ఎలక్ట్రాలిసిస్‌తో తగ్గుతాయా?

వయసు 18. ముఖం మీద విపరీతంగా అవాంఛిత రోమాలొస్తున్నాయి. ఎలక్ట్రాలిసిస్‌ చేయించుకుంటే త్వరగా పోతాయంటున్నారు స్నేహితులు.

Updated : 09 Apr 2023 04:15 IST

వయసు 18. ముఖం మీద విపరీతంగా అవాంఛిత రోమాలొస్తున్నాయి. ఎలక్ట్రాలిసిస్‌ చేయించుకుంటే త్వరగా పోతాయంటున్నారు స్నేహితులు. నిజమేనా? ఎన్నిరోజుల్లో తగ్గుతాయి?

- ఓ సోదరి

వ్వనంలోకి అడుగుపెట్టాక అవాంఛిత రోమాలు సాధారణమే. హార్మోనుల్లో అసమతుల్యత, పీసీఓఎస్‌, కార్టిసాల్‌ ఎక్కువగా విడుదలవడం, ఓవరీస్‌లో సిస్ట్‌లున్నా, వంశపారంపర్యంగా కూడా వస్తుంటాయి. సాధారణంగా లేజర్‌, ఎలక్ట్రాలిసిస్‌ రెండింటినీ సూచిస్తాం. ఎలక్ట్రాలిసిస్‌లో సన్నటి దారం లాంటి సూది ద్వారా హెయిర్‌ ఫాలికిల్స్‌లోకి కరెంట్‌ పంపుతారు. అలా వెంట్రుకల పెరుగుదలను నిరోధిస్తారు. కొంచెం వేడిగా లేదా చురుక్కుమన్నట్లుగా అనిపిస్తుంది. కానీ.. పెద్దగా నొప్పేమీ ఉండదు. వారం నుంచి 15 రోజులకోసారి సెషన్‌ చేయించుకోవాలి. చాలా నెమ్మదిగా చేయాల్సి ఉంటుంది. ఇంకా ఖర్చుతో కూడుకున్నది కూడా. మొత్తం పూర్తవడానికి ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు పడుతుంది. అయితే శాశ్వత ఫలితం ఉంటుంది. తెల్ల వెంట్రుకలపైనా పనిచేస్తుంది. చేయించుకున్నాకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుపాటు ఎండలో తిరగకూడదు, చెమట పట్టకుండా చూసుకోవాలి. మేకప్‌కీ దూరంగా ఉండాలి. ఈ చికిత్సతో సమస్యల్లా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లకీ అవకాశముంటుంది. అందుకే శుభ్రత పాటిస్తున్నారా? నమ్మకమైన సంస్థేనా అనేది చెక్‌ చేసుకోవాలి. సొంత సూదిని తీసుకెళ్లడం ఉత్తమం. కొన్నిసార్లు మచ్చలూ పడొచ్చు.. అయితే చాలా అరుదు. కొద్ది రోజులకి తగ్గిపోతాయి. కాబట్టి, బ్లీచింగ్‌ వంటివి చేయకూడదు. లేజర్‌ ఇంత సమయం తీసుకోదు. త్వరిత ఫలితం ఉంటుంది. సమస్యల్లా ఇది నల్లని కేశాలకే పని చేస్తుంది. ముఖం కంటే చేతులు, కాళ్లకి మెరుగ్గా పనిచేస్తుంది. 8-10 సిట్టింగ్స్‌ తీసుకుంటే చాలు. 90 శాతం వరకూ తగ్గుతాయి. కాబట్టి, లేజర్‌, ఎలక్ట్రాలిసిస్‌ కలిపి చేయించుకోండి. త్వరిత ఫలితం. ఖర్చు తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్