విలన్‌లా చూస్తున్నారు!

ప్రసూతి సెలవు తర్వాత ఇటీవలే ఆఫీసుకొచ్చా. సాదరంగా ఆహ్వానిస్తారనుకుంటే నన్నో విలన్‌లా చూడటం, పని ఇవ్వకపోవడం లాంటివి చేస్తున్నారు.

Published : 03 May 2023 00:15 IST

ప్రసూతి సెలవు తర్వాత ఇటీవలే ఆఫీసుకొచ్చా. సాదరంగా ఆహ్వానిస్తారనుకుంటే నన్నో విలన్‌లా చూడటం, పని ఇవ్వకపోవడం లాంటివి చేస్తున్నారు. ‘నీ వల్ల మాకు ఇన్ని నెలలు సరిగా సెలవులు లేవు’ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అమ్మను కావడం తప్పా? సహోద్యోగులే ఇలా ప్రవర్తిస్తోంటే బాధేస్తోంది. నేనేం చేయాలి?

 నిహిత

మ్మయ్యాక తిరిగి ఉద్యోగంలో చేరడం ఓ సవాలు. అలాంటిది తిరిగి ఆఫీసులో చేరగానే ఇలాంటి పరిస్థితి ఎదురవడం బాధించడమే కాదు ఒత్తిడికీ దారి తీస్తుంది. నిజానికి మీ బాస్‌ కూడా కొత్త అమ్మగా మీ బాధ్యతలు అర్థం చేసుకొని కాస్త దన్నుగా నిలిస్తే తిరిగి పనిలో కుదురుకోవడం సులువవుతుంది. కానీ వాస్తవ పరిస్థితులేమో ఇందుకు విరుద్ధంగా ఉంటాయి. చేసేదేమీలేక మౌనంగా భరించే వారే ఎక్కువ. మీరు మాత్రం ‘నా ప్రసూతి సెలవులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాయి. కానీ నేను చేసింది కంపెనీ పాలసీలకు విరుద్ధమేమీ కాదు. మీరు మామూలుగా అన్నా, కావాలని అన్నా.. ఈ ప్రవర్తన, మాటలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి’ అని ధైర్యంగా అనేయండి. అయినా ద్వేషం, వేరుచేయడం వంటివి కొనసాగితే పైవాళ్లు లేదా హెచ్‌ఆర్‌ వాళ్ల దృష్టికి తీసుకెళ్లండి. పిల్లలను వదిలేసి వెళుతున్నామనే బాధ, శారీరక అలసట, భావోద్వేగాల్లో హెచ్చు తగ్గులు వంటివి తిరిగి ఉద్యోగంలోకి చేరే అమ్మలను సాధారణంగానే వేధిస్తుంటాయి. దానికి సహచరుల నుంచి ఇలాంటి ప్రవర్తన తోడైతే ప్రశాంతత కరవవుతుంది. అలాగని డీలా పడటం వల్ల ప్రయోజనం లేదు. మానసికంగా, శారీరకంగా దృఢం అవ్వండి. మీ దృష్టంతా పని ఎంత మెరుగ్గా, సకాలంలో ఎలా పూర్తి చేయాలన్న దానిపైనే ఉండాలి. ఇలాంటి వాటి మీద శక్తిని వృథా చేసుకోవద్దు. ముఖ్యంగా పట్టించుకోవద్దు. బాధితురాలు అవుతారా.. ధైర్యంగా ఎదుర్కొంటారా అన్నది మీ చేతుల్లోనే ఉంది. ముందు డీలా పడక... పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధం కండి. పైవాళ్ల సాయానికీ వెనుకాడొద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్