Valentines Day: ఈ ఆసక్తికర విశేషాలు మీకు తెలుసా?

ఇష్టంతో ముడిపడిన రెండు హృదయాల్లో ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తీకరించడానికి వేలంటైన్స్‌ డేను మించిన ప్రత్యేక సందర్భం మరొకటి ఉండదు. ఈ క్రమంలో ప్రేమను తెలుపుకోవడంతో పాటు ఒకరికొకరు కానుకలిచ్చిపుచ్చుకోవడం కూడా మనకు తెలిసిందే....

Published : 14 Feb 2024 14:25 IST

ఇష్టంతో ముడిపడిన రెండు హృదయాల్లో ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తీకరించడానికి వేలంటైన్స్‌ డేను మించిన ప్రత్యేక సందర్భం మరొకటి ఉండదు. ఈ క్రమంలో ప్రేమను తెలుపుకోవడంతో పాటు ఒకరికొకరు కానుకలిచ్చిపుచ్చుకోవడం కూడా మనకు తెలిసిందే. ఇదంతా బాగానే ఉంది కానీ అసలు ఈ వేలంటైన్స్ డే రోజున ఎర్ర గులాబీలనే ఎందుకు కానుకగా అందిస్తారు? ప్రేమకు ప్రతిరూపంగా చెప్పుకొనే రోమియో-జూలియట్ ఎవరు? ఇలాంటి కొన్ని ఆసక్తికర అంశాల గురించి తెలుసుకుందాం రండి..

 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తమ మనసుకు నచ్చిన వారికి ఎరుపు రంగు రోజా పూలను అందిస్తూ తమ ప్రేమను చాటుకుంటారు ప్రేమికులు. అయితే ఎరుపు రంగు రోజానే ఎందుకంటే.. ఎర్రగులాబీ అనేది రోమన్ల ప్రేమ దేవత అయిన 'వీనస్'కి ఎంతో ఇష్టమైన పువ్వు.. అలాగే ఎరుపు రంగు రొమాన్స్‌కి చిహ్నం.. కాబట్టి ఈ రెండింటి కలయికగా ఈ రోజున ఎరుపు రంగు గులాబీలను అందించడం నాటి నుంచి కొనసాగుతోంది.

 వేలంటైన్స్ డే సందర్భంగా హృదయాకారంలో ఉండే చాక్లెట్ బాక్సులు ఏటా మిలియన్లలో కొనుగోలవుతున్నాయట! అంతేకాదు.. ఈ రోజున కేవలం చాక్లెట్లకే సుమారు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారట ప్రేమికులు.
 ఎదుటి వ్యక్తిపై మన మనసులోని ప్రేమను తెలపడానికి చాక్లెట్లను బహుమతిగా అందిస్తుంటాం. అయితే అవే చాక్లెట్లు బ్రేకప్ అయిన మనసుకు ప్రశాంతతను అందించడానికీ ఉపయోగపడతాయని అంటున్నారు నిపుణులు. అందుకే ప్రేమ బంధం వీగిపోయి పలు మానసిక సమస్యలతో తమ దగ్గరకొచ్చే వారికి చాక్లెట్లు తినమని సూచిస్తామంటున్నారు కొందరు సైకాలజీ నిపుణులు.

 ప్రముఖ కవి విలియమ్ షేక్‌స్పియర్ నవలలో రోమియో-జూలియట్ పాత్రలు కల్పితమే అయినా వారిని ప్రేమకు ప్రతిరూపాలుగా భావించడం తెలిసిందే. అయితే ఆ కథలో భాగంగా ఇటలీలోని వెరోనా నగరంలో ఎక్కడైతే రోమియో అవతరించాడో అక్కడికి జూలియట్ పేరుతో ఏటా కొన్ని వేల ప్రేమలేఖలు చేరుకుంటాయట. ఇలా మరణం లేని ప్రేమికులుగా రోమియో-జూలియట్‌లను పేర్కొంటారు లవర్స్.
 ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తమ ప్రేమను ఎదుటి వ్యక్తికి తెలపడం కంటే తమని తామే ప్రేమించుకోవడానికి, కానుకలిచ్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారట కొందరు అమెరికన్ మహిళలు. ఇలా ఏటా వేలంటైన్స్ డే రోజున 15 శాతం మంది అమెరికన్ మహిళలు తమకు తామే పువ్వులు, ఇతర బహుమతుల్ని అందించుకుంటూ ప్రతి ఒక్కరికీ స్వీయ ప్రేమ ఎంతో ముఖ్యమని ప్రపంచానికి చాటుతున్నారు.

 ప్రేమంటే కేవలం ఒక అమ్మాయి-అబ్బాయి మధ్య మాత్రమే కాదు.. తల్లీబిడ్డలు, టీచర్స్-విద్యార్థులు, భార్యాభర్తలు.. వంటి బంధాలతో పాటు మూగజీవాలతోనూ మనం ప్రేమగా మెలుగుతుంటాం. అందుకే ప్రేమికుల దినోత్సవం రోజున ప్రేమికులే కాదు.. పేరెంట్స్‌కి, టీచర్స్‌కి, పెట్స్‌కి కూడా కానుకల్ని అందించి వారిపై మనకున్న ప్రేమను చాటడం సహజం. అలా ఏటా అందరికంటే ఎక్కువగా కానుకలు, వేలంటైన్స్ డే గ్రీటింగ్ కార్డులు ఎవరు అందుకుంటున్నారో తెలుసా? ఇంకెవరు.. ప్రతి విద్యార్థిని సన్మార్గంలో నడిపించే టీచర్లే. చిన్నారులు, అమ్మలు, భార్యలు, ప్రేమికులు, పెట్స్.. వరుసగా ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించారు.
 ఈ ప్రత్యేకమైన రోజున ప్రేమికుల మధ్య ప్రేమ ప్రతిపాదనలే కాదు.. పెళ్లి ప్రతిపాదనలు కూడా వస్తుంటాయట! అలా ఏటా సగటున 2 లక్షలకు పైగా పెళ్లి ప్రతిపాదనలు చేసుకుంటున్నారట ప్రేమికులు.
 ఫిన్‌ల్యాండ్‌లో వేలంటైన్స్ డేని 'ఫ్రెండ్స్ డే' పేరుతో జరుపుకొంటారట! ఈ రోజున తమ మనసుకు నచ్చినవారి కంటే తమ ప్రాణ స్నేహితులతో గడపడానికే వారు ఎక్కువగా ఆసక్తి చూపుతారట!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్