Suman Sonthalia: ఆమె సృజనాత్మకతకు కోట్ల ఆదాయం...

వివిధ రాష్ట్రాల కళలను ఒకే కాన్వాస్‌పై కలిపి చిత్రీకరించారీమె. స్థానికతకు రకరకాల సంప్రదాయాలను అద్ది.. గృహాలంకరణకు కొత్త అర్థం చెప్పారు. ఈ సృజనా త్మకతనే వ్యాపారమార్గంగా మార్చుకొని దేశవిదేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు.

Updated : 20 May 2023 05:31 IST

వివిధ రాష్ట్రాల కళలను ఒకే కాన్వాస్‌పై కలిపి చిత్రీకరించారీమె. స్థానికతకు రకరకాల సంప్రదాయాలను అద్ది.. గృహాలంకరణకు కొత్త అర్థం చెప్పారు. ఈ సృజనా త్మకతనే వ్యాపారమార్గంగా మార్చుకొని దేశవిదేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు. ఉచిత శిక్షణతో వేలాదిమంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ.. జాతీయ స్థాయిలో ‘మాస్టర్‌ క్రాఫ్ట్స్‌ కళాకారిణి’గా గౌరవాన్ని అందుకొన్నసుమన్‌ సంతాలియా మనోగతమిది...

మాది మధ్యతరగతి కుటుంబం. బిహార్‌లోని సహిబాబాద్‌ గ్రామం. నాన్న ఉద్యోగి. అమ్మ గృహిణి. చదువు, ఆటలు సహా కుట్టుపని నేర్చుకొనేదాన్ని. అమ్మ చేనేత పనిచేస్తే తోడుగా ఉండి నేనూ చేసేదాన్ని. బొమ్మలు వేసేదాన్ని. గృహాలంకరణపై ఆసక్తితో ఇంటిని అందంగా తీర్చిదిద్దేదాన్ని. పెళ్లైన తర్వాత మావారితో కలిసి దిల్లీ వచ్చేశా.

జత చేసి చూశా..

ఓసారి క్రాఫ్ట్‌ మ్యూజియానికి వెళ్లినప్పుడు వర్లి ఆర్ట్‌ పెయింటింగ్‌ను చూశా. దాన్ని చూస్తే అలా నేనూ వేయగలను అనిపించింది. ప్రయత్నిస్తే అచ్చుగుద్దినట్లు వచ్చింది. కుటుంబ మిత్రుడొకరు చూసి అటువంటివి మరిన్ని తయారు చేయగలవా అన్నారు. అలా వర్లి చిత్ర లేఖనాలు వేయడం మొదలుపెట్టా. ఓసారి ప్రయోగం చేయాలనిపించింది. ఒక కళకు మరొక ప్రాంతీయ కళను జత కలిపి కొత్తదనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశా. విజయవంతమైంది. ఇలా నేను వేసే పెయింటింగ్స్‌ను తెలిసినవాళ్లు కొనేవారు. దీన్నే వ్యాపార ఆలోచనగా మార్చుకోవాలనిపించింది. అలా 1998లో మా లివింగ్‌రూంనే ఆఫీస్‌గా మార్చి ఆరుగురు మహిళలతో ‘ఆకృతి ఆర్ట్‌ క్రియేషన్స్‌’ ప్రారంభించా. మహారాష్ట్ర - వర్లి, బిహార్‌ - మధుబని, పశ్చిమ్‌బంగా - ఢోక్రా, పటచిత్ర, ఆంధ్ర - కలంకారి, రాజస్థాన్‌ - మందాన, ఛత్తీస్‌గఢ్‌ - గోండ్‌ కళలన్నింటినీ ఒకే కాన్వాస్‌పై వేసేదాన్ని. ఇవి చాలామందిని ఆకట్టుకునేవి. ఏడాది తిరిగే సరికి వీటికి డిమాండ్‌ పెరిగింది. ఒకరిద్వారా మరొకరికి వీటి గురించి తెలుస్తూ.. ఓసారి ప్రభుత్వ కార్యాలయం నుంచి పిలుపొచ్చింది. అలా నా పెయింటింగ్‌ ఒకటి జనపథ్‌లోని సెంట్రల్‌ కాటేజ్‌ ఎంపోరియంలో ఉందిప్పుడు.

ఆలోచన మార్చా..

కాలం ఎప్పడూ ఒకేలా ఉండదు కదా. అయిదారేళ్లకు పెయింటింగ్స్‌కు ఆర్డర్లు తగ్గాయి. నేనేమీ నిరుత్సాహపడలేదు. గృహాలంకరణ కోసం పూల కూజాలు, ట్రేలు, జార్స్‌ సహా భోజన బల్లలు, అలమరలు, సోఫాలు, అద్దాలు, ల్యాంపుషేడ్స్‌, సెరామిక్స్‌ వంటి ఫర్నిచర్‌ తయారీ ప్రారంభించాం. వీటిని కళాత్మకంగా తీర్చిదిద్దడం మా ప్రత్యేకం. ఇప్పుడు నా దగ్గర ఉన్న 150 మందిలో 100మందికిపైగా మహిళలే. పెపర్‌ఫ్రై, ఇటోక్రీ, సెంట్రల్‌ కాటేజ్‌ ఎంపోరియం, ఫాబ్‌ ఇండియా, షాపర్స్‌ స్టాప్‌ వంటి సంస్థలు మా క్లైంట్స్‌. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు వేదికగా, సొంత వెబ్‌సైట్‌ ద్వారా వినియోగదారుల సంఖ్య వేలకు పెరిగింది.

రూ.3 కోట్లు..

ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ్‌బంగాలకు చెందిన కళాకారులు మావద్ద పనిచేస్తున్నారు. రాష్ట్రేతర ప్రాంతాల్లోనూ వర్క్‌షాపులు నిర్వహించి వేలమంది మహిళలకు శిక్షణనిస్తున్నా. మలేసియా, సౌదీ అరేబియా, దుబాయి, లండన్‌ వంటి ప్రాంతాలకు మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. గతేడాది మా సంస్థ వార్షికాదాయం రూ.3కోట్లు. ఇప్పుడు ఆభరణాలు కూడా డిజైన్‌ చేస్తున్నాం. వీటికి ఇటలీ, లండన్‌ నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉండే కళలను కలిపి, ఫర్నిచర్‌, గృహాలంకరణలకు ఉపయోగిస్తూ ఇంటిని మరింత అందంగా మార్చాలన్నదే నా లక్ష్యం. ‘మాస్టర్‌ క్రాఫ్ట్స్‌ కళాకారిణి’గా 2011లో రాష్ట్రపతి చేతుల తీసుకున్న జాతీయ పురస్కారాన్ని మరవలేను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్