బ్రాండెడ్‌ తప్ప వాడదట...

మా పాప డిగ్రీ చదువుతోంది. ఆర్థిక ఇబ్బందులు చూస్తూ కూడా దుస్తులూ వస్తువులూ అన్నీ బ్రాండెడ్‌వే కావాలంటుంది.

Published : 21 Nov 2022 00:21 IST

మా పాప డిగ్రీ చదువుతోంది. ఆర్థిక ఇబ్బందులు చూస్తూ కూడా దుస్తులూ వస్తువులూ అన్నీ బ్రాండెడ్‌వే కావాలంటుంది. ఎంత నచ్చచెప్పినా మార్పు రావడంలేదు.

- ఒక సోదరి

స్నేహితులు బ్రాండెడ్‌వి వాడుతూ వాటి గురించి గొప్పగా చెబుతుండటంతో వాళ్ల ముందు తక్కువ కాకూడదనుకుంటారు పిల్లలు. నిజానికిది పెద్దల తప్పే. చిన్నతనంలో అడిగినవన్నీ కొనిస్తుంటే వాళ్ల వ్యక్తిత్వమే అలా రూపొందుతుంది. తల్లిదండ్రుల కష్టసుఖాలు పట్టవు. సహనం, సానుభూతి, స్థోమతను బట్టి కొనుక్కోవాలనే విచక్షణ అలవడవు. అందుకే అవసరమైనంత వరకే.. అది కూడా ఆర్థిక స్థితికి తగినవే కొనుక్కోవాలని అనునయంగా చెప్పి ఒప్పించాలి. ఆ దశలో అమ్మానాన్నల మీద అమిత ప్రేమ ఉండి కాదనరు. ఏమీ చెప్పకుండా కొనిస్తుంటే వస్తువు విలువ, డబ్బు విలువ, తల్లిదండ్రుల కష్టం అర్థంకావు. అది కాస్తా అలవాటుగా మారుతుంది. అడగ్గానే వచ్చేస్తాయనుకుంటారు. మూర్ఖత్వమూ వస్తుంది. ఇంటి స్థితి పట్టించుకోక ఏదడిగినా ఇస్తారు, ఇవ్వాలి అనుకుంటారు. చిన్నప్పుడు నియంత్రించకపోవడం, పరిసరాల ప్రభావంతో ‘ఇది నా అవసరం, హక్కు’ అనుకుంటోంది మీ పాప. ఆమెకి ఆదాయం, ఖర్చుల గురించి వివరించండి. అయినా పట్టుబడితే ఉన్నపళంగా ఇచ్చేయక ఆగమనండి. తానూ నెలకు కొంత కూడబెట్టాలని, ఇంటి అవసరాలు తీరగా మిగిలింది దాచి కొన్నాళ్ల తర్వాత ఇస్తానని చెప్పండి. గడువు దాకా ఆగడం వల్ల సహనం అలవడుతుంది. కోరుకోగానే దొరకవు, కష్టంతోనే సాధ్యమవుతాయి, మన వంతు వచ్చేదాకా ఆగాలని గ్రహిస్తుంది. అవసరమైంది దొరక లేదనే నిరాశ కలిగినా దాన్ని తట్టుకునే శక్తి వస్తుంది. ఇంటి స్థితిగతులను విడమరిచి చెబుతూ ఏది ముఖ్యం, ప్రాధాన్యతలు ఏమిటో తెలియజేయండి. బాధ్యత గుర్తించేలా ఓర్పుగా చెబితే మీ సమస్యను తనదిగా చూస్తుంది. ఆమె స్నేహితులకి ఉన్నాయన్న విషయాన్ని ఒప్పుకొంటూనే మన స్థితి ఇది కదా అని చెప్పండి. ఇదంతా ఆవేశంలో ఉన్నప్పుడు, తప్పుపడుతున్నట్టు కాకుండా స్థిమితంగా ఉన్నప్పుడు, చర్చిస్తున్నట్లు చెప్పాలి. నిరాశను అధిగమించడం, ఓర్పు, బాధ్యత, సహానుభూతి అవసరమని, మనకు తగ్గట్టుగా ఉండాలని చెప్పండి. ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇవ్వండి. ప్రాధాన్యతలు గుర్తించడం, డబ్బు దాచుకోవడం, అప్పులపాలు కాకుండా సంతోషంగా ఉండటం అవసరమని తెలియ జేయండి. ఇలా చెప్పడం వల్ల కోపద్వేషాలకు తావుండదు. ముందు జీవితం గురించీ ఆలోచిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్