అయిదు వేలమందికి.. అక్క!

కూలి కెళ్లడం, పెళ్లి చేసుకోవడం.. ఆ ఊళ్లో అమ్మాయిలకుండే అవకాశాలు. శుక్లా మాత్రం రెండూ కాదని మూడో దారి వెతుక్కొంది. తాను నడవడమే కాదు.. వేలమంది అమ్మాయిల తలరాతలనీ మారుస్తోంది. ‘హ్యూమన్‌ ట్రాఫికింగ్‌.. ఈ పదాన్ని మీరు వార్తాపత్రికల్లో చదివుంటారు. కానీ మా గ్రామంలో ఇది నిత్యకృత్యం.

Published : 25 Feb 2023 00:26 IST

కూలి కెళ్లడం, పెళ్లి చేసుకోవడం.. ఆ ఊళ్లో అమ్మాయిలకుండే అవకాశాలు. శుక్లా మాత్రం రెండూ కాదని మూడో దారి వెతుక్కొంది. తాను నడవడమే కాదు.. వేలమంది అమ్మాయిల తలరాతలనీ మారుస్తోంది.

‘హ్యూమన్‌ ట్రాఫికింగ్‌.. ఈ పదాన్ని మీరు వార్తాపత్రికల్లో చదివుంటారు. కానీ మా గ్రామంలో ఇది నిత్యకృత్యం. కళ్ల ముందే ఎన్నో ఉదాహరణలున్నా.. తమ జీవితం మారుతుందన్న ఆశతో ఎంతోమంది ఆ ఊబిలో పడిపోతుంటారు. దాన్నే మార్చాలనుకున్నా’ అంటుంది శుక్లా దేబ్‌నాథ్‌. ఈమెది పశ్చిమ్‌బంగలోని కాల్‌చినీ. ఆదివాసీ గ్రామమది. నాన్నది చిన్న మిఠాయి దుకాణం. ఈమెకు నలుగురు అక్కలు. అయిదుగురు ఆడపిల్లల పెళ్లి గురించి తలచుకొని వాళ్ల నాన్న బెంగపడేవాడు. అది చూసిన శుక్లా నాన్నకు భారం కాదు.. ఆసరా కావాలనుకుంది. కూలీ లేదా పెళ్లి.. అమ్మాయిలకు ఈ రెండు దారులే ఉండేవి. ఇవి కాకుండా మరో దారి వెతుక్కోవాలనుకుందామె. స్కూలు చదువు అయిపోయాక పిల్లలకు ట్యూషన్లు చెప్పేది. ఆ వచ్చిన మొత్తాన్ని కూడబెట్టి, 2003లో బ్యుటీషియన్‌ కోర్సులో చేరింది.

‘కోర్సయ్యాక మళ్లీ రెండు ఆప్షన్లు కనిపించాయి. నేను సంపాదించుకోవడం, నా పరిజ్ఞానాన్ని ఇతరులకు పంచడం! ఇలా ఆలోచించడానికి నాన్నే కారణం. ‘చెప్పులైనా కుట్టు ఫర్లేదు. పనికి చిన్నా, పెద్దా అంటూ ఏమీ ఉండదు. నలుగురికీ ఉపయోగపడుతుందా అన్నది మాత్రం చూసుకో’ అనేవారు. నా పనితో నలుగురికీ ఎలా సాయపడాలా అనిపించినప్పుడు మానవ అక్రమ రవాణాకు గురవుతున్న అమ్మాయిల సంఘటనలు గుర్తొచ్చాయి. సంపాదన మార్గం లేకనే కదా! మోసపోతోంది.. వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా చేస్తే ఈ సమస్య ఉండదు అనుకున్నా’ అంటుంది 35 ఏళ్ల శుక్లా.

చుట్టుపక్కల గ్రామాల్లో అమ్మాయిలను కూడగట్టి ఉచితంగా బ్యూటీషియన్‌ కోర్సులు నేర్పాలనుకుంది. ఉచితంగా అయినా నేర్చుకోవడానికి చాలామంది వెనుకాడేవారు.  ‘మీ శరీరంలో ఎంత సంపద ఉందో తెలుసా? అని అడిగేదాన్ని. ఊపిరితిత్తులు, గుండె.. ఒక్కో అవయవం లక్షలు విలువ చేస్తుంది. పెద్ద జీతాలని ఆశపెట్టి.. తీసుకెళ్లి చంపేసినా అడిగే దిక్కుండదు. వాటిని నమ్మొద్దు అని అవగాహన కల్పించా. కొన్ని ఉదాహరణలూ చూపించా. క్రమంగా నాపై నమ్మకం పెరిగింది. నా దగ్గర నేర్చుకోవడానికి అమ్మాయిలు రావడం మొదలుపెట్టారు. 5000 మందికి పైగా శిక్షణ తీసుకున్నారు. వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడుతున్నారు. శిక్షణకు అయ్యే ఖర్చూ నా సంపాదనే! అయితేనేం? అక్కా ఇది నీ చలవే.. అని చెబుతోంటే చెప్పలేని ఆనందం’ అంటుందీమె. అమ్మాయి భారం అన్న అభిప్రాయాన్ని మార్చాలన్నది ఆమె ఉద్దేశం. అందుకు తను ఎంచుకున్న మార్గం.. ఆదర్శప్రాయమే కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్