రక్తహీనత తగ్గేదెలా..!

నా వయసు 29. గర్భం దాల్చానని కూడా తెలియకుండానే అబార్షన్‌ అయ్యింది. రక్తహీనతే కారణమన్నారు డాక్టర్లు. నేను శాఖాహారినే కానీ ఆహార ప్రియురాల్ని. నాకెందుకిలా అయ్యింది.

Published : 24 Nov 2022 00:46 IST

నా వయసు 29. గర్భం దాల్చానని కూడా తెలియకుండానే అబార్షన్‌ అయ్యింది. రక్తహీనతే కారణమన్నారు డాక్టర్లు. నేను శాఖాహారినే కానీ ఆహార ప్రియురాల్ని. నాకెందుకిలా అయ్యింది. చింతపండు వేసిన వంటలెక్కువ తింటా... అదే రక్తాన్ని విరిచేసిందని అంటున్నారు ఇంట్లోవాళ్లు. ఇది నిజమేనా? ఈ సమస్యని ఎలా అధిగమించాలి?

- గీత, విజయవాడ

మీకు రక్తహీనత ఐరన్‌, బీ12 పోషకం, ఫోలిక్‌ యాసిడ్‌, ఆహార నాణ్యతా లోపం వల్ల వచ్చిందో లేక, రక్తకణాల శాతంలో మార్పు వల్లో ముందు తెలుసుకోవాలి. ఇందుకు హిమోగ్లోబిన్‌, బీ 12, క్రియాటిన్‌ సీరం వంటి పరీక్షలు చేస్తారు. తర్వాతే మీ సమస్య ఆహార మార్పులతో పోతుందా? మందులు అవసరమా అన్నది వైద్యులు నిర్ణయిస్తారు. రక్త హీనతను తగ్గించుకోవడానికి నాణ్యమైన ముఖ్యంగా మాంసకృత్తులు, బీ12, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ వంటివన్నీ ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. హిమోగ్లోబిన్‌ శాతం పెరగడానికి ఐరన్‌ ప్రధానం. ఇది సాధారణంగా.. ఒకటి హీమ్‌ ఐరన్‌.. మాంసాహారం నుంచి ఇనుము అందే పద్ధతి. ఇది త్వరగా జీర్ణమై రక్తంలో తేలిగ్గా కలిసిపోతుంది. రెండోది నాన్‌హీమ్‌ ఐరన్‌... శాఖాహార ఉత్పత్తుల్లో అంటే... ఆకుకూరలు, కాయగూరలూ, పప్పుధాన్యాలూ వంటి వాటి నుంచి లభిస్తుంది. ఈ పద్ధతుల్లో ఐరన్‌ అందాలంటే... ఎక్కువ మొత్తంలో వీటిని తీసుకోవాలి. అయితే, ఇలా అందే ఐరన్‌ త్వరగా అరగదు. మీరు శాఖాహారి అంటున్నారు కాబట్టి రోజూ ఆకుకూరల్ని ఉడకబెట్టి, మిక్సీలో మెత్తగా చేసి తినండి. ప్రయోజనం ఉంటుంది.

ఓ పూట తప్పనిసరి... ప్రాసెస్‌ చేసిన తెల్ల అన్నాన్ని మూడు పూటలా తింటుంటే... వెంటనే మానెయ్యండి. ఓ పూట కచ్చితంగా రాగుల వంటకాలు తీసుకోండి. రాగి దోశ, ఇడ్లీ, జావ ఏవైనా ఫరవాలేదు. మొలకలొచ్చిన రాగులను ఎండబెట్టి పొడిగా చేసుకుని వాడుకుంటే ఇనుమును శరీరం త్వరగా గ్రహిస్తుంది. ఆహారంలోని పోషకాలు... ముఖ్యంగా ఐరన్‌ ఒంట పట్టాలంటే నిల్వ పచ్చళ్లు, కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. లేదంటే, వీటిల్లోని కెఫీన్‌, ఉప్పు, నూనెలు ఐరన్‌ని శరీరం గ్రహించకుండా అడ్డుపడతాయి. శరీరం ఇనుముని త్వరగా స్వీకరించాలంటే...విటమిన్‌ సి అవసరమూ ఎక్కువే. అందుకే, రోజూ ఆహారంలో కాస్త నిమ్మరసం కలిపి తినడం, లేదా భోజనం తర్వాత ఓ పండు తీసుకోవడం మేలు. పొట్టుతో ఉన్న పప్పు దినుసులు, సెనగలు వంటివి మొలకల రూపంలో తింటే ఇతర పోషకాలతో పాటు ఐరన్‌ కూడా సమృద్ధిగా అందుతుంది. మాంసాహారులైతే... రెడ్‌మీట్‌, లివర్‌ వంటివి రోజూ 50 గ్రాముల చొప్పున తీసుకున్నా చాలు. ఇక, చింతపండు రసంతో రక్తం విరిగి పోవడం అపోహే. అయితే, ఏది తిన్నా.. మితాన్ని మరవొద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్