చిప్స్‌ తింటున్నాడు... ఎలా మానిపించాలి?

మా బాబు రోజూ చిప్స్‌ తింటూ ఉంటాడు. ఇంట్లో పెట్టే ఆహారం అసలు తీసుకోడు. వీటివల్ల ఏమైనా ప్రమాదం ఉందా? వాడితో ఎలా మానిపించాలి?

Updated : 22 Feb 2024 05:13 IST

మా బాబు రోజూ చిప్స్‌ తింటూ ఉంటాడు. ఇంట్లో పెట్టే ఆహారం అసలు తీసుకోడు. వీటివల్ల ఏమైనా ప్రమాదం ఉందా? వాడితో ఎలా మానిపించాలి?

సునీత, విజయవాడ.

పిల్లలు అన్నాక చిప్స్‌ తింటూ ఉంటారు. కానీ ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు. అదే తరచూ తినడం వల్ల అవి వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. చిప్స్‌లో రెండురకాలు ఉంటాయి. ఒకటి బంగాళాదుంప, అరటి వంటి వాటితో చేసేవి, మరొకటి పిండితో వండేవి. ఇవన్నీ నూనెలో ఎక్కువగా వేయిస్తారు. ఇంట్లో చేసినవి అయితే కాస్త పర్వాలేదు అదే బయట దొరికే స్నాక్స్‌లో రకరకాల మసాలాలు, కారప్పొడులు, ఉప్పు వంటివి ఎక్కువగా కలిపి తయారుచేస్తారు. నోటికి రుచిగా కరకరలాడుతూ ఎక్కువ సేపు నమిలే శ్రమ లేకుండా ఉన్నాయని వీటిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు పిల్లలు. ఈ రుచికి అలవాటు పడటంవల్ల వాళ్ల నాలుక వాటినే ఎక్కువగా కోరుకుంటుంది. అవి తింటే చాలు, వాళ్ల పొట్ట నిండిపోతుంది. కాబట్టి వేరే ఆహారం తినాలనిపించదు. చిప్స్‌లో కెలోరీలు ఎక్కువగా ఉంటాయి. శరీర పనితీరుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు వీటిద్వారా అందవు. దాని కారణంగా ఐరన్‌, జింక్‌, విటమిన్‌-ఎ, సి లోపాలు తలెత్తుతాయి. అంతేకాదు, త్వరగా అలసిపోవడం, ఏదైనా అనారోగ్యం వస్తే తొందరగా నయం కాకపోవడం, చివరకు కంటిచూపును కోల్పోయే పరిస్థితి కూడా పిల్లల్లో రావొచ్చు. కాబట్టి నెమ్మదిగా వారితో మానిపించే ప్రయత్నం చేయాలి. అలాఅని వెంటనే చిప్స్‌ తినొద్దు అంటే వినరు. వారం పదిరోజులకోసారి ఇస్తూ వాటిని తింటే వచ్చే దుష్ఫలితాల గురించి చెప్పాలి. భోజనంలో నూనె, పప్పు గింజలు, తృణధాన్యాలతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, అన్ని రంగుల పండ్లూ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అలవాటైతే క్రమేణా వాళ్లే చిప్స్‌ అడగడం మానేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్