Hair Extensions: వీటి విషయంలోనూ సంరక్షణ అవసరం!
కేశ సంపద మన అందాన్ని ఇనుమడిస్తుంది. అయితే జీవనశైలిలో మనం చేసే పొరపాట్లు, వాతావరణ కాలుష్యం.. వంటి పలు కారణాల వల్ల జుట్టు రాలడం, పలచబడడం.. వంటి సమస్యలొస్తాయి. వీటిని కవర్ చేసుకోవడానికి, జుట్టు ఒత్తుగా కనిపించేలా చేయడానికి హెయిర్ టాపర్స్....
కేశ సంపద మన అందాన్ని ఇనుమడిస్తుంది. అయితే జీవనశైలిలో మనం చేసే పొరపాట్లు, వాతావరణ కాలుష్యం.. వంటి పలు కారణాల వల్ల జుట్టు రాలడం, పలచబడడం.. వంటి సమస్యలొస్తాయి. వీటిని కవర్ చేసుకోవడానికి, జుట్టు ఒత్తుగా కనిపించేలా చేయడానికి హెయిర్ టాపర్స్, హెయిర్ ఎక్స్‌టెన్షన్స్.. వంటివి వాడడం ఇప్పుడు కామనైపోయింది. అయితే వాడకం పూర్తయ్యాక పనైపోయిందని పక్కన పడేయకుండా.. జుట్టులాగే వీటినీ సంరక్షించుకోవడం ముఖ్యమంటున్నారు సౌందర్య నిపుణులు. అప్పుడే అవి ఎక్కువ కాలం పాటు మన్నడంతో పాటు సహజసిద్ధమైన లుక్‌ని అందిస్తాయంటున్నారు. మరి, హెయిర్ టాపర్స్, హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ సంరక్షణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం రండి..
⚛ హెయిర్ ఎక్స్‌టెన్షన్స్, టాపర్స్.. వంటివి సహజమైనవి కాదు కదా అన్న ఉద్దేశంతో చాలామంది వీటి వాడకం పూర్తయ్యాక పక్కన పడేస్తుంటారు. మళ్లీ అవసరం వచ్చినప్పుడు కానీ ఇవి గుర్తుకు రావు. అయితే వీటి విషయంలో ఇంత నిర్లక్ష్యం తగదంటున్నారు నిపుణులు. మన జుట్టును నిర్ణీత వ్యవధుల్లో ఎలాగైతే షాంపూ చేసుకోవడం, కండిషనింగ్.. వంటివి చేస్తామో.. వీటి విషయంలోనూ ఈ పరిశుభ్రతా ప్రమాణాలు పాటించాలంటున్నారు. తద్వారా అవి ఎక్కువ కాలం మన్నడంతో పాటు వాటిని ధరించినప్పుడు మన జుట్టులో కలిసిపోయి న్యాచురల్ లుక్‌ని ఇస్తాయి.
⚛ ఇక వీటిని షాంపూ, కండిషనింగ్ చేసిన తర్వాత.. ఆరబెట్టడానికి టవల్‌తో రుద్దడం, డ్రయర్స్ ఉపయోగించడం సరికాదు.. కాబట్టి సహజసిద్ధంగానే వీటిని ఆరబెట్టడం మంచిదంటున్నారు నిపుణులు.
⚛ సరైన మెయింటెనెన్స్ లేకపోతే ఈ పెట్టుడు జుట్టు త్వరగా చిక్కు పడిపోతుంది. కాబట్టి రోజులకు రోజులు వీటిని అలాగే వదిలేయకుండా మృదువైన బ్రిజిల్స్ ఉన్న దువ్వెనతో దువ్వడం మంచిది. వాటి సంరక్షణలో ఇదీ ముఖ్యమే!
⚛ హెయిర్ ఎక్స్‌టెన్షన్స్‌ని జుట్టు కుదుళ్లపై సరైన రీతిలో అమర్చుకోవడమూ ముఖ్యమేనంటున్నారు నిపుణులు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. మనకు అసౌకర్యం కలగడంతో పాటు జుట్టూ డ్యామేజ్ అవుతుందట!
⚛ జుట్టును కర్లీగా, ఫ్లాట్‌గా.. ఇలా మనకు కావాల్సినట్లుగా తీర్చిదిద్దుకోవడానికి ప్రస్తుతం చాలా రకాల స్టైలింగ్ టూల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి నుంచి వెలువడే వేడి జుట్టుపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉండడానికి ముందుగా హీట్ ప్రొటెక్టెంట్ ఉత్పత్తులు జుట్టుకు అప్లై చేసుకుంటాం. అదే విధంగా మనం వాడే ఎక్స్‌టెన్షన్స్‌కీ ఈ ఉత్పత్తులు అప్లై చేశాకే స్టైలింగ్ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
⚛ హెయిర్ టాపర్స్/ఎక్స్‌టెన్షన్స్‌ని తరచూ వాడే వారు కొందరుంటారు. అయితే వీటిని ఎక్కువ సమయం వాడడమూ మంచిది కాదట! తద్వారా ఇవి జుట్టు తెగిపోవడానికి, రాలిపోవడానికి కారణమవుతాయట! అందుకే అకేషనల్‌గా అది కూడా తక్కువ సమయమే ఉపయోగించమంటున్నారు నిపుణులు.
⚛ కొంతమంది ఓపిక లేక హెయిర్ ఎక్స్‌టెన్షన్స్/టాపర్స్ తొలగించకుండానే నిద్రకు ఉపక్రమిస్తుంటారు. అయితే దీనివల్ల మన జుట్టు, ఈ పెట్టుడు జుట్టు.. రెండూ చిక్కులు పడి.. జుట్టు మరింత ఎక్కువగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పడుకునే ముందు మేకప్ ఎలాగైతే తొలగించుకుంటామో.. అదే విధంగా వీటినీ తొలగించుకోవాలంటున్నారు నిపుణులు.
⚛ ఈత కొట్టేటప్పుడు, వర్షంలో.. హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ ధరించడం వల్ల.. సహజసిద్ధమైన జుట్టు చిక్కులు పడి డ్యామేజ్ అయ్యే అవకాశాలే ఎక్కువంటున్నారు నిపుణులు.
⚛ జుట్టుకైనా, జుట్టు ఎక్స్‌టెన్షన్స్‌కైనా సిలికాన్ ఆధారిత ఉత్పత్తులు వాడకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఇవి జుట్టును పొడిబారిపోయేలా చేయడమే ఇందుకు కారణం!
⚛ హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ సంరక్షణలో భాగంగా.. ప్రొటీన్ ఆధారిత ఉత్పత్తులకు దూరంగా ఉండమంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటి తయారీలోనే ప్రొటీన్‌ని ఒక లేయర్‌గా ఉపయోగిస్తారట!
⚛ మన జుట్టు సంరక్షణలో భాగంగా.. అప్పుడప్పుడూ ఇంట్లో తయారుచేసుకున్న హెయిర్ మాస్క్‌లు/ప్యాక్‌లు వేసుకుంటుంటాం. వీటిని ఎక్స్‌టెన్షన్స్‌కీ వాడచ్చంటున్నారు నిపుణులు. తద్వారా అవి మన జుట్టులాగే తేమను కోల్పోకుండా, కాంతివంతంగా కనిపిస్తాయట!
ఇక వీటన్నింటితో పాటు మన జుట్టు రంగు, టెక్స్చర్, తత్వాన్ని బట్టి.. నాణ్యమైన హెయిర్ ఎక్స్‌టెన్షన్స్/టాపర్స్‌ని ఎంచుకుంటే అవి ఎక్కువ కాలం మన్నడంతో పాటు మనకూ న్యాచురల్ లుక్‌ని అందిస్తాయి. అలాగే వీటి విషయంలో ఇంకేమైనా సందేహాలుంటే నిపుణులను అడిగి నివృత్తి చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.