గర్భస్రావం చేయించుకోకపోతే విడాకులేనట!

నాకు పెళ్లై నాలుగు నెలలు. ఇప్పుడు మూడో నెల గర్భవతిని. నేను నెల తప్పిన విషయం తెలిసిన దగ్గర్నుంచి అత్తమామలు, భర్త అబార్షన్‌ చేయించుకోమని వేధిస్తున్నారు.

Published : 28 Nov 2023 02:16 IST

నాకు పెళ్లై నాలుగు నెలలు. ఇప్పుడు మూడో నెల గర్భవతిని. నేను నెల తప్పిన విషయం తెలిసిన దగ్గర్నుంచి అత్తమామలు, భర్త అబార్షన్‌ చేయించుకోమని వేధిస్తున్నారు. లేదంటే విడాకులకు సిద్ధంగా ఉండమని తేల్చేశారు. నన్ను పుట్టింటికి పంపించి డైవోర్స్‌ నోటీసు ఇచ్చారు. అందుకు నేను ఒప్పుకోవట్లేదని లేనిపోని ఆరోపణలు చేస్తూ నిందలు వేస్తున్నారు. నాకు బిడ్డా, భర్తా ఇద్దరూ కావాలి. చట్టం ఏ విధంగా సాయం చేస్తుంది?

- ఓ సోదరి

బలవంతంగా అబార్షన్‌ చేయించడం నేరం. ఐపీసీలోని సెక్షన్‌ 312 కింద బలవంతంగా గర్భస్రావం చేయిస్తే మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. అసలు మిమ్మల్ని  అబార్షన్‌ ఎందుకు చేయించుకోమంటున్నారు? ఒకవేళ ఆడపిల్ల అని నిర్థరించి అలా చేస్తున్నారా? కారణం ఏదైనా అది నేరమే.  ఇలా మీ ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతం చేయడం గృహహింస కిందకు వస్తుంది. ముందు మీరు... దగ్గర్లోని ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌కి మీరు అనుభవిస్తోన్న గృహహింస పై ఫిర్యాదు చేయండి. వాళ్లు మీ అత్త మామల్నీ, భర్తనీ పిలిచి కౌన్సెలింగ్‌ చేస్తారు. వినకపోతే కేసు నమోదు చేస్తారు. నేరం రుజువైతే తగిన శిక్ష పడుతుంది. మీ వారు పంపిన డైవోర్స్‌ నోటీసు లాయర్‌ నుంచి వచ్చిందా? ఎందుకంటే, కోర్టు నుంచి పంపడానికి వీలు లేదు. ఆ నోటీసేంటో ముందు తెలుసుకోండి. ఒకవేళ న్యాయవాది పంపించి ఉంటే వేరే లాయర్‌తో సమాధానం ఇప్పించండి. కోర్టు నుంచి వస్తే... అబద్ధపు ఆరోపణలు చేసి మీతో పెళ్లి రద్దు చేయమని, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 12 కింద కేసు వేసి ఉండాలి. ఎందుకంటే పెళ్లైన సంవత్సరంలోపు డైవోర్స్‌ కేసు వేయడానికి లేదు. ఇక, మీరు గృహహింస చట్టం నుంచి రక్షణతోపాటు ఆ ఇంట్లో నివసించడానికీ, పోషణ వంటివాటిని హక్కులుగా పొందవచ్చు. దగ్గరలోని లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ వారిని సంప్రదిస్తే వారు మీ ఫిర్యాదు ఆధారంగా మీ తరఫున ఒక లాయర్‌ని పెట్టి మీకు సాయపడతారు. అంతకంటే ముందు ఈ విషయాన్ని పెద్ద మనుషుల దృష్టికీ తీసుకెళ్లండి. తప్పక న్యాయం జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్