Rosaline Arokia Mary: పై అధికారులకు పదిసార్లు సంజాయిషీ ఇచ్చుకున్నా..!

నిజాయతీగా ఉండటం... విధుల్లో కచ్చితంగా వ్యవహరించడం ఈ రోజుల్లో అంత తేలికైన విషయాలా? ఎన్నో బెదిరింపులు ఉంటాయి.. పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది.

Updated : 27 Mar 2023 08:17 IST

నిజాయతీగా ఉండటం... విధుల్లో కచ్చితంగా వ్యవహరించడం ఈ రోజుల్లో అంత తేలికైన విషయాలా? ఎన్నో బెదిరింపులు ఉంటాయి.. పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అవన్నీ తట్టుకునే చీఫ్‌ టికెట్‌ ఇన్‌šస్పెక్టర్‌గా తను చేస్తున్న వృత్తికి న్యాయం చేశారు రోసలిన్‌ ఆరోకియా మేరీ. జరిమానాల రూపంలో కోటి రూపాయల వసూలు చేసి, రైల్వే మంత్రిత్వశాఖ నుంచి ప్రశంసలు అందుకొన్నారు ఈ చెన్నై మహిళ. ఈ క్రమంలో తనకెదురైన సవాళ్లని వసుంధరతో పంచుకున్నారు....

మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న టైలర్‌. ఉపాధి కోసం తిరునల్వేలి నుంచి చెన్నైకి వలసొచ్చారు. ముగ్గురు పిల్లల్లో నేనే పెద్దదాన్ని. చిన్నతనం నుంచీ ఆటలంటే ఆసక్తి. కానీ ఆ రోజుల్లో ఆడపిల్లల్ని ఆటలకు పంపించడం అరుదు. మొదట్లో ‘ఈ ఆటలవీ నీకెందుకులే’ అనేవారు నాన్న. పదో తరగతి స్కూల్‌ క్రీడోత్సవాల్లో నా పరుగుని గమనించిన నాన్న ఆటల్లో ప్రోత్సహించారు. డిగ్రీ పూర్తయ్యేలోపు అథ్లెటిక్స్‌లో జాతీయస్థాయి క్రీడాకారిణిగా రాణించా. 400మీ హర్డిల్స్‌లో తిరుగులేదనిపించుకున్నా. సీనియర్‌ నేషనల్స్‌లో 59.2 సెకన్లలోనే 400మీ హర్డిల్స్‌లో రికార్డు సాధించా. యూనివర్సిటీ క్రీడల్లోనూ అదే హవా. అప్పటిదాకా కేవలం పరుగే నా లోకంగా ఉండేది.

8 ఇంక్రిమెంట్లతో స్వాగతం..

2002లో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్నో పోటీపరీక్షలు రాశా. ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ అవకాశం వచ్చినా.. స్పోర్ట్స్‌ కోటాలో టికెట్ కలెక్టర్‌గా ఉద్యోగం సాధించా. నా ప్రతిభను చూసి మెరిట్కోటాలో 8 ఇంక్రిమెంట్లు ఇచ్చి మరీ స్వాగతించారు. మా కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన మొదటి అమ్మాయిని. ఆ జీతం వల్లే నేను, నా కుటుంబం మంచి జీవితాన్ని పొందాం. అందుకే నా వృత్తికి న్యాయం చేయాలని ఆ రోజే అనుకున్నా.

ఫిర్యాదుల్ని లెక్కచేయలేదు..

టికెట్ కలెక్టర్‌ ఉద్యోగంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. వాటిని అధిగమించే చీఫ్‌ టికెట్ ఇన్‌స్పెక్టర్‌ స్థాయికి వచ్చా. ఏవో కారణాలు చెప్పి టికెట్ లేకుండా రైలెక్కేవారుంటారు. టి¨కెట్ కొనే సమయంలేదని కొందరు, పాత టికెట్టు చూపించేవారు మరికొందరు. కానీ రైల్వే ఎంతోమందికి జీవనోపాధినిస్తోంది. అతి పెద్ద రవాణా వ్యవస్థ. అలాంటి సంస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రయాణికులమీదా ఉంది. అందుకే ముందు వాళ్ల బాధ్యతారాహిత్యాన్ని గుర్తుచేస్తా.. ఆ తర్వాతే ఫైన్లు వేస్తాం. ఎవరెన్ని సాకులు చెప్పినా నా డ్యూటీ నేను చేయాలికదా. ఈ నేపథ్యంలో నాపై ఎన్నో ఫిర్యాదులు పైఅధికారులకెళ్లాయి. అలా 10సార్లు సమాధానం చెప్పా. నా తప్పు లేదని తేలింది. నిజాయతీగా, పారదర్శకంగా ఉండటం కూడా అంత తేలికైన విషయం కాదు. కానీ నా ఉద్యోగాన్ని కచ్చితంగా చేశాను కాబట్టే ఏప్రిల్‌ 2022 నుంచి మార్చి 2023 మధ్య ఏడాదిలో రూ.1.06కోట్ల జరిమానా సొమ్ముని సంస్థకి ఇవ్వగలిగా. అలాగని ప్రయాణికుల కష్టాలు పట్టవు అనుకొంటే పొరపాటు. ఓ సారి రద్దీ బాగా ఉన్న రైల్లో ఓ పాపకు మూర్ఛ వచ్చింది. పాపం వాళ్లమ్మకి ఏం చేయాలో తెలీక ఏడుస్తోంది. వెంటనే నేను ఆ పాపను మోసుకుని వేగంగా పరుగెత్తి ఆసుపత్రిలో చేర్పించా. మరోసారి.. రద్దీ రైల్లో జనాలమధ్య ఊపిరాడక వేదన అనుభవిస్తున్న ఇద్దరు వృద్ధుల్ని బయటికి తెచ్చి ప్రాణాలు కాపాడాను.


ఇదే తృప్తిగా ఉంది..

రైల్వేలో 20ఏళ్ల అనుభవం నాది. అథ్లెట్గా వచ్చిన గుర్తింపుకంటే రైల్వేలో వచ్చిందే ఎక్కువ. చేసే పనిని ఇష్టంగా, బాధ్యతగా చేస్తే ఏ సంస్థయినా అక్కున చేర్చుకుంటుంది. అందుకు నేనే ఉదాహరణ. మహిళలు ఏ రంగంలోకి వెళ్లినా కుటుంబ సహకారం తప్పనిసరిగా ఉండాలి. మావారు పోలీస్‌శాఖలో ఉన్నారు. మాకో పాప. వాళ్ల ప్రోత్సాహంతోనే విధుల్లో రాణించగలుగుతున్నా.

- హిదాయతుల్లాహ్‌.బి, చెన్నై

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్