ముఖంపై కమిలినట్లు మచ్చలు

వయసు 45. తెల్లగా ఉంటా. పొడిచర్మం. ఈ మధ్య నా ముఖమంతా కమిలినట్లు మచ్చలొచ్చాయి. పిగ్మెంటేషన్‌ అంటున్నారంతా. తగ్గే మార్గం చెప్పండి.

Published : 12 Feb 2023 00:22 IST

వయసు 45. తెల్లగా ఉంటా. పొడిచర్మం. ఈ మధ్య నా ముఖమంతా కమిలినట్లు మచ్చలొచ్చాయి. పిగ్మెంటేషన్‌ అంటున్నారంతా. తగ్గే మార్గం చెప్పండి.

- ఓ సోదరి

పొడిచర్మం ఉన్నవారు ఎండలోకి వెళితే పిగ్మెంటేషన్‌ త్వరగా వచ్చేస్తుంది. ముక్కు, బుగ్గలు, పెదవి, నుదురు మీద మచ్చలు కనిపిస్తాయి. గర్భం దాల్చినపుడు, హార్మోనుల చికిత్స తీసుకుంటున్నా, గర్భనిరోధక మాత్రలు వాడుతున్నా, హైపో థైరాయిడిజం, టీవీ, మొబైల్‌ ఎక్కువ వాడే వారిలోనూ ఇవొచ్చే అవకాశాలెక్కువ. మీ వయసు 45 కాబట్టి, హార్మోనుల్లో మార్పులు కారణమవొచ్చు. కొన్ని రకాల స్కిన్‌కేర్‌ ఉత్పత్తులు, హెయిర్‌ డైలు పడకపోవడం, వంశపారంపర్యం వంటివీ కారణాలే. కొన్నిసార్లు అవే తగ్గిపోతాయి. కొంతమందిలో మాత్రం అలాగే ఉండిపోతాయి. ముదురు గోధుమ రంగులో, స్పష్టమైన పరిధిలో ఉంటే ఎపిడర్మల్‌ మెలస్మా అంటాం. ఇది చికిత్సకు త్వరగా స్పందిస్తుంది. లేత గోధుమ లేదా నీలం రంగులో ఉంటే డర్మల్‌ మెలస్మా. సరిహద్దులూ సరిగా ఉండవు. దీనికి సమయం తీసుకుంటుంది. మాయిశ్చరైజర్‌ రాశాక పగలు హైడ్రోక్వినాన్‌, ఎజిలాయిక్‌ యాసిడ్‌, కోజిక్‌ యాసిడ్‌, విటమిన్‌ సి క్రీములు.. రాత్రి ట్రెటినాయిన్‌, ఆల్ఫా హైడ్రాక్సీ, గ్లైకాలిక్‌ యాసిడ్‌ క్రీమ్‌లు పూయాలి. పగలు ఎస్‌పీఎఫ్‌ 30 జింక్‌ ఆక్సైడ్‌, టైటానియం ఆక్సైడ్‌ ఉన్న సన్‌స్క్రీన్‌ తప్పనిసరిగా వాడాలి. కెమికల్‌ పీల్స్‌, మైక్రోడర్మాబ్రేషన్‌, లేజర్‌, లైట్‌ థెరపీ వంటివీ తీసుకోవచ్చు. స్పూను తేనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి లేదా గుడ్డు తెల్లసొనకి తేనె, ఓట్స్‌ కలిపి లేదా దాల్చినచెక్క పొడికి తేనె కలిపి ముఖానికి పట్టించి, ఆరాక కడిగేయాలి. వీటిల్లో ఏదో ఒకదాన్ని వారానికి 2-3 సార్లు ప్రయత్నించండి. అలాగే 3 లీటర్ల నీళ్లు, కూరగాయల రసాలు, కొబ్బరి నీళ్లు, గ్రీన్‌ టీ, సరైన నిద్ర, కొద్దిసేపు వ్యాయామం తప్పనిసరి చేసుకోండి. సమస్య అదుపులోకి వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్