ముగ్గురం కలసి బతుకుదామంటున్నాడు!

పెద్దల సమక్షంలో ఐదేళ్ల క్రితం మా పెళ్లి జరిగింది. అయితే, అతడికి అప్పటికే వివాహమైంది. కానీ, ఏడేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు.

Published : 09 May 2023 00:27 IST

పెద్దల సమక్షంలో ఐదేళ్ల క్రితం మా పెళ్లి జరిగింది. అయితే, అతడికి అప్పటికే వివాహమైంది. కానీ, ఏడేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. విడాకులు మాత్రం తీసుకోలేదు. మళ్లీ ఆమెతో కలిసే ప్రసక్తి లేదనీ, నాతోనే జీవితమనీ చెప్పాడు. ఆయన తల్లిదండ్రులదీ అదే మాట. కానీ, ఇప్పుడు వారి కూతురి కోసం రాజీ పడదామని మొదటి భార్య నుంచి కబురొచ్చింది. అప్పటి నుంచి అతడిలో మార్పు కనిపిస్తోంది. ఇద్దరినీ బాగానే చూసుకుంటాననీ, నన్ను ఒప్పుకోమని బలవంతం చేస్తున్నాడు. లేదంటే ఇక నీకు జీవితమే ఉండదు. చట్ట ప్రకారం అసలు మనది పెళ్లే కాదంటున్నాడు. ఇప్పుడు చట్టపరంగా నాకెలాంటి సాయం అందుతుంది.

- ఓ సోదరి

మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవటం చట్టబద్ధం కాదు. మీరు పెళ్లి చేసుకునేటప్పటికే మొదటి భార్యకి ఏడేళ్లుగా దూరంగా ఉన్నాడు.. కాబట్టి విడాకులు తీసుకుంటేనే పెళ్లి చేసుకుంటానని చెప్పాల్సింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 5, క్లాజ్‌ (1)... భార్య/ భర్త ఉండగా రెండో పెళ్లి చేసుకోకూడదని చెబుతోంది. అతని అవసరం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు. కొడుకు సుఖం కోసం తల్లిదండ్రులూ వత్తాసు పలుకుతారు. మీరూ, మీ అమ్మా నాన్న.. ఒప్పుకోకపోతే వాళ్లెలా చేసుకునేవారు? పెళ్లి మీ స్వయంకృతాపరాధం. కాబట్టి ఇప్పుడు ఇద్దరితో ఉండేందుకు అతడు మిమ్మల్ని ఒప్పించాలనుకుంటున్నాడు. మీరు ఒప్పుకోకపోయేటప్పటికి మీతో పెళ్లి చట్ట ప్రకారం జరగలేదని బెదిరిస్తున్నాడు. మీ పెళ్లి చట్టబద్ధం కాక పోయినా మీరు కలిసి భార్యాభర్తలుగా జీవించారన్న నిజం చాలు.. అతణ్ని కోర్టుకు లాగడానికి. లేదంటే మీ పెళ్లిని రద్దు చేయమని కోర్టుకూ వెళ్లొచ్చు. మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, మానసికంగా హింసిస్తున్నాడని క్రిమినల్‌ కేసు కూడా వేయొచ్చు. గృహహింస చట్టం కింద రక్షణ కోరవచ్చు. అతడు మొదటి భార్యతో కలిసిపోవడాన్ని మీరు ఆపలేక పోవచ్చు. కానీ మిమ్మల్ని భార్యగా చూడకపోయినా, ఆస్తి విషయంలో ఏమైనా అన్యాయం చేయాలనుకుంటున్నా ముందే జాగ్రత్త పడటం మంచిది. నెలనెలా జీవన భృతి, పిల్లల చదువులు, వారి పెళ్లిళ్ల కోసం అతని దగ్గర నుంచి అవసరమైన మొత్తాన్ని తీసుకునేందుకు పెద్దమనుషులతో ఒప్పందం చేయించుకోండి. దాని ప్రకారం నడుచుకోకపోతే కోర్టులో మీరు వేసిన కేసులకు ఇది సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. లీగల్‌సర్వీసు అథారిటీ ద్వారా కూడా ప్రయత్నించొచ్చు. ఇందుకోసం ఒక కౌన్సెలర్‌ దగ్గర ప్రీలిటిగేషన్‌ కేసు ఫైల్‌ చేయొచ్చు. అయితే, ఇవన్నీ మీ మధ్య దూరాన్ని పెంచుతాయి. అలాకాకూడదంటే మధ్యవర్తిత్వమే మేలైన మార్గం. కాదు అనుకుంటే... గృహహింస చట్టం ద్వారా మెయింటెనెన్స్‌, కాంపన్సేషన్‌, రెసిడెన్స్‌ వంటివన్నీ పొందొచ్చు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్