అత్తమామలు మాట్లాడట్లేదు ఆస్తి వస్తుందా?

ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అత్తమామలు ఆదరించలేదు. మాకు ఇద్దరు పిల్లలు. రెండు నెలల క్రితం మావారు ఓ ప్రమాదంలో మరణించారు. ఉద్యోగరీత్యా ఇప్పటివరకూ మేం వెనకేసుకుందేమీ లేదు.

Updated : 14 Mar 2023 09:55 IST

ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అత్తమామలు ఆదరించలేదు. మాకు ఇద్దరు పిల్లలు. రెండు నెలల క్రితం మావారు ఓ ప్రమాదంలో మరణించారు. ఉద్యోగరీత్యా ఇప్పటివరకూ మేం వెనకేసుకుందేమీ లేదు. కానీ, మామగారి పేరుమీద కోట్ల విలువైన ఆస్తులున్నాయి. వాటిల్లో కొన్ని వారి తండ్రి నుంచి వచ్చినవి. మరికొన్ని ఆస్తినీ, ఆదాయాన్ని పెట్టుబడిగా పెట్టి సంపాదించినవి. వాటిల్లో పిల్లలకేమైనా వాటా లభిస్తుందా? ఇందుకోసం నేనేం చేయాలి?

 ఓ సోదరి

మీ మామగారు అనుభవిస్తున్న ఆస్తి ఆయన పిత్రార్జితమైతే... అందులో మీ భర్తకి రావాల్సిన వాటాని అతడి పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది. మీ మామగారి స్వార్జితం, పిత్రార్జితం వేర్వేరుగా ఉన్నాయా? లేదంటే తన స్వార్జితాన్ని పిత్రార్జితంతో కలిపి ఏమైనా అభివృద్ధి చేశారా అన్న విషయాల గురించి మీకు కచ్చితమైన సమాచారం తెలిసి ఉండాలి. ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలూ కావాలి. హిందూ వారసత్వ చట్టం-2005లోని సెక్షన్‌-6కి కొంత సవరణ చేయడం జరిగింది. దాని ప్రకారం పిత్రార్జితంలో బతికున్న కొడుకులతో పాటు చనిపోయిన కొడుకు పిల్లలకు కూడా సమాన హక్కులు ఉంటాయి. మీ పెళ్లి చట్టప్రకారం జరిగితే...పిల్లల్ని వారసులుగా నిరూపిస్తూ మీ మామగారి మీద పార్టిషన్‌ దావా వేయండి. అందులో మీ భర్తకి రావాల్సిన వాటా... మీ బిడ్డలకు చెందాలని కోరండి. అయితే, ఇది కేవలం భాగాలు చేయని ఆస్తికి మాత్రమే వర్తిస్తుంది. 2004కి ముందు భాగాలు చేసిన ఆస్తికి వర్తించదు. అలానే, గృహహింస నిరోధక చట్టంలో ఆర్థిక హింస కింద... మీకు రావలసిన, ఇవ్వవలసిన ఆస్తులు ఇవ్వకపోవడం, జీవనభృతి కల్పించకపోవడం వంటి వాటిని పరిగణిస్తారు. వారు ఆస్తిని అనుభవిస్తూ మీ కనీస అవసరాలు తీర్చకపోవడాన్నీ ఆర్థిక హింస కిందే లెక్కేస్తారు. గృహహింస చట్టంలోని సెక్షన్‌ 12లోని  ఈ విషయాల్ని ప్రస్తావిస్తూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయొచ్చు. సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 125 ప్రకారం మెయింటెనెన్స్‌ కోసం కూడా కేసు దాఖలు చేయొచ్చు.  హిందూ అడాప్షన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 19 ప్రకారం వింతంతు కోడలు మామగారి నుంచి జీవనభృతిని పొందడానికి అర్హురాలు. భర్త ఆస్తి నుంచి తనకు రావాల్సిన భృతిని ఇవ్వమని అడగొచ్చు. అయితే, ఆమె తనని తాను పోషించుకోలేని స్థితిలో ఉందని నిరూపించుకోవాలి. ఈ కేసు విషయంలో ఆస్తి పత్రాలు సంపాదించడం, లాయర్‌ని పెట్టుకోవడం, కోర్టు ఖర్చులు వంటివి కష్టం అనిపిస్తే లీగల్‌ సర్వీస్‌ అథారిటీ వారిని సంప్రదించొచ్చు. వారు మీ తరఫున లాయర్‌ని ఏర్పాటు చేస్తారు. ముందు వీలయినంత తొందరగా... మధ్యవర్తుల సాయంతో మాట్లాడి పరిష్కరించుకోండి. అది వీలుకాని పరిస్థితుల్లో కోర్టుకి వెళ్లండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్