చేతులపై చర్మం ఊడిపోతోంది!

శీతకాలం వచ్చిందంటే నాకు, మా పాపకి చేతులపై చర్మమంతా పొరలుపొరలుగా ఊడిపోయి ఎర్రగా మారిపోతాయి. ఏం తగిలినా విపరీతమైన మంట. తగ్గే మార్గం సూచించండి.

Published : 13 Nov 2022 00:10 IST

శీతకాలం వచ్చిందంటే నాకు, మా పాపకి చేతులపై చర్మమంతా పొరలుపొరలుగా ఊడిపోయి ఎర్రగా మారిపోతాయి. ఏం తగిలినా విపరీతమైన మంట. తగ్గే మార్గం సూచించండి.

- ఓ సోదరి

ఇది ఎగ్జిమా, ఎటోపిక్‌ డెర్మటైటిస్‌. శీతకాలంలోనే వస్తుంటుంది. చేతులు పొడిబారడం, దురద, రుద్దుతోంటే చర్మం పొరలుగా ఊడిపోతుంది. చలిపెరిగే కొద్దీ ఎక్కువవుతుంది. చిన్నపిల్లల్లో ఇది సాధారణం. పెద్దయ్యే కొద్దీ తగ్గుతుంది. ఎగ్జిమా ఎందుకు వస్తుందనడానికి సరైన కారణాలేవీ లేవు. ఒకర్నుంచి మరొకరికేం సోకదు. కుటుంబంలో ఎవరికైనా ఉంటే వంశపారంపర్యంగా పిల్లలకీ వస్తుంటుంది. పొడి వాతావరణంలో నివసించే వాళ్లలోనూ కనిపిస్తుంటుంది. కొందరికి శరీరమంతా ఇబ్బంది పెడుతుంటుంది. సబ్బుకు దూరంగా ఉండండి. శనగపిండి లాంటివాటినీ వాడొద్దు. స్నానానికి మైల్డ్‌ క్లెన్సర్లనే వాడాలి. చేతులకు క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్‌ రాస్తుండాలి. దాంతోపాటు కార్టికో స్టిరాయిడ్‌ క్రీమ్‌లనూ రాయాలి. సమస్య మరీ ఎక్కువగా ఉంటే ఓరల్‌ యాంటీబయాటిక్స్‌నీ సూచిస్తాం. రాత్రిపూట కొబ్బరినూనె లేదా మాయిశ్చరైజర్‌ రాసి, దానిపై వైట్‌ పెట్రోలియం జెల్లీ రాస్తే కావాల్సిన తేమ అందుతుంది. బయటికి వెళ్లేప్పుడు చర్మాన్ని కప్పి ఉంచే దుస్తుల్నే వేసుకోండి. ఇంట్లో హ్యుమిడిఫయర్‌ని ఏర్పాటు చేసుకోండి. అలాగే.. ఈ కాలం పాల ఉత్పత్తులు, నట్స్‌, చేపల్ని తగ్గించండి. ఊలు వస్త్రాలనీ నేరుగా కాకుండా కాటన్‌వి వేసుకొని వాటిపై ధరించండి. శానిటైజర్‌, హ్యాండ్‌ వాష్‌ వంటి ఎక్కువ రసాయనాలున్న వాటిని ఉపయోగించినా ఇది ఇబ్బంది పెడుతుంటుంది. వీటికి దూరంగా ఉండండి. వీలైనంత వరకూ చేతుల్ని నీళ్లతోనే శుభ్రం చేసుకోండి. కడిగినప్పుడే కాదు.. గుర్తొచ్చినప్పుడల్లా మాయిశ్చరైజర్‌, లేదా పెట్రోలియం జెల్లీ రాయాలి. ప్రతి గదిలోనూ వీటిని ఏర్పాటు చేసుకుంటే గుర్తుంటుంది. అలాగే రోజుకి కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలి. పాపకీ ఇవన్నీ తప్పక అలవాటు చేయండి. సమస్య తగ్గుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్