‘అమ్మైనా తగ్గేదేలే’దంటోంది!

అమ్మయ్యాక శారీరక సత్తువ తగ్గిపోతుంది.. ఏ పని చేసినా త్వరగా అలసిపోతాం.. నీరసించిపోతాం.. అనుకుంటారు చాలామంది. కానీ ఈ భావన తప్పని నిరూపిస్తున్నారు కొందరు క్రీడాకారిణులు. పిల్లలు పుట్టాకా తిరిగి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకుంటున్నారు.. ఆటల్లో దూసుకుపోతున్నారు. అందుకు తాజా ఉదాహరణే అమెరికాకు చెందిన కైట్లిన్‌....

Published : 14 May 2024 21:21 IST

(Photos : Instagram)

అమ్మయ్యాక శారీరక సత్తువ తగ్గిపోతుంది.. ఏ పని చేసినా త్వరగా అలసిపోతాం.. నీరసించిపోతాం.. అనుకుంటారు చాలామంది. కానీ ఈ భావన తప్పని నిరూపిస్తున్నారు కొందరు క్రీడాకారిణులు. పిల్లలు పుట్టాకా తిరిగి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకుంటున్నారు.. ఆటల్లో దూసుకుపోతున్నారు. అందుకు తాజా ఉదాహరణే అమెరికాకు చెందిన కైట్లిన్‌. ఇద్దరు పిల్లల తల్లైన ఆమె.. అమ్మయ్యాకా తన అథ్లెటిక్‌ కెరీర్‌ను దిగ్విజయంగా కొనసాగిస్తోంది. 20 నెలల తన చిన్నారితో ఇటీవలే ప్రపంచ రికార్డు కూడా నమోదు చేసింది. తన బిడ్డను స్ట్రోలర్‌లో కూర్చోబెట్టుకొని.. దాన్ని తోసుకుంటూ 5 నిమిషాల 11 సెకన్లలో మైలు (1.6 కిలోమీటర్ల) దూరం పరిగెత్తింది. ఇలా స్ట్రోలర్‌తో తక్కువ సమయంలోనే ఎక్కువ దూరం పరిగెత్తిన మామ్‌ అథ్లెట్‌గా గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో కైట్లిన్‌ అథ్లెటిక్‌ జర్నీ గురించి తెలుసుకుందాం..!

అద్భుత ట్రాక్‌ రికార్డు!
కైట్లిన్‌కు చిన్న వయసు నుంచే ఆటలంటే మక్కువ! ఈ ఇష్టంతోనే పరుగును తన క్రీడా కెరీర్‌గా ఎంచుకున్న ఆమె.. పలు పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. ఇలా పరుగుతో పాటు ఈత, సైక్లింగ్‌లోనూ ఆమెకు ప్రవేశం ఉంది. ఈ క్రమంలోనే ట్రయాథ్లెట్‌ (పరుగు, ఈత, సైక్లింగ్‌లో ప్రావీణ్యం ఉన్న ప్లేయర్‌)గా 2012, 2016 ఒలింపిక్స్‌లో పాల్గొని చక్కటి ప్రతిభ కనబరిచిన ఆమె.. 2015లో న్యూజిలాండ్‌ వేదికగా జరిగిన ట్రయాథ్లాన్‌ పోటీల్లో ప్రపంచ విజేతగా నిలిచింది. ఆపై 2020లో ‘హ్యూస్టన్‌ 5కె’ పరుగు పందెంలో మహిళల విభాగంలో బంగారు పతకం నెగ్గిన ఆమె.. అదే ఏడాది ‘క్లెర్మోంట్‌ స్ప్రింట్‌ ట్రయాథ్లాన్‌ పాన్‌ అమెరికన్‌ కప్‌’లో పోటీ పడి మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం మైల్‌ రన్నింగ్‌ ఈవెంట్లలో ఎక్కువగా పాల్గొంటోంది కైట్లిన్‌.

13 సెకన్ల ముందే!
వృత్తిరీత్యా ఫిజికల్‌ థెరపిస్ట్‌ అయిన కైట్లిన్‌.. తన క్రీడా కెరీర్‌లో దూసుకుపోతున్న సమయంలోనే వివాహం చేసుకుంది. 2019లో తన మొదటి బిడ్డ క్రిస్‌కు జన్మనిచ్చిన ఆమె.. అమ్మయ్యాకా ఆటల్లో కొనసాగాలనుకుంది. ఈ ఆలోచనతోనే ప్రసవం తర్వాత తన ఫిట్‌నెస్‌ను పెంచుకోవడంపై దృష్టి సారించిందామె.
‘నిజానికి క్రిస్‌ పుట్టాకే మూడు ట్రయాథ్లాన్‌ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచాను.. ఆపై ఎక్కువగా పరుగు పందేల్లో పాల్గొనడం పైనే దృష్టి పెట్టాను..’ అంటోన్న కైట్లిన్‌.. 2022లో తన రెండో కొడుక్కి జన్మనిచ్చినప్పట్నుంచీ తన క్రీడా కెరీర్‌ను మరింతగా పరుగులు పెట్టిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే ‘స్ట్రోలర్‌ మైల్‌’ రన్నింగ్‌ ఈవెంట్‌లో పాల్గొందీ స్పోర్టింగ్‌ మామ్‌. 20 నెలల తన పసిబిడ్డని స్ట్రోలర్‌లో కూర్చోబెట్టుకొని.. దాన్ని తోస్తూ 5 నిమిషాల 11 సెకన్ల వ్యవధిలోనే మైలు (సుమారు 1.6 కిలోమీటర్లు) దూరం పరుగెత్తిందామె.. తద్వారా ప్రపంచ రికార్డును నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు అమెరికన్‌ రన్నర్‌ నీలీ గ్రేసీ పేరిట ఉంది. ఆమె 5 నిమిషాల 24 సెకన్లలో స్ట్రోలర్‌తో మైలు దూరం పరుగెత్తగా.. కైట్లిన్‌ 13 సెకన్ల ముందే గమ్యాన్ని చేరుకొని నీలీ రికార్డును బద్దలుకొట్టింది. ఇలా అమ్మతనం మనం ఎంచుకున్న ఏ వృత్తికైనా అడ్డుకాదని తన విజయంతో మరోసారి రుజువు చేసిందీ స్పోర్టింగ్‌ మామ్‌.

ఫిజికల్‌ థెరపిస్ట్‌గా!
ఓవైపు తల్లిగా తన ఇద్దరు పిల్లల బాధ్యత నిర్వర్తిస్తూనే.. మరోవైపు క్రీడాకారిణిగానూ రాణిస్తోంది కైట్లిన్‌. ఫిజికల్‌ థెరపిస్ట్‌ అయిన ఆమె.. 2018లో ‘న్యూ వేవ్‌ ఫిజికల్‌ థెరపీ అండ్‌ స్పోర్ట్స్‌ రీహ్యాబిలిటేషన్‌’ సెంటర్‌ని స్థాపించింది. ఈ వేదికగా వివిధ రకాల అనారోగ్యాలతో బాధపడుతోన్న వారికి ఫిజికల్‌ థెరపీ సెషన్స్‌ నిర్వహిస్తూ.. ఆయా సమస్యల నుంచి వారికి విముక్తి కల్పిస్తోంది. మరోవైపు గాయాల బారిన పడ్డ క్రీడాకారులూ తిరిగి కోలుకునేలా, ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకునేలా శిక్షణనిస్తోందామె. అంతేకాదు.. కొత్తగా తల్లైన వారిలో ప్రసవానంతర ఒత్తిళ్లను దూరం చేసి.. తిరిగి ఉత్సాహాన్ని అందించేందుకు ‘బేబీ బౌన్స్‌ బ్యాక్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్స్‌’ కూడా నిర్వహిస్తోంది కైట్లిన్‌. ఈ శిక్షణ కోసం తన సెంటర్‌లో చేరే వారికి మొదట నెల రోజుల పాటు ఉచితంగానే శిక్షణ అందిస్తోందామె. ఇలా ఫిట్‌నెస్‌పై అందరిలో అవగాహన పెంచుతోన్న ఆమె.. తన ప్రసవానంతరం పరుగు, జంపింగ్‌, కొండలెక్కడం తదితర వ్యాయామాలతో తిరిగి ఫిట్‌గా మారానంటోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్