భరణం నేనివ్వాలట?

మా పెళ్లై పన్నెండేళ్లు. మావారు ఏ పనీ చేయకపోవడంతో మా మధ్య విభేదాలు వచ్చాయి. ఆయనకి దూరంగా ఉంటూ పిల్లల్ని పెంచుకుంటున్నా. బతుకుదెరువు కోసం ఉద్యోగం చేస్తున్నా. ఇప్పుడు విడాకులు ఇవ్వాలనుకుంటున్న విషయం తెలిసి... పెద్ద మనుషులు ‘నీ భర్త ఏ పనీ చేయట్లేదు కాబట్టి నువ్వే అతడికి భరణం ఇవ్వాలి. 

Published : 18 Jul 2023 00:36 IST

మా పెళ్లై పన్నెండేళ్లు. మావారు ఏ పనీ చేయకపోవడంతో మా మధ్య విభేదాలు వచ్చాయి. ఆయనకి దూరంగా ఉంటూ పిల్లల్ని పెంచుకుంటున్నా. బతుకుదెరువు కోసం ఉద్యోగం చేస్తున్నా. ఇప్పుడు విడాకులు ఇవ్వాలనుకుంటున్న విషయం తెలిసి... పెద్ద మనుషులు ‘నీ భర్త ఏ పనీ చేయట్లేదు కాబట్టి నువ్వే అతడికి భరణం ఇవ్వాలి.  కలిసి ఉంటే ఏ ఇబ్బందీ ఉండ’దంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది నిజమేనా? బాధ్యతలేని అతడిని నేనిక భరించలేననిపిస్తోంది? నా భర్త పేరున ఓ ఇల్లు ఉంది. అది బిడ్డలకు వస్తుందా? 

- ఓ సోదరి

మీరు ఎంత కాలం నుంచి దూరంగా ఉంటున్నారు. ఇన్నాళ్లూ విడాకులు ఎందుకు తీసుకోలేదు. భార్యాభర్తలు మనస్పర్థలతో రెండేళ్లూ, అంతకంటే ఎక్కువకాలం విడివిడిగా ఉంటే... హిందూ వివాహచట్టంలోని సెక్షన్‌ 13 కింద విడాకులు తీసుకోవడానికి ఒక కారణంగా చూపించొచ్చు. అయితే, ఈ విషయాన్ని అవకాశంగా తీసుకుని కొందరు మగవారు భార్యల్ని దూరం పెట్టి విడాకులకు ప్రయత్నిస్తున్నారు. బలవంతంగా ఇంట్లో నుంచి పంపేసి, తిరిగి రానివ్వకుండా చేసి ‘నా భార్య నాకు దూరంగా ఉంటోంది. కాబట్టి విడాకులు కావా’లంటే కుదరదు. దూరంగా ఉండడానికి ఎవరు కారణమో నిరూపించాలి. దగ్గర కావడానికి చేసిన ప్రయత్నాలు సాక్ష్యాలతో సహా చూపించాలి. ఇక, సీఆర్‌పీసీ-1973లోని సెక్షన్‌ 125 ప్రకారం భరణం అనేది అన్ని మతాలు, కులాల వారికి వర్తిస్తుంది. భార్య, భర్త నుంచి విడిగా ఉన్నా, విడాకులు తీసుకున్నా కూడా మెయింటెనెన్స్‌ కోరవచ్చు. హిందూ వివాహచట్టంలోని సెక్షన్‌-24 కింద కోర్టు కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు కూడా భరణాన్ని అడగొచ్చు. అయితే, సెక్షన్‌ 125 తనని తాను పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్న భార్య/భర్త మాత్రమే భరణానికి అర్హులనే విషయం స్పష్టంగా చెబుతోంది. సంపాదించే స్థోమత ఉండి కూడా ఆ పని చేయని భర్తలకు భరణం ఇవ్వాల్సిన బాధ్యత భార్యకు లేదు. ఒకవేళ అతడి పేరు మీద ఆస్తి ఉండి, ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నా కూడా దీన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక, అతడి పేరిట ఉన్న ఇల్లు మీ భర్త పిత్రార్జితం అయితే అందులో మీ పిల్లలకు కూడా భాగం ఉంటుంది. అది అమ్మకుండా వారితో భాగస్వామ్య దావా వేయించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్