కూతుర్ని పట్టించుకోరు...

మావారికి కొడుకంటే ప్రాణం. బాబు కోసం వినియోగించిన దాంట్లో సగం కూడా పాప కోసం ఖర్చుపెట్టరు. ఈ పక్షపాత ధోరణి వల్ల అమ్మాయి చాలా బాధపడుతోంది.

Published : 20 Feb 2023 00:09 IST

మావారికి కొడుకంటే ప్రాణం. బాబు కోసం వినియోగించిన దాంట్లో సగం కూడా పాప కోసం ఖర్చుపెట్టరు. ఈ పక్షపాత ధోరణి వల్ల అమ్మాయి చాలా బాధపడుతోంది. ఆయన తీరు మారేదెలా?

- సోదరి

విష్యత్తులో కొడుకులైతే ఆదరిస్తారు, కూతుళ్లు పెళ్లి చేసుకుని తమ దారిన వెళ్లిపోతారు.. వాళ్ల వల్ల ప్రయోజనం ఉండదనేది కొందరి భావన. నిజానికి ఇప్పుడెంతో అభ్యుదయంగా ఆలోచిస్తున్నారు. కానీ ప్రస్తుతంలో జీవించకుండా, వెనకబాటుగా ఆలోచించే అలాంటి వాళ్లని మార్చలేం. పాపతో.. ‘నాన్న నిన్ను సమంగా చూడకపోయినా పట్టించుకోకు. ఈ పక్షపాత వైఖరులు ఏదో రూపంలో ఉంటూనే ఉంటాయి. వాటికి ప్రాధాన్యత ఇవ్వొద్దు. డబ్బు కంటే వ్యక్తిత్వం ముఖ్యమని గుర్తుంచుకో! ఆడంబరాలు పొందలేకపోయినా చదువు మీదే ధ్యాసపెట్టి మంచి ఉద్యోగం తెచ్చుకో! ఇవాళ నాన్న ఇచ్చే వందల కంటే రేపు నువ్వు వేలూ లక్షలూ ఆర్జించి పేరు ప్రతిష్ఠలు తెచ్చుకుంటే నీ విలువ తెలిసొస్తుంది. నీ శక్తేంటో మీ నాన్నకి చూపించు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని గుర్తుంచుకో. నాన్న తగ్గించినంతలో నీ విలువ తగ్గదు, పట్టుదలగా పైకి రావాలి. పుట్టుకతో అంతా సమానమే. మన ప్రయత్నాలను బట్టే ఉన్నత స్థితి ప్రాప్తిస్తుంది. నిన్ను చులకన చేయడం నాకూ నచ్చకున్నా ఏం చేయలేని పరిస్థితి. తన సంపాదన కనుక తన ఇష్ట ప్రకారం నడుచుకుంటున్నాడు. ఒకనాటికి తన తప్పు తెలిసొస్తుంది’ అంటూ ఆత్మన్యూనత కలగకుండా మాట్లాడండి.

భర్తను వదిలేయలేరు, పక్కన పెట్టలేరు కనుక అతను ఇవ్వని ఆసరా మీరివ్వండి. ఆమెను పోత్సహిస్తూ ఉన్నత స్థితిలో ఉన్న స్త్రీల గురించి, వెనకబడిన తరగతులు, బొత్తిగా ఆర్థిక వెసులుబాటు లేని కుటుంబాల్లో పుట్టినవాళ్లు వివక్షకు గురై కూడా ఎలా పైకి వచ్చారో చెప్పి, దీన్నొక సవాలుగా తీసుకోమనండి. అడ్డంకులను అధిగమించాలంటూ ఆత్మవిశ్వాసం నింపండి. ఆందోళనతో కుంగిపోకుండా అతని తత్వం అలాంటిదని చెబుతూ ఆమె దాన్ని ఒప్పుకొని ముందుకు సాగేలా చేయండి.

అలాగే మీ భర్తకి కూడా ‘వివక్ష చూపితే ఇద్దరికీ చెరుపే. అటు అబ్బాయి విచ్చలవిడిగా ఖర్చుపెడుతూ పాడైపోతాడు, అమ్మాయేమో తనను పట్టించుకోవడం లేదని మానసికంగా కుంగిపోతుంది. కోపద్వేషాలు పెంచుకుంటుంది. పెద్దతనంలో ఆసరాగా ఉండదు. పిల్లల్ని సమంగా ఆదరించాలి. ప్రేమ, ప్రోత్సాహం ఇవ్వాలి’ అంటూ నచ్చచెప్పండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్