2022 04:07 IST

కోరుకున్న విధంగా హెచ్‌ఆర్‌ విభాగంలో సీనియర్‌ హోదా అందుకున్నా. ఎంపిక ప్రక్రియను చూసుకోవడం నా విధి. మా సంస్థ ఉద్యోగినుల సంఖ్యను పెంచాలన్న లక్ష్యంతో ఉంది. వీళ్ల ఎంపిక విషయంలో జూనియర్లకు శిక్షణా ఇస్తున్నా. ఇంటర్వ్యూలో మహిళలను ఏ ప్రశ్నలు అడగకూడదన్న విషయంలో సలహాలివ్వగలరా?

- పద్మిని

* 2022 ముగుస్తోంది. ఇంటర్వ్యూల్లో ఇప్పటికీ ఆడవాళ్లని తక్కువ చేసేలా ప్రశ్నలుంటున్నాయి. ఉదాహరణకు- వేళకాని వేళల్లో పనిచేయడం, బిజినెస్‌ టూర్లకు వెళ్లడం మీవారు/ కుటుంబ సభ్యులు అంగీకరిస్తారా అని అడుగుతారు. అంటే ఆ అమ్మాయికి ఆర్థిక స్వాతంత్య్రం, తన నిర్ణయాలు తాను తీసుకునే అధికారం లేదని నమ్ముతున్నట్లేగా. అబ్బాయిల విషయంలో ఇలా అడగరే! ఇంకా..

* పెళ్లి ఆలోచనలో ఉన్నారా? పిల్లలెందరు? సంస్థకీ సమాచారంతో సంబంధమేంటి? తన ప్రావీణ్యం, పని అనుభవం, విద్యానేపథ్యం వరకూ దృష్టిపెడితే చాలు. ఒంటరిగా ఉందా? కుటుంబం/ స్నేహితులతో కలిసి ఉంటోందా అన్నదీ ఎంపికయ్యే హోదాకు సంబంధం లేనిదే కాబట్టి, అడగడం అనవసరమే.

* ఇల్లు, ఆఫీసు సమన్వయమెలా? కుటుంబం ఉన్నంత మాత్రాన పనిపట్ల నిబద్ధతతో ఉండరని కాదు. ఈ ప్రశ్న అడగడం ఆమె ప్రతిభనీ, ఏళ్ల అనుభవాన్నీ కించపరచడమే. ఆడ వాళ్లకిది వెన్నతో పెట్టిన విద్య. మరి.. మగవాళ్లకీ కుటుంబ బాధ్యతలుంటాయి కదా!

* మీ నాన్న/ భర్త ఉద్యోగమేంటి? తన గుర్తింపు ఇంట్లోని మగవాళ్లను బట్టి ఉంటుందని చెప్పడమే ఈ ప్రశ్న పరమార్థం. ఇవొదిలేసి తన పరిజ్ఞానం గురించి తెలుసుకుంటే అక్కడి వరకూ చేరడానికి తను పడ్డ శ్రమ, అది సంస్థకెలా తోడ్పడుతుందో తెలుస్తుంది.

* వేరే ప్రాంతానికి బదిలీ చేస్తే ఇంట్లో సమస్యా? ఈ ప్రశ్న.. తనకు సొంత నిర్ణయం తీసుకునే హక్కులేదని నిర్ణయించినట్లేగా! ఇల్లు, కెరియర్‌... ఏది ముఖ్యమో ఎంచుకోమన్నట్టు కూడా. తన ఉద్యోగానికి సంబంధించిన నిర్ణయాలు ‘ఆమె’ తీసుకోగలదు. ఒక్కోసారి మీ వారికి వేరే చోటికి బదిలీ అయితే అనడుగుతారు. అంటే.. తన కెరియర్‌ని పక్కన పెట్టి అతనితోపాటు వెళ్లిపోతుందన్నది వీళ్ల భావన.

సంస్థ దృష్టి... ఆమె విద్యా నేపథ్యం, పని విలువలు అంచనా వేయడంపైనే ఉండాలి. వ్యక్తిగత విషయాల ఆధారంగా తను హోదాకి సరిపోతుందా అని నిర్ణయించొద్దు. జీవితాన్ని నిర్దేశించుకునే హక్కు తనకు ఉంది. దాన్ని అనుమానించే ఈ ప్రశ్నలకు తావివ్వకుండా ఉంటే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్