నా ఆస్తిపై అతడికి హక్కులుంటాయా?

చిన్నప్పుడే పెళ్లయినా కొన్ని కారణాల వల్ల అతనితో విడిపోయా. తర్వాత చదువుకుని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడ్డా. కొన్నాళ్లు అమెరికాలోనూ ఉద్యోగం చేశాను.

Published : 21 Feb 2023 00:24 IST

చిన్నప్పుడే పెళ్లయినా కొన్ని కారణాల వల్ల అతనితో విడిపోయా. తర్వాత చదువుకుని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడ్డా. కొన్నాళ్లు అమెరికాలోనూ ఉద్యోగం చేశాను. ఏడాది క్రితం క్రైస్తవ సంప్రదాయంలో ఒకబ్బాయిని పెళ్లి చేసుకున్నా. అతడు ఆస్తి, ఉద్యోగం... వంటి అన్ని విషయాల్లోనూ నాకంటే తక్కువ స్థాయిలోనే ఉన్నా... నాలుగేళ్లు ప్రేమిస్తున్నా అంటే నమ్మి బంధంలోకి అడుగుపెట్టా. పెళ్లయ్యాక అతడు నీలిచిత్రాలు చూడటం, తెలిసిన చోటల్లా అప్పులు చేయడం, బాధ్యతా రహితంగా ప్రవర్తించడం, తరచూ ఇల్లు వదిలి వెళ్లిపోవడం చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తితో వేగలేననిపిస్తోంది. విడాకులు తీసుకోవాలనుకుంటున్నా. నా ఆస్తిపై అతడికేమైనా హక్కులు ఉంటాయా? ఏం చేయాలో సలహా ఇవ్వగలరు?

- ఓ సోదరి.

మీ పెళ్లి రిజిస్టర్‌ చేసుకున్నారా? సాధారణంగా క్రైస్తవ వివాహాలు, విడాకులు భారతీయ విడాకుల చట్టం- 1869, దాని సవరణ చట్టం-2001లోని సెక్షన్‌ 10 ప్రకారం జరుగుతాయి. ఇందులో విడాకులకు... వివాహేతర సంబంధం, క్రైస్తవ మతాన్ని వదిలిపెట్టడం, విడాకులు దరఖాస్తు చేసే సమయానికి రెండేళ్ల ముందు నుంచి వారి మానసిక స్థితి బాలేదని నిరూపించడం, నయం కాని అంటువ్యాధులు ఉండటం, రెండేళ్ల పాటు భాగస్వామిని వదిలిపెట్టి వెళ్లిపోవడం, ఏడేళ్లు కనిపించకుండా పోవడం, కోర్టు కలవడానికి ఇచ్చిన డిక్రీని అమలు చేయకపోవడం, పిటిషనర్‌ని క్రూరంగా హింసించడం వంటి వాటిని కారణాలుగా చూపించొచ్చు. సెక్షన్‌ 10ఎ ప్రకారం పరస్పర ఒప్పందంతో విడాకులు తీసుకోవచ్చు. అయితే, పిటిషన్‌ వేసే ముందు రెండేళ్లు విడిగా ఉన్నారని నిరూపించుకోవాలి. మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే అతడు కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడనిపిస్తోంది. దానికి మీరు క్రూరత్వం కారణంగా చూపించి విడాకులకి దరఖాస్తు చేయండి. ఒకవేళ అతని చిరునామా తెలియకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయండి. వాళ్లు వెతికి పట్టుకొస్తారు. అప్పుడు అతడిని విడాకులు ఇవ్వమని కోరొచ్చు. ఇక, మీ భర్తకు మీ ఆస్తిపై ఎటువంటి హక్కులూ ఉండవు. ఒకవేళ మీ నుంచి మెయింటెనెన్స్‌ కోరితే మాత్రం అతడు పోషించగలిగే స్థితిలోనే ఉండీ కావాలని ఉద్యోగం చేయడం లేదని నిరూపించండి. లేదంటే మ్యూచువల్‌గా విడాకులు తీసుకునేప్పుడు రాసుకునే ఒప్పందంలో ఎవరూ ఎవరికీ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని రాసుకోండి. ముందు లాయర్‌తో మాట్లాడితే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్