విధిని ఎదిరించి.. విజేతగా నిలిచి

ఓటమి కంటే కొద్దితేడాతో చేజారిన లక్ష్యం మరింత బాధిస్తుంది. అలాంటి వరుస వైఫల్యాలు ఎన్నో చూశారామె. ప్రమాదం చావు అంచుల వరకూ తీసుకెళ్లినా.. కన్నకొడుకే తనని చూసి భయపడ్డా.. ఆమె గురి మాత్రం లక్ష్య సాధన పైనే! ఆ పోరాటపటిమే చివరకు కోరుకున్న ప్రభుత్వోద్యోగం సాధించేలా చేసింది.

Published : 17 Jan 2023 00:22 IST

ఓటమి కంటే కొద్దితేడాతో చేజారిన లక్ష్యం మరింత బాధిస్తుంది. అలాంటి వరుస వైఫల్యాలు ఎన్నో చూశారామె. ప్రమాదం చావు అంచుల వరకూ తీసుకెళ్లినా.. కన్నకొడుకే తనని చూసి భయపడ్డా.. ఆమె గురి మాత్రం లక్ష్య సాధన పైనే! ఆ పోరాటపటిమే చివరకు కోరుకున్న ప్రభుత్వోద్యోగం సాధించేలా చేసింది. సమస్యల సముద్రాన్ని ఆత్మవిశ్వాసంతో ఈదేస్తున్న మిట్ట ఉమారాణి.. వసుంధరతో తన ప్రయాణాన్ని పంచుకున్నారిలా..

ప్రభుత్వ ఉపాధ్యాయురాలవ్వడం.. చిన్నప్పటి నుంచీ నా లక్ష్యమిదే! మాది కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌. 1997లో డిగ్రీ అవ్వగానే మిట్ట మనోహర్‌తో పెళ్లైనా.. ప్రయత్నం ఆపలేదు. ఏళ్లు గడుస్తున్నా పిల్లల్లేరు. ఆసుపత్రుల చుట్టూ తిరిగితే 2004లో బాబు పుట్టాడు. ఆ తర్వాత బీఈడీ, ఎమ్మే తెలుగు చేశా. 2002లో అన్‌ట్రెయిన్డ్‌ డీఎస్సీ రాస్తే.. 1.5 మార్కులతో, 2008లో అరమార్కులో చేజారింది. దీనికితోడు ఆర్థిక కష్టాలు. మంచిర్యాలకు మకాం మార్చి, అక్కడో ప్రైవేటు స్కూల్లో చేరా. బాబుకి అక్కడే భోజనం. నేను ఇంటికొచ్చి తినేదాన్ని. 2010.. ఆ రోజూ అలాగే వచ్చా. తలుపు తీస్తే గుప్పుమని గ్యాస్‌ వాసన. వంటింట్లోకెళ్లి చూస్తోంటే పెద్ద పేలుడు. బయటకు పరిగెత్తేలోపే నాకు మంటలు అంటుకున్నాయి. నా చీరంతా కాలి.. ముఖం, చేతులు, కాళ్లు నల్లగా మాడిపోయాయి. అడుగు వేసిన చోటల్లా కాలిన చర్మం అంటుకొని పాదాల మచ్చలు. ఒళ్లంతా గాయాలతో గిలగిలలాడి పోయా. ఇంట్లో మావారూ లేరు. మా పక్కనే అద్దెకుండే ఓ అన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిస్తే.. బతకడం కష్టమన్నారు.

పెద్దాసుపత్రికి తీసుకెళ్తే అక్కడా అదే మాట. బాబు నావైపు చూడ్డానికే భయపడేవాడు. నాకేమైనా అయితే బాబు పరిస్థితేంటన్న భయం, ఒత్తిడితో మధుమేహం, రక్తపోటూ వచ్చాయి. నెల రోజులకు పైగా పోరాటం తర్వాత గండం గడిచింది. డాక్టర్లంతా భయపడ్డా.. ఒక దేవత ధైర్యం చేసి, కాలిన చర్మమంతా తొలగించి, చికిత్స చేసింది. చనిపోతాననుకున్నా.. బాబు కోసమే దేవుడు బతికించాడేమో అనిపించింది. కానీ వాడు దగ్గరికే రాకపోవడం బాధించేది. ఇంట్లోవాళ్లంతా బుజ్జగిస్తే రెండు నెలలకు దగ్గరి కొచ్చాడు. కోలుకున్నాక కాగజ్‌నగర్‌ చేరాం. ఉద్యోగంలోనూ చేరా. 2012లో మళ్లీ డీఎస్సీలో వైఫల్యం. ఇల్లు, ఉద్యోగం, పోటీ పరీక్షలకు చదవడం... వీటి సమన్వయం ఇబ్బందే. ఉద్యోగం మానేద్దామంటే ఆర్థిక సమస్యలు. నా ఆరోగ్యరీత్యా మావారు ఉద్యోగం మానేసి వ్యాపారంలోకొచ్చారు. అందుకే మరింత పట్టుదలగా ప్రయత్నించా... 2017లో విజయం సాధించా. ఎంపీయూపీఎస్‌ ఐనం స్కూల్లో లాంగ్వేజ్‌ పండిట్‌గా చేస్తున్నా.

ప్రభుత్వ ఉపాధ్యాయురాలినైన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను! నాన్న మాధవరావు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. అమ్మ రుక్మిణి పెద్దబాలశిక్ష మాత్రమే చదివింది. కానీ నేను ఎమ్మే తెలుగు చేసేప్పుడు ఏ సందేహం వచ్చినా తననే అడిగేదాన్ని. అంత పరిజ్ఞానం ఆమెకు. నన్ను ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా చూడాలన్న ఆవిడ కల నెరవేరడం చూడకుండానే వెళ్లిపోయిందన్నది నా బాధ. మహిళా సాధికారత కోసం కృషి చేస్తోన్న ‘నారీసేన’లో చేరి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. పబ్లిక్‌ స్పీకింగ్‌లో ఆన్‌లైన్‌ కోర్సు చేసి, నలుగురి ఎదుటా ధైర్యంగా మాట్లాడేలా నా విద్యార్థినులకూ శిక్షణిస్తున్నా. మా వద్ద బాల్యవివాహాలెక్కువ. పిల్లలు, తల్లిదండ్రులకు దానివల్ల నష్టాలపై అవగాహన కల్పిస్తున్నా. ఇప్పుడు చర్మం సాధారణ స్థితికి వచ్చినా చేతివేలు పనిచేయదు. కాలూ సరిగా నడవనీయదు. డబ్బులు లేకపోయినా, ఎన్ని సమస్యలు ఎదురైనా ఎలా తట్టుకొని నిలబడొచ్చో నా విద్యార్థులకు నన్నే ఉదాహరణగా చూపిస్తుంటా. బుర్రకథలు, హరికథలు వంటివీ నేర్పిస్తుంటా.  ధైర్యం, సాధించాలన్న పట్టుదల ఉంటే చాలు. ఎన్ని ఒడుదొడుకులెదురైనా ముందుకు సాగొచ్చని చెబుతుంటా.

- జంబుల మధూకర్‌, కాగజ్‌నగర్‌ గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్