వేసవిలో జుట్టు ఆరోగ్యానికి..!

చాలామంది వేసవి కాలంలో చర్మ సంరక్షణ విషయంలో తీసుకున్నన్ని జాగ్రత్తలు కురుల విషయంలో తీసుకోరు. దాంతో వేడికి జుట్టు ఆరోగ్యం దెబ్బతినడం, చెమట కారణంగా కుదుళ్లలో సమస్యలు రావడం....

Published : 31 Mar 2024 10:12 IST

చాలామంది వేసవి కాలంలో చర్మ సంరక్షణ విషయంలో తీసుకున్నన్ని జాగ్రత్తలు కురుల విషయంలో తీసుకోరు. దాంతో వేడికి జుట్టు ఆరోగ్యం దెబ్బతినడం, చెమట కారణంగా కుదుళ్లలో సమస్యలు రావడం, ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం ఉపయోగించే ఏసీలు, కూలర్ల వల్ల జుట్టు నిర్జీవమైపోవడం.. వంటివి జరుగుతాయి. అందుకే ఈ కాలంలో కురుల సంరక్షణా ముఖ్యమే అంటున్నారు నిపుణులు. మరి, వేసవిలో జుట్టు ఆరోగ్యానికి ఉపకరించే కొన్ని హెయిర్‌ ప్యాక్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!

తేనె+ఆలివ్‌ నూనె..
పావు కప్పు తేనెను తీసుకొని సన్నని సెగపై గోరువెచ్చగా వేడి చేయాలి. దీనికి పావు కప్పు ఆలివ్‌ నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసుకుని వేడి నీటిలో ముంచిన టవల్‌ను చుట్టుకోవాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమంలో ఆలివ్‌ నూనెకి బదులుగా కొబ్బరి నూనెను కూడా వాడచ్చు. ఈ హెయిర్‌ ప్యాక్‌ పొడిబారిన జుట్టుకు తిరిగి జీవం పోస్తుంది.

ఉసిరితో..!
ఎండ వల్ల జుట్టు పొడిబారడం, చివర్లు చిట్లడం.. లాంటి సమస్యలతో పాటు జుట్టు కూడా ఎక్కువగా రాలుతుంది. ఈ సమస్యకు ఉసిరితో చెక్‌ పెట్టొచ్చు. కొన్ని ఉసిరి కాయలను తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దను కుదుళ్లకు పట్టించి, మృదువుగా రుద్దుకోవాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. తలస్నానానికి ముందు ప్రతిసారీ ఈ చిట్కాను పాటించడం వల్ల జుట్టు రాలే సమస్య అదుపులోకి వస్తుంది.

కోడిగుడ్డుతో..
ఒక గిన్నెలో చెంచా నిమ్మరసం, కోడిగుడ్లలోని రెండు పచ్చసొనలు, ఒక తెల్లసొన, చెంచా తేనె తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి తలకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. కోడిగుడ్డు జుట్టుకు పోషణనిస్తుంది. తేనె జుట్టు కోల్పోయిన తేమను తిరిగి అందిస్తుంది.

మినప్పప్పుతో..
అర కప్పు మినప్పప్పుకి ఒక చెంచా మెంతులు కలిపి మెత్తని పొడిలా చేసుకోవాలి. దీనికి అర కప్పు పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. మెంతులు వెంట్రుకల చివర్లు చిట్లడాన్ని తగ్గిస్తే, మినప్పప్పు జుట్టు కుదుళ్లు బలంగా చేయడంతో పాటు పొడవుగా పెరిగేలా చేస్తుంది.

కొబ్బరి నూనె+నిమ్మరసం
కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి రోజూ ఉదయం, సాయంత్రం కుదుళ్లకు పట్టించాలి. ఇలా చేస్తే జుట్టు చివర్లు చిట్లకుండా ఉండటంతో పాటు పొడిబారే సమస్య దరిచేరదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్