Rimple Narula: ‘హీరామండి’ కోసం రెండున్నరేళ్లు కష్టపడ్డాం!

‘హీరామండి’.. స్వాతంత్ర్యానికి ముందు పాకిస్థాన్‌లోని ఈ వేశ్యా వాటికలో చోటుచేసుకున్న పలు సంఘటనల ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి - ది డైమండ్ బజార్’ వెబ్‌సిరీస్ తాజాగా విడుదలైంది. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ తదితరులు నటించిన ఈ చిత్రంలో కథ ఒకెత్తయితే కాస్ట్యూమ్స్‌ మరో ఎత్తు.

Published : 03 May 2024 12:27 IST

‘హీరామండి’.. స్వాతంత్ర్యానికి ముందు పాకిస్థాన్‌లోని ఈ వేశ్యా వాటికలో చోటుచేసుకున్న పలు సంఘటనల ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి - ది డైమండ్ బజార్’ వెబ్‌సిరీస్ తాజాగా విడుదలైంది. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ తదితరులు నటించిన ఈ చిత్రంలో కథ ఒకెత్తయితే కాస్ట్యూమ్స్‌ మరో ఎత్తు. తన సినిమాల్లో కాస్ట్యూమ్స్‌ విషయంలో ఏమాత్రం రాజీపడని దర్శక ధీరుడు భన్సాలీని.. తన ప్రయత్నంతో మెప్పించారు సెలబ్రిటీ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రింపుల్‌ నరులా. నాటి కాలపు ఫ్యాషన్‌ శైలిని ప్రతిబింబించేలా, లగ్జరీగా డిజైన్‌ చేసిన దుస్తులతో.. ఈ సిరీస్‌లోని పాత్రలకు ప్రాణం పోశారామె. తన సృజనాత్మకతతో, ఫ్యాషన్‌ నైపుణ్యాలతో ఈ వెబ్‌సిరీస్‌ కోసం వందలాది దుస్తుల్ని రూపొందించిన రింపుల్‌.. తన రెండున్నరేళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కిందంటూ ఆ అనుభవాల్ని ఇటీవలే ఓ సందర్భంలో పంచుకున్నారు.

బాలీవుడ్‌ లెజెండ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ లీలా భన్సాలీ సినిమా అంటే.. కథే కాదు.. అందులో నటీనటులు ధరించే కాస్ట్యూమ్స్‌ కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటాయి. ‘దేవ్‌దాస్‌’, ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘పద్మావత్‌’.. వంటి చరిత్రాత్మక చిత్రాలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం! ఇప్పుడీ లిస్టులో ‘హీరామండి’ కూడా చేరిపోయింది. ఆకట్టుకునే కథనానికి తోడు అద్భుతమైన దుస్తులతో అందులోని పాత్రలకు రూపకల్పన చేశారాయన. ఇలా ఆయన ఆలోచనల్ని తాను రూపొందించిన కాస్ట్యూమ్స్‌లో అచ్చుగుద్దినట్లుగా ప్రతిబింబించారు రింపుల్.

అస్సలు రాజీ పడరు!

సంజయ్‌.. తన సినిమాల్లో కథ, పాత్రల విషయంలో ఎంత పర్‌ఫెక్ట్‌గా వ్యవహరిస్తారో.. కాస్ట్యూమ్స్‌ విషయంలోనూ అంతే నిక్కచ్చిగా ఉంటారని, అస్సలు రాజీ పడరని చెబుతున్నారు రింపుల్.

‘సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం గంగూబాయి కథియావాడి సినిమా పూర్తయ్యాక సంజయ్‌ సర్‌ ఓ రోజు దిల్లీలోని మా ఫ్యాక్టరీకి వచ్చారు. హీరామండి చిత్ర కాస్ట్యూమ్స్‌కు సంబంధించి తన మనసులో ఉన్న ఆలోచనల్ని మాతో పంచుకున్నారు.. మా ఆలోచనల్నీ తెలుసుకున్నారు. సబ్యసాచి, అబుజానీ సందీప్‌ ఖోస్లా వంటి మేటి ఫ్యాషన్‌ డిజైనర్లతో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అలాంటిది హీరామండి కోసం మమ్మల్ని డిజైనర్లుగా ఎంచుకోవడంతో చాలా సంతోషించాం. మా క్రియేటివిటీకి స్వేచ్ఛనిస్తూనే.. దుస్తుల డిజైనింగ్‌లో తన ఆలోచనల్నీ రంగరించారు. ప్రతి కాస్ట్యూమ్‌ ఎలా కావాలనుకున్నారో అలాగే డిజైన్‌ చేయించుకున్నారు.. అంతేతప్ప ఎక్కడా రాజీ పడలేదు. ఇక ఈ వెబ్‌సిరీస్‌ షూటింగ్స్‌లోనూ తరచూ మమ్మల్ని భాగం చేసేవారు. ఫలితంగా అందులోని నటీనటుల పాత్రలకు తగినట్లుగా దుస్తులు డిజైన్‌ చేయడం సులువైంది. స్వాతంత్ర్యానికి ముందు స్త్రీపురుషుల ఆహార్యాన్ని ప్రతిబింబించేలా ఇందులో మహిళల కోసం గరారా, ఫార్సీ గరారా (ఫ్లోర్‌ లెంత్‌), షరారా, లెహెంగాలు, అనార్కలీ సెట్స్‌, చీరలు.. వంటివి రూపొందించాం. ఇక పురుషుల కోసం.. షేర్వాణీ, కుర్తా-పైజామా, అంగ్రాఖాస్‌, జమాస్‌, బంద్‌గాలాలతో పాటు మోడ్రన్ టచ్ కోసం సూట్స్‌, జాకెట్స్‌, బ్రిటిషర్ల ఫ్యాషన్‌ మూలాలతో మరిన్ని దుస్తులు.. వంటివి రూపొందించాం..’ అంటున్నారీ వింటేజ్‌ డిజైనర్‌. గతంలో ‘పద్మావత్‌’, ‘హౌస్‌ఫుల్‌ 4’, ‘భూల్‌ భులయ్యా 2’ సినిమాల కోసమూ పనిచేశారామె.

బామ్మ దుపట్టా చూశాక..!

కళ్లతో ప్రత్యక్షంగా చూసి దుస్తులు రూపొందించడం ఫ్యాషన్‌ డిజైనర్లకు అంత కష్టం కాకపోవచ్చు.. కానీ చరిత్రలో నాటి తరం వారు ఎలాంటి దుస్తులు ధరించేవారో.. ఛాయాచిత్రాల ద్వారా ఊహించుకొని డిజైన్‌ చేయడమంటే కత్తి మీద సామే అని చెప్పాలి. ‘హీరామండి’ కోసం దాదాపు రెండున్నరేళ్లు అలాంటి కష్టమే పడ్డామంటున్నారు రింపుల్.

‘చరిత్రాత్మక కథను ఎంచుకున్నప్పుడు.. కథనం, కాస్ట్యూమ్స్‌ ఇలా ప్రతి విషయంలోనూ పరిశోధన అవసరం. సంజయ్‌ సర్‌ హీరామండి కథ చెప్పాక నాటి దుస్తుల గురించి శోధించే పనిలో పడ్డాం. ఈ క్రమంలోనే లక్నో, ఆగ్రా, వారణాసి, గుజరాత్ వెళ్లి.. అప్పటివారు తమ దుస్తుల కోసం ఎలాంటి ఫ్యాబ్రిక్స్‌ వాడేవారో తెలుసుకున్నాం. ఈ వెబ్‌సిరీస్‌ కోసం అక్కడ్నుంచే ఫ్యాబ్రిక్స్‌ సేకరించాం. చరిత్రను తిరగేస్తే ఆ కాలంలో లేత రంగుల కంటే ముదురు రంగుల్నే ఎక్కువగా వాడేవారని, అందులోనూ ఎవరికి వారే వ్యక్తిగత ఫ్యాషన్‌ స్టైల్స్‌ని పాటించేవారని మాకు అర్థమైంది.

నా చిన్నప్పుడు ఓసారి మా బామ్మ చేత్తో రూపొందించిన ఓ భారీ దుపట్టాను ధరించడం చూశా. ఆమె కూడా పాకిస్థాన్‌లోని గుజ్రన్‌వాలా అనే ప్రాంతానికి చెందినవారు. ఇలా ఈ జ్ఞాపకం కూడా హీరామండి కోసం దుస్తులు రూపొందించడంలో ఉపయోగపడింది. ఇలా మొత్తంగా ఈ వెబ్‌సిరీస్‌లోని పాత్రలన్నింటికీ కలిపి 300-320 దాకా కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేశాం. వీటిని రూపొందించడానికి సుమారు 700 మంది కార్మికులు ఏడు నెలల పాటు కష్టపడ్డారు. వీటిలో చాలావరకు చేత్తో రూపొందించినవి, భారీ ఎంబ్రాయిడరీతో కూడుకున్నవి, మోటిఫ్స్‌తో హంగులద్దినవే ఉన్నాయి. ఈ కాస్ట్యూమ్స్‌ అన్నీ ఇంత హెవీగా, లగ్జరీగా ఉన్నప్పటికీ నటీనటులు ఆయా సన్నివేశాల్లో, పాటల్లో సౌకర్యంగా నటించేలా పలు జాగ్రత్తలు తీసుకున్నాం..’ అంటున్నారు రింపుల్.


రింపుల్‌ సిగ్నేచర్‌ స్టైల్!

పాశ్చాత్య పోకడల నేపథ్యంలో సంప్రదాయ దుస్తులు, నాటి కాలానికి చెందిన ప్రాచీన హస్తకళలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి. ఇలాంటి తరుణంలోనూ సంప్రదాయ ఫ్యాషన్లకు, వింటేజ్‌ స్టైల్స్‌కి పెద్ద పీట వేస్తున్నారు రింపుల్‌. తన భర్త హర్‌ప్రీత్‌ నరులాతో కలిసి ‘రింపుల్‌ అండ్‌ హర్‌ప్రీత్‌ నరులా లేబుల్‌’ పేరుతో ఓ వస్త్రాలయాన్ని ప్రారంభించిన ఆమె.. భారతీయ సంప్రదాయ ఫ్యాషన్‌ పరిమళాల్ని ఈతరం వారికి పరిచయం చేస్తున్నారు. ముదురు రంగు వింటేజ్‌ ఫ్యాబ్రిక్స్‌పై హస్తకళలు, ప్రాచీన మోటిఫ్స్ -ప్యాటర్న్స్‌తో హంగులద్దుతూ ఫ్యాషన్‌ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన సిగ్నేచర్‌ స్టైల్‌ని సృష్టించుకున్నారీ ట్రెడిషనల్‌ డిజైనర్‌. తమ ఫ్యాషన్‌ నైపుణ్యాలతో వెడ్డింగ్‌ అటైర్స్‌ని ఎక్కువగా రూపొందించే ఈ డిజైనర్‌ ద్వయం.. దీపికా పదుకొణె, కరీనా కపూర్‌, కరిష్మా కపూర్‌, మాధురీ దీక్షిత్‌, బిపాసా బసు, కృతీ సనన్‌, హ్యూమా ఖురేషీ, నేహా శర్మ, ప్రీతీ జింటా, కల్కీ కొచ్లిన్‌.. తదితర నాయికలకు వివిధ రకాల కాస్ట్యూమ్స్ రూపొందిస్తూ వారి ఫేవరెట్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌గా మారిపోయారు. మరోవైపు పలు ఫ్యాషన్‌ షోల కోసం ఆయా నటీనటులకు దుస్తులు రూపొందిస్తుంటారు రింపుల్‌-హర్‌ప్రీత్.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్