మాయిశ్చ రైజర్‌ సరిపోదా?

నాది పొడిచర్మం. ఉదయం, సాయంత్రం మాయిశ్చరైజర్‌ తప్పక రాస్తాను. ఈ వేసవిలోనూ బాగా పొడిగా మారుతోంది. పైగా ఈమధ్య ఎందుకో నా ముఖం ఛాయ తగ్గినట్లుగా కూడా కనిపిస్తోంది. మాయిశ్చరైజర్‌ సరిపోదా? ఇంకేదైనా వాడాలా?

Published : 21 Apr 2024 02:02 IST

నాది పొడిచర్మం. ఉదయం, సాయంత్రం మాయిశ్చరైజర్‌ తప్పక రాస్తాను. ఈ వేసవిలోనూ బాగా పొడిగా మారుతోంది. పైగా ఈమధ్య ఎందుకో నా ముఖం ఛాయ తగ్గినట్లుగా కూడా కనిపిస్తోంది. మాయిశ్చరైజర్‌ సరిపోదా? ఇంకేదైనా వాడాలా?

ఓ సోదరి

పొడి చర్మం వారికి పొట్టు రాలినట్లుగా, గరుకుగా, కళావిహీనంగా మారుతుండటం సహజమే. మీ చర్మంలో సహజనూనెలు తక్కువగా ఉండటంతో ఏ వాతావరణంలోనైనా పొడిగానే కనిపిస్తుంది. ఇక ఎండలోకి వెళితే ఛాయ తగ్గడమే కాదు, చర్మమూ త్వరగా దెబ్బతింటుంది. ఎక్కువ రసాయనాలున్న సబ్బులు వాడటం, తరచూ ముఖాన్ని కడగడం, థైరాయిడ్‌, ఎక్కువసేపు ఏసీలో ఉండటం లాంటివీ వీళ్లకు ఇబ్బంది పెంచేవే. మీరు సబ్బు కాకుండా మైల్డ్‌ క్లెన్సర్‌ అదీ జెల్‌ బేస్‌డ్‌ది వాడండి. స్నానం పూర్తయిన వెంటనే మాయిశ్చరైజర్‌, సన్‌స్క్రీన్‌ క్రీమ్‌లు రాయాలి. బాడీ ఆయిల్స్‌నీ అప్పుడప్పుడూ రాస్తే మేలు. బయటికి వెళ్లాల్సి వస్తే ముఖానికి ఎండ తగలకుండా స్కార్ఫ్‌ లేదా టోపీ వాడటం, ఎక్కువ మొత్తంలో నీళ్లు తీసుకోవడం తప్పనిసరి. మీకు హెవీ మేకప్‌ పనికిరాదు. అవసరమైతే లైట్‌, ఆయిల్‌ బేస్‌డ్‌ వాటిని ఉపయోగించాలి. మీకు కళ్ల చుట్టూ ఉన్న చర్మం మరింత సున్నితంగా ఉంటుంది. ఐక్రీమ్‌నీ భాగం చేసుకుంటే మేలు. మీ క్రీమ్‌ల్లో అలోవెరా, హైలురోనిక్‌ యాసిడ్‌, సెరమైడ్‌, లాక్టిక్‌ యాసిడ్‌, ఆలివ్‌ ఆయిల్‌ ఉన్నవి వాడితే మేలు. వారానికోసారి కొబ్బరినూనెలో కాస్త మెత్తని పంచదార కలిపి కానీ, ఓట్‌మీల్‌ పౌడర్‌కి కొద్దిగా తేనె, తగినన్ని నీళ్లు కలిపిగానీ 30 నిమిషాలు మృదువుగా స్క్రబ్‌ చేయాలి. దీంతో మృతకణాలు తొలగిపోతాయి. వీటితోపాటు కారం, చక్కెర, గ్లూటెన్‌ ఎక్కువగా ఉన్నవాటికీ ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌కీ దూరంగా ఉండాలి. తాజాపండ్లు, కూరగాయలతోపాటు నట్స్‌, గుమ్మడి, చియా గింజలు, గ్రీన్‌టీ తరచూ తీసుకోవాలి. వారానికి రెండుసార్లు పండ్లు, పెరుగు, తేనెతో సహజ మాస్క్‌లు వేయండి. సమస్య తీరుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్