పాపకి... ఉప్పు, కారం అలవాటు చేయొచ్చా!

మా మనవరాలి వయసు మూడేళ్లు. పెరుగన్నం లేదా తెల్ల అన్నం మాత్రమే తింటోంది. కూరలేవీ తినడం లేదు. వాళ్లమ్మ కూడా ఉప్పు, కారం మంచివి కాదని ఇవే పెడుతోంది.  కొన్ని రకాల పండ్లను మాత్రం తింటోంది.

Published : 30 Nov 2023 01:48 IST

మా మనవరాలి వయసు మూడేళ్లు. పెరుగన్నం లేదా తెల్ల అన్నం మాత్రమే తింటోంది. కూరలేవీ తినడం లేదు. వాళ్లమ్మ కూడా ఉప్పు, కారం మంచివి కాదని ఇవే పెడుతోంది.  కొన్ని రకాల పండ్లను మాత్రం తింటోంది. ఈ తీరు మంచిదేనా? ఈ వయసులో వారికి ఎలాంటి పోషకాలు ఇవ్వాలి. పిల్లలతో అన్నీ తినిపించాలంటే ఏం చేయాలి?

 ఓ సోదరి

పిల్లలకు ఏడాది దాటినప్పట్నుంచీ మనం ఏ ఆహారం తింటున్నామో అదే వాళ్లకూ అలవాటు చేయాలి. ఇప్పుడు అలవాటు చేయకపోతే కౌమార దశకు వచ్చేసరికి ఇబ్బందులు మొదలవుతాయి. మనం కొత్త వ్యక్తులతో ఎలా బెరుకుగా ఉంటామో.. పిల్లలు కూడా కొత్త ఆహారం అంటే అలానే ఆలోచిస్తారు. అలా కాకుండా ఉండాలంటే పప్పుదినుసులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నూనెలు, పాలు, పెరుగు, గుడ్లు, మాంసాహారం... ధాన్యాలన్నీ ఇవ్వొచ్చు. కానీ పెద్దవాళ్లు తినేదాంట్లో ఐదో వంతు మాత్రమే పెట్టాలి. మన ప్రాంతంలో అన్నం ఎక్కువగా తీసుకుంటాం. అది కాస్త తియ్యగా ఉంటుంది కాబట్టి ఉప్పు, కారం ఎక్కువ వేసి కూరగాయలు వండుకోవడం మన సంస్కృతిలో భాగమయ్యింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని కాస్త తగ్గించి వాడుకోవచ్చు. ఇంకా.. పిల్లలకు మాంసకృత్తులు సరిపోతున్నాయా, విటమిన్లు, మినరల్స్‌, పీచు లాంటివి అందిస్తున్నామా లేదా చూసుకోవాలి. ఎప్పుడూ అన్నమే పెట్టకుండా... తృణధాన్యాలతో చేసిన చపాతీ, రాగి ముద్ద, జావ, ఉడికించిన గుగ్గిళ్లు పెట్టొచ్చు. పండ్లు తినడం మంచిదే. పెద్దవుతున్న కొద్దీ శరీరానికి పోషకాల అవసరం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి పెద్దగా కారం ఉండని కిచిడీ, పొంగల్‌, పాలకూర పప్పు, వెజిటబుల్‌ రైస్‌ వంటివి తినిపించాలి. ఇలా చేస్తే పాపకి మైక్రోన్యూట్రియంట్స్‌, ఐరన్‌, విటమిన్‌ బి, ఎ, ఫోలిక్‌ యాసిడ్‌, పీచు లభ్యమవుతాయి. బొప్పాయి, దానిమ్మ, మామిడి, డ్రాగన్‌ ఫ్రూట్‌, రేగిపండ్లు వంటివి పెడుతూ ఉంటే ఆ రంగులకి ఆకర్షితులవుతారు. మనం కూడా తింటే మనల్ని గమనించి వాళ్లూ తింటారు. కూరగాయలు కొనేటప్పుడు, వంట చేస్తున్నప్పుడూ వాళ్లనూ వెంట ఉంచుకుంటే ఆహారం పట్ల ఆసక్తిని పెంచుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్