Published : 04/01/2023 20:19 IST

ఆ సలహాలు ఇచ్చే ముందు..!

ఈ రోజుల్లో వివిధ కారణాల వల్ల సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్న దంపతుల సంఖ్య పెరుగుతోంది. ఇది వారి వ్యక్తిగత సమస్య. ఈ విషయంలో ఇతరుల జోక్యం అనవసరం. కానీ, కొంతమంది దీనికి సంబంధించి అడగకపోయినా సరే వివిధ రకాల సలహాలు ఇస్తూ వారిని ఇబ్బంది పెడుతుంటారు. ప్రత్యేకించి కొన్ని కుటుంబాల్లో ఇలాంటి వైఖరి ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈక్రమంలో ఇలాంటి విషయాల గురించి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎక్కువ టెన్షన్‌ పడద్దు...!

సంతానలేమికి ఒత్తిడి కూడా ఒక కారణమనే అపోహ చాలామందిలో ఉంటుంది. నిజానికి ఈ సమస్యకు ఒత్తిడే ప్రధాన కారణం కాకపోవచ్చు. కానీ సంతానలేమితో బాధపడుతోన్న వారికి ‘ప్రశాంతంగా ఉండండి.. ఆశించిన ఫలితం వస్తుంది’ అనే సలహా ఇస్తుంటారు కొంతమంది. అయితే ఇలాంటి సలహా వల్ల వారిలో మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. దానివల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సలహాలు ఇవ్వకపోవడం మంచిది.

దత్తత తీసుకోవచ్చు కదా..!

పిల్లలు లేని వారికి ఈ సలహా చాలామంది నుంచి వస్తుంటుంది. సామాజిక స్పృహతో చూసినప్పుడు ఈ సలహా బాగానే ఉంటుంది. కానీ, పిల్లలు పుట్టలేదనే భావనను ఇది పూర్తిగా తుడిచేయలేదు. అలాగే సంతానలేమితో బాధపడుతోన్న తల్లిదండ్రులకు కూడా దత్తత తీసుకోవచ్చన్న విషయం తెలియకుండా ఉండదు. ఈ విషయం గురించి వారు అప్పటికే ఆలోచించి ఉండచ్చు. కాబట్టి, ఇలాంటి సలహాలతో వారి సమస్యను తిరిగి గుర్తు చేయద్దంటున్నారు నిపుణులు.

విశేషమా...!

పెళ్లి, ప్రెగ్నెన్సీ అనేవి వ్యక్తిగత అంశాలు. వీటి గురించి ఎవరికి వారు సొంత ప్రణాళికలు వేసుకుంటారు. కానీ ఇలాంటి అంశాల్లో వారి కంటే ఇతరులే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ పిల్లలకు సంబంధించి అనేక రకాల ప్రశ్నలు వేస్తుంటారు. ఈ క్రమంలో ప్రత్యేకించి సంతానలేమితో బాధపడుతోన్న స్నేహితులు, బంధువులను కలిసినప్పుడు పిల్లలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడకపోవడం మంచిదంటున్నారు నిపుణులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని