నాకున్నవన్నీ కావాలంటుంది..

మాది ఉమ్మడి కుటుంబం. అన్నదమ్ముల్లో మావారే చిన్న. మేమిద్దరమూ ప్రభుత్వ ఉద్యోగులమే. మా బావగారు చిరుద్యోగి. తోటికోడలు పెద్దగా చదువుకోలేదు.

Published : 08 May 2023 00:15 IST

మాది ఉమ్మడి కుటుంబం. అన్నదమ్ముల్లో మావారే చిన్న. మేమిద్దరమూ ప్రభుత్వ ఉద్యోగులమే. మా బావగారు చిరుద్యోగి. తోటికోడలు పెద్దగా చదువుకోలేదు. నేను ఏది కొనుక్కున్నా తనకూ అలాంటివే కావాలని బావగారితో గొడవపడుతుంది. అత్తగారు సర్దిచెప్పబోతే అలుగుతుంది. ఆమె తీరు నాకు నచ్చడం లేదు. ఏం చేయాలో అర్థంకావడం లేదు.

- ఓ సోదరి

మీరు మీ తోటికోడలి కంటే కొంచెం ఎక్కువ చదువుకున్నారు కనుక ఉద్యోగం చేయగలుగుతున్నారు. అంత మాత్రాన ఆవిడ పట్ల చులకన భావం ఏర్పరచుకోకండి. ఆమె ఇంటిపట్టున ఉండి అన్ని బాధ్యతలూ నెరవేరుస్తూ మీకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆసరా అందిస్తోంది. అందుకే మీరు ఉద్యోగార్థం బయటకు వెళ్లినా.. స్థిమితంగా ఉండగలుగుతున్నారు. ఉమ్మడి కుటుంబాల్లో ఉండే సౌలభ్యమే ఇది. అందరూ ఒకే విధంగా లేకుంటేనేం.. ఒకరికొకరు సాయంగా, అండగా ఉంటారు. పరస్పరం ప్రేమాభిమానాలు పంచుకుంటూ స్నేహంగా, సరదాగా గడుపుతారు. ఇలా ఆలోచించినప్పుడు తోటికోడలి పట్ల వ్యతిరేకతకు బదులు సద్భావన పెరుగుతుంది. ఒకే ఇంట్లో ఉంటున్నందున.. చీరలూ నగలూ లాంటివి చూసినప్పుడు సహజసిద్ధమైన స్త్రీ స్వభావంతో అవి తనకూ ఉంటే బాగుండు అనుకుంటోంది. మిమ్మల్ని అడగలేక తన భర్తను అడుగుతోంది. ఆర్థిక వెసులుబాటు లేక అతను కొనివ్వకపోవడం వల్ల ఆ విషయం మీ వరకూ వస్తోంది. అందరూ కలిసిమెలిసి ఉండాలనే తపనతో అత్తగారు ఆమెకి సర్దిచెబుతున్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటే ఆమె చర్యలకు విసుగు రాదు. చిన్న చిన్న వస్తువులైతే మీరు కొనుక్కున్నప్పుడు ఆమెకీ కొనండి. ఖరీదైన నగలైతే పండుగలూ, వేడుకల సందర్భాల్లో ఆమెనీ ధరించమనండి. ఇలా చేస్తే కోపతాపాలకు బదులు ప్రేమాను బంధం బలపడుతుంది. అలాగే మీ తోటికోడలు ఇంటిపట్టునే ఉంటూ ఏదైనా చిన్న వ్యాపారం చేసుకునేలా చూడండి. సమయమూ వినియోగమౌతుంది, ఆర్థిక వెసులుబాటూ ఉంటుంది. అప్పుడిక ఇంకొ కరితో పోల్చుకోదు. ఈ ఆలంబనతో ఆమెలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలా చేస్తే అందరికీ అన్నివిధాలా బాగుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్