Jyoti Ratre: ‘ఈ వయసులో ఎవరెస్ట్‌ కలా? మానుకో’మన్నారు!

ఎవరెస్ట్‌ కల చాలామందికి ఉంటుంది.. కానీ దాన్ని సాకారం చేసుకునే సత్తా కొంతమందికే సొంతం! ఇందుకు తపన, పట్టుదలే కాదు.. వయసూ సహకరించాలి. అయితే ‘మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి వయసుతో పనేముంది?’ అంటున్నారు జ్యోతి రాత్రే....

Published : 23 May 2024 19:10 IST

(Photos : Instagram)

ఎవరెస్ట్‌ కల చాలామందికి ఉంటుంది.. కానీ దాన్ని సాకారం చేసుకునే సత్తా కొంతమందికే సొంతం! ఇందుకు తపన, పట్టుదలే కాదు.. వయసూ సహకరించాలి. అయితే ‘మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి వయసుతో పనేముంది?’ అంటున్నారు జ్యోతి రాత్రే. 48 ఏళ్ల వయసులో ఎవరెస్ట్‌ కల గన్న ఆమె.. తాజాగా 55 ఏళ్ల వయసులో ఆ కలను సాకారం చేసుకున్నారు. తద్వారా ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన అతి పెద్ద వయస్కురాలైన భారతీయ మహిళగా చరిత్రకెక్కారు. ఏడు పర్వతారోహణ సంస్థలు తిరస్కరించినా, వ్యక్తిగతంగా పలు సవాళ్లు ఎదురైనా ఎవరెస్ట్‌ శిఖరాగ్రం దాకా ఆమె ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం రండి..

జీవితంలో ఎన్నో చేయాలనుకుంటాం.. కానీ ఇంటి బాధ్యతలు, ఇతర పనుల దృష్ట్యా కొన్ని లక్ష్యాల్ని పక్కన పెట్టేస్తుంటాం. పిల్లలు కాస్త పెద్దయ్యాక, ఇంటి పనులు/బాధ్యతల నుంచి కాస్త విరామం దొరికాక తిరిగి వాటిపై దృష్టి సారిస్తాం. జ్యోతిదీ ఇలాంటి పరిస్థితే! మధ్యప్రదేశ్‌లో పుట్టి పెరిగిన ఆమె.. చిన్న వయసు నుంచే ఎవరెస్ట్‌ను అధిరోహించాలని కలలు కన్నారు. అయితే అంతలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టడం, పిల్లల బాధ్యతలు-ఇంటి పనులతో బిజీ అయిపోయారు. ఈ క్రమంలోనే తన లక్ష్యాన్ని కొన్నాళ్లు వాయిదా వేసుకున్నారామె.

వ్యాపారవేత్తగా..!
అయితే ఇన్ని బాధ్యతల నడుమ వ్యాపారవేత్తగా కూడా రాణించారు జ్యోతి. భోపాల్‌లో స్కూల్‌ యూనిఫాం బిజినెస్‌ను ప్రారంభించిన ఆమె అందులో సక్సెసయ్యారు. మరోవైపు ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ పైనా దృష్టి పెట్టేవారు. ఈ క్రమంలోనే ఔత్సాహికులకు ఫిట్‌నెస్‌ పాఠాలు బోధించడం, ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు/మెలకువలు అందించడం.. వంటివి చేసేవారు జ్యోతి. మరోవైపు మారథాన్‌లలోనూ పాల్గొనేవారు. అయితే తన 48 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు హిమాచల్‌ ప్రదేశ్‌లోని Deo Tibba ప్రాంతానికి ట్రెక్కింగ్‌కి వెళ్లారు. అక్కడే ఆమె పర్వతారోహణ తపన మళ్లీ మొదలైంది. అప్పటికే ఇల్లు, పిల్లల బాధ్యతల నుంచి కాస్త విరామం దొరకడంతో మౌంటెనీరింగ్‌ శిక్షణ తీసుకోవాలనుకున్నారు.
దేశంలో కరోనా మహమ్మారి అప్పుడప్పుడే కోరలు చాస్తోంది. అదే సమయంలో దేశంలోని ఏడు ప్రముఖ పర్వతారోహణ సంస్థల్లో శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ వయసు కారణంగా ఏడు సంస్థల నుంచీ తిరస్కరణే ఎదురైందామెకు. అయినా ఆశను వదులుకోలేదు జ్యోతి. స్వతహాగా ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అయిన ఆమె.. ఇంట్లోనే కొన్ని రకాల వ్యాయామాలు చేస్తూ శరీరాన్ని ఫిట్‌గా మార్చుకున్నారు.. పలువురు పర్వతారోహకుల నుంచి మెలకువలూ నేర్చుకున్నారు.

మొదటిసారి విఫలమైనా..!
ఇలా మౌంటెనీరింగ్‌కి పూర్తి స్థాయిలో సిద్ధమైన జ్యోతి.. ఇప్పటికే ఐదు ఖండాల్లో ఉన్న ఎత్తైన శిఖరాల్ని అధిరోహించారు. నేపాల్‌లోని ఐల్యాండ్‌ పర్వతం, రష్యాలోని మౌంట్‌ ఎల్‌బ్రస్‌, టాంజానియాలోని కిలిమంజారో, అర్జెంటీనాలోని మౌంట్‌ అకొన్‌కాగ్వా, ఆస్ట్రేలియాలోని మౌంట్‌ కాజీయాస్కో.. ఆమె అధిరోహించిన పర్వతాల జాబితాలో ఉన్నాయి. అయితే ఎప్పటికైనా ఎవరెస్ట్‌ శిఖరాగ్రానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ మౌంటెనీర్‌.. గతేడాది ఇందుకు సిద్ధమయ్యారు. ఈ లక్ష్యంతోనే 8,160 మీటర్ల ఎత్తుకు చేరుకున్న ఆమె.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వెనుదిరగాల్సి వచ్చింది. కానీ ఈసారి మాత్రం పట్టు విడవలేదు జ్యోతి. ముగ్గురు నేపాలీ షెర్పాల మార్గదర్శకత్వంలో ఇటీవలే రెండోసారి ఎవరెస్ట్‌ యాత్ర ప్రారంభించిన ఆమె.. పలు సవాళ్లను దాటుకొని మరీ శిఖరాగ్రాన్ని ముద్దాడారు. అదీ 55 ఏళ్ల వయసులో! తద్వారా అతి పెద్ద వయసులో ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి భారతీయ మహిళగా చరిత్రకెక్కారు. ఇప్పటిదాకా ఈ రికార్డు జమ్మూకు చెందిన సంగీత భల్‌ పేరిట ఉంది. 53 ఏళ్ల వయసులో ఆమె ఈ ఘనత సాధించారు. అయితే తాజాగా జ్యోతి ఈ రికార్డును బద్దలుకొట్టి.. కొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.

వద్దన్నా.. వారించి!
అయితే ఎవరెస్ట్‌ శిఖరారోహణ అంత సులభం కాదంటున్నారు జ్యోతి. అడుగడుగునా పలకరించే సవాళ్లను ఎదుర్కోవడం ఒకెత్తయితే.. వాటిని దాటుకుంటూ పర్వతారోహణ చేయడం మరో ఎత్తు అంటూ తన మొదటి ప్రయత్నంలోని ఎత్తుపల్లాల్ని గుర్తు చేసుకున్నారామె.
‘ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా పర్వతారోహణ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడే.. వరుస తిరస్కరణలకు గురయ్యా. ‘ఈ వయసులో ఎవరెస్ట్‌ కలా? మానుకోవడం మంచిదేమో?’నని సలహాలిచ్చిన వారూ ఉన్నారు. అయినా నేను వెనకడుగు వేయలేదు. మొదటి ప్రయత్నంలో వాతావరణం సహకరించక.. నాలుగు రోజుల పాటు 7 వేల మీటర్ల ఎత్తులోనే ఉండిపోయాం. ఆపై మరో వెయ్యి మీటర్లు అధిరోహించాక పరిస్థితులు మరింత విషమించాయి. ఇక ముందుకెళ్తే ప్రాణాలకే ప్రమాదం అని గైడ్స్‌ హెచ్చరించడంతో వెనుదిరగక తప్పలేదు. అయితే రెండోసారి కొన్ని ప్రతికూల పరిస్థితులు, సవాళ్లు ఎదురైనా.. బృంద ప్రోత్సాహం, ముగ్గురు షెర్పాల గైడెన్స్‌తో లక్ష్యాన్ని చేరుకున్నా.. ఎలాగైతేనేం నా చిన్ననాటి కల సాకారమైనందుకు, దేశం గర్వించదగ్గ రికార్డు సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది..’ అంటూ మురిసిపోతున్నారు జ్యోతి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్