అధిక బరువు తగ్గాలంటే.. ఆ ఉపవాసం మంచిదేనా?

నా వయసు 35 సంవత్సరాలు. నేను ఊబకాయం సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేయమని చెప్పారు. కానీ, దానివల్ల నీరసంగా ఉంటున్నాను.

Updated : 09 Feb 2024 14:18 IST

నా వయసు 35 సంవత్సరాలు. నేను ఊబకాయం సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేయమని చెప్పారు. కానీ, దానివల్ల నీరసంగా ఉంటున్నాను. ఊబకాయం తగ్గించుకోవడానికి ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ మంచిదేనా? ఇప్పుడు నేను ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. ఈ రోజుల్లో చాలామంది ఆధునిక జీవనశైలిని పాటిస్తున్నారు. దీనివల్ల శారీరక శ్రమ తగ్గిపోతోంది. అదేసమయంలో తీసుకునే ఆహారం పెరిగిపోతోంది. దానివల్ల చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి చాలామంది ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ను అనుసరిస్తున్నారు. దీనివల్ల మనం రోజులో ఎన్ని క్యాలరీలు తీసుకుంటామో అవి తగ్గిపోతుంటాయి. సాధారణంగా మనం తీసుకోవాల్సిన క్యాలరీల కంటే ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరం వాపుకి గురవుతుంటుంది. ఫలితంగా ఊబకాయం సమస్య వస్తుంటుంది. ఈ క్రమంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

ఈ ఫాస్టింగ్‌లో కూడా వివిధ రకాలున్నాయి. కొంతమంది రోజులో ౭-౮ గంటల వ్యవధిలో మాత్రమే డైట్‌ తీసుకుంటారు. ఇంకొంతమంది రోజు విడిచి రోజు ఫాస్టింగ్‌ చేస్తుంటారు. అంటే ఒకరోజు నార్మల్‌ డైట్‌ పాటించి మరుసటి రోజు తక్కువ క్యాలరీలు తీసుకుంటారు. మరికొంతమంది 5:2 పద్ధతిని అనుసరిస్తుంటారు. దీనిలో భాగంగా ఐదు రోజులు యాక్టివ్‌ డైట్‌ తీసుకుని, మిగతా రెండు రోజులు ఉపవాసం పాటిస్తూ తక్కువ క్యాలరీలు తీసుకుంటారు. సాధారణంగా ఈ రకమైన ఫాస్టింగ్‌ పాటించడం వల్ల కేవలం బరువు తగ్గడమే కాకుండా బరువు పెరగడం వల్ల వచ్చిన ఇతర సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.

ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌లో భాగంగా తీసుకునే క్యాలరీలు తగ్గించుకుంటాం. కాబట్టి, సాధారణంగానే నీరసం వంటి సమస్యలు వస్తుంటాయి. అలాగే శరీరం ఈ ఫాస్టింగ్‌కు అలవాటు పడడానికి కూడా సమయం పడుతుంటుంది. ఈ క్రమంలో నీరసం వంటి సమస్యలు వచ్చినప్పుడు మీ వ్యక్తిగత వైదుల సలహా మేరకు న్యూట్రిషనల్‌ సప్లిమెంట్స్‌ తీసుకోవాలి. అలాగే ఇలాంటి సమస్యలు తరచుగా కనిపిస్తుంటే ఫిజీషియన్‌ను సంప్రదించడం మంచిది. వారు మీ సమస్యలను తెలుసుకుని ఫాస్టింగ్‌లో ఎలాంటి మార్పులో చేసుకోవాలో తెలియజేస్తారు.

సాధారణంగా ఊబకాయం విషయంలో ఈ రకమైన ఫాస్టింగ్ సానుకూల ప్రభావాన్ని చూపించినప్పటికీ - శరీరతత్వాన్ని బట్టి కొంతమందికి సరిపడచ్చు. మరికొంతమందికి సరిపడకపోవచ్చు. ప్రత్యేకించి- పిల్లలు, టీనేజర్లు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, మధుమేహులు.. మొదలైన వారికి ఈ రకమైన ఉపవాసం మంచిది కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఉపవాసాన్ని ప్రారంభించాలనుకునే ముందు ఓసారి మీ వ్యక్తిగత వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. అలాగే దీనిని మొదలుపెట్టేముందు- అసలు మీరు బరువు పెరగడానికి కారణాలేమిటి? థైరాయిడ్ సమస్య లేదా ఇతర హార్మోన్ల లోపాలు ఏవైనా ఉన్నాయా? ఇతరత్రా పోషకాలకు సంబంధించిన లోపాలు ఏవైనా ఉన్నాయా?.. వంటి అంశాల గురించి సంబంధిత వైద్య నిపుణుల ద్వారా తెలుసుకోవడం అవసరం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్