నేల రుణం.. తీర్చుకుంటున్నారు!

చిన్నప్పుడే గుండెకు శస్త్రచికిత్స... ఆ తర్వాత క్యాన్సర్‌పై పోరాటం, భర్త మరణం.... ఇలా జీవితం విసిరిన ప్రతి సవాల్‌నీ నవ్వుతూ స్వీకరించారామె.

Published : 30 Jan 2023 00:03 IST

చిన్నప్పుడే గుండెకు శస్త్రచికిత్స... ఆ తర్వాత క్యాన్సర్‌పై పోరాటం, భర్త మరణం.... ఇలా జీవితం విసిరిన ప్రతి సవాల్‌నీ నవ్వుతూ స్వీకరించారామె. మనం బతుకుతూ, మరో పదిమందికి చేయూతనివ్వడంలోనే సంతృప్తి అనే ఆవిడ... జీరోవేస్ట్‌ పద్ధతిలో జీవనం సాగిస్తూ పర్యావరణ పరిరక్షణకూ, మహిళా సాధికారతకూ దారి చూపిస్తున్నారు. ఆమే ఇందౌర్‌కి చెందిన పద్మశ్రీ గ్రహీత ‘జనక్‌ పాల్తా మెక్‌ గిల్లిగాన్‌. ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణమిది.

పంజాబీ కుటుంబంలో పుట్టిపెరిగిన జనక్‌ పాల్తా మెక్‌గిల్లిగాన్‌ బాల్యమంతా చండీగఢ్‌లో సాగింది. పదిహేడేళ్ల వయసులో గుండె జబ్బు బారిన పడ్డారామె. ఆంగ్ల సాహిత్యంలో పీజీ, పొలిటికల్‌ సైన్స్‌లో ఎంఫిల్‌, పీహెచ్‌డీ చేశారు. సితార్‌లో సంగీత విశారద్‌ పట్టా అందుకున్నారు. చదువుకుంటూ, ఆ తర్వాత కూడా పీఎఫ్‌ ఆఫీస్‌, చంఢీగడ్‌ హైకోర్టు, గ్రామీణ పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాల్లో పనిచేశారు. ఆ సమయంలోనే ఐరిష్‌ దేశానికి చెందిన జేమ్స్‌ మెక్‌గిల్లిగాన్‌తో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. జీవితమంటే మనం బతకడమే కాదు పదిమందికీ దారి చూపించాలి అనే మనస్తత్వం కలిగిన ఈ జంట మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై పనిచేయాలనుకున్నారు. ఆ దిశగా ‘బర్లీ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ విమెన్‌’ ఏర్పాటుతో మొదటి అడుగు వేశారు. చదువుకి దూరమైన గ్రామీణ, గిరిజన మహిళలకు నైపుణ్యాల శిక్షణ, ఉపాధి కల్పన దిశగా పనిచేస్తుంది ఈ సంస్థ. బర్లీ అనేది మధ్యప్రదేశ్‌ భిలాలా అనే గిరిజన తెగలో సాధారణంగా వినిపించే స్త్రీ పేరు.

ఆహ్వానంతో....

1992లో పాల్తాకు రియో డిజనీరోలో జరిగిన మొట్ట మొదటి ఎర్త్‌ సమ్మిట్‌కు ఆహ్వానం అందింది. అక్కడే ఆమె ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ సమస్యలను తెలుసుకున్నారు. ఆ రోజే పుడమికి హాని చేసే పనులు చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆ మార్పు తన ఇంటి నుంచే మొదలు పెట్టాలనుకున్నారు. ఇందౌర్‌లో జిమ్మి ‘మెక్‌గిల్లిగాన్‌ సెంటర్‌ ఫర్‌ సబ్‌స్టాన్షియల్‌ డెవలప్‌మెంట్‌’ సంస్థను స్థాపించారు. ఆమె సారథ్యంలో వెయ్యి గ్రామాల్లోని లక్షా యాభై వేలకు పైగా యువతకు ఆరువేలకు పైగా గ్రామీణ, గిరిజన మహిళలకు సౌరశక్తిని ఉపయోగించి వంటచేయటంలో శిక్షణనిచ్చారు. స్థానికుల కష్టసుఖాలను పంచుకునే జనక్‌ని ‘దీదీ’ అని అక్కడి వారంతా ఆప్యాయంగా పిలుచుకుంటారు.

మహిళలకు చేయూతగా...

చిన్నప్పుడే గుండె సంబంధిత సమస్య నుంచి గట్టెక్కిన ఆమె 2007లో క్యాన్సర్‌ బారిన పడ్డారు. తన జీవనశైలిని ఆహ్లాదంగా మార్చుకొనేందుకు తన సంస్థనీ, నివాసాన్ని సనావాడియాకు తరలించి అక్కడ జీరోవేస్ట్‌ విధానంలో భవన నిర్మాణం పూర్తి చేశారు. సోలార్‌, విండ్‌ పవర్‌ స్టేషన్ల నిర్మాణంతో తన ఇంటికి కావలసిన విద్యుత్‌ను సమకూర్చుకోవడమే కాదు... మరో యాభై ఇళ్లల్లో దీపాలు వెలిగించారు. సోలార్‌ దీపాలూ, కుక్కర్ల వినియోగాన్ని స్థానిక మహిళలకు నేర్పించడం ద్వారా 20-30మైళ్ల దూరం వంట చెరకు కోసం నడిచి వెళ్లే పని తప్పించారు. ఈలోగా జరిగిన ఓ ప్రమాదంలో తాను గాయాలపాలయ్యారు. భర్త జిమ్మీని దూరం చేసుకున్నారు. ప్రస్తుతం జనక్‌కి 74 ఏళ్లు. ఆవిడ సామాజిక సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2015లో పద్మశ్రీతో గౌరవించింది. ప్రకృతికి హాని చేయకుండా తాను జీవించడమే కాకుండా ఇతరులకూ అందులో శిక్షణనిస్తున్న జనక్‌ జీవితం నిజంగా స్ఫూర్తిదాయకమే కదా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్