పుట్టింటి ఆస్తి.. మాకు చెందదా?

నాకిద్దరు అన్నయ్యలు, నలుగురు అక్కలు. పెద్దన్నయ్యకు కూతురు. ఆ అమ్మాయి తప్ప వాళ్లింట్లో అందరూ మరణించారు. చిన్నన్నయ్యకు పిల్లల్లేరు. మాకందరికీ 1992కి ముందే పెళ్లిళ్లయ్యాయి. అమ్మానాన్నల పేరిట 5 సెంట్లచొప్పున భూమి ఉంది. నాకు పెళ్లప్పుడు కట్నకానుకలు ఇవ్వలేదని అమ్మ తన వాటా నాకివ్వమంది.

Published : 23 May 2023 00:43 IST

నాకిద్దరు అన్నయ్యలు, నలుగురు అక్కలు. పెద్దన్నయ్యకు కూతురు. ఆ అమ్మాయి తప్ప వాళ్లింట్లో అందరూ మరణించారు. చిన్నన్నయ్యకు పిల్లల్లేరు. మాకందరికీ 1992కి ముందే పెళ్లిళ్లయ్యాయి. అమ్మానాన్నల పేరిట 5 సెంట్లచొప్పున భూమి ఉంది. నాకు పెళ్లప్పుడు కట్నకానుకలు ఇవ్వలేదని అమ్మ తన వాటా నాకివ్వమంది. మేం బాగా స్థిరపడ్డామని చిన్నన్నయ్య నన్ను, అక్కలను ఒప్పించి దాన్ని తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. మా వదిన ఆ ఆస్తిని తన పేర రాయమని గొడవ చేస్తోంది. అది తన అక్క కొడుక్కి రాయాలని ఆమె ఆలోచన. మేం ఎక్కడ అడుగుతామోనని మమ్మల్ని పుట్టింటికీ రానివ్వడం లేదు. ఇక మరోవాటా ఐదు సెంట్లూ తనవే అనీ, మా మేనకోడలు ప్రేమ పెళ్లి చేసుకున్నందున అది తనకు చెందదని వాదిస్తోంది. ఇప్పుడు మా అన్నయ్య తర్వాత పుట్టింటి ఆస్తి మాకు చెందే అవకాశం లేదా?

- ఓ సోదరి

మీ వదిన మీ అందరికీ చెందాల్సిన ఆస్తిని తన పేర రాయించుకోవాలి అనుకోవడం స్వార్థం. సెక్షన్‌14 హిందూ వారసత్వ చట్టం ప్రకారం స్త్రీ పేరిట రాసినా, కొన్నా, సంపాదించినా స్వార్జితం కిందే భావిస్తారు. మీరు మీ చిన్న అన్నయ్యకి రాసిచ్చిన రెలింక్విష్‌మెంట్‌ డీడ్‌ రిజిస్టర్‌ అయ్యిందా? అవకపోతే మీ అందరిచేతా బలవంతాన సంతకాలు పెట్టించుకున్నాడని భాగం కోరుతూ పార్టిషన్‌ దావా.. మీరు ఆస్తి భాగాలు వదులుకున్నట్లు రాసిన కాగితం రిజిస్టరైతే దాని కాన్సిలేషన్‌ కోసం దావా వేయండి. అక్కలతోపాటు మీ పెద్దన్న కూతుర్నీ వాదిగా చేర్చాలి. ఆస్తి చేతులు మారకుండా మీ అన్న మీద ఇంజంక్షన్‌ సూట్‌ వేయండి. ఇందుకోసం రిజిస్ట్రార్‌, ఆర్‌డీఓ, ఎంఆర్‌ఓ లేదా రెవెన్యూ అధికారులకు లాయర్‌ చేత లీగల్‌ నోటీసు ఇప్పించండి. మీకు మీ అమ్మగారు ఇస్తానన్న వాటాకు ఏదైనా దాఖలా ఉంటే దాన్నీ లీగల్‌ నోటీసులో ప్రస్తావించొచ్చు. మిమ్మల్ని మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని, మీ ఆస్తిని అనుభవిస్తూ దానిమీద వచ్చే ఆదాయాన్ని అనుభవిస్తున్నారనీ మీ వదిన మీద గృహహింస కేసునీ వేయొచ్చు. మీ అన్నయ్య ఉండగానే ఇవన్నీ జరగాలి. మీరు, మీ మేనకోడలు అందరూ మొత్తం ఆస్తికి వారసులే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్