Published : 01/04/2023 20:51 IST

కిడ్డీపూల్‌ని శుభ్రపరుస్తున్నారా?

స్విమ్మింగ్ పూల్ తరహాలోనే కొంతమంది పిల్లల కోసం కిడ్డీపూల్‌ని ఉపయోగిస్తుంటారు. వేసవికాలంలో పిల్లలు వేడి నుంచి తట్టుకోవడానికి, రకరకాల ఆటలు ఆడుకొని సేదతీరడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో నీటిలో బ్యాక్టీరియా, పాచి పెరగకుండా పూల్స్‌ని శుభ్రం చేయడం చాలా అవసరం. లేదంటే ఇవి పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపుతాయి.

పూల్‌ని శుభ్రం చేయకపోతే అందులో ఉండే క్రిములు, బ్యాక్టీరియా, నీటిలో ఉండే పాచి, చెత్త, దోమ గుడ్లు.. మొదలైనవి పిల్లల ఆరోగ్యానికి హాని కలగజేస్తాయి. అంతేకాకుండా చంటిపిల్లలు విసర్జించే వాటివల్ల కిడ్డీపూల్ అపరిశుభ్రంగా తయారవుతుంది. కాబట్టి పూల్‌ని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.

బ్లీచ్‌తో క్రిములు నాశనం

కిడ్డీపూల్‌ని బ్లీచ్, బోరాక్స్‌తో శుభ్రం చేయవచ్చు. బ్లీచ్ దుస్తులపై ఉండే జిడ్డు మరకల్ని పోగొట్టి వాటిని తెల్లగా చేస్తుంది. దీన్ని బాత్‌రూమ్స్, కిచెన్‌ని కడగడానికి కూడా ఉపయోగిస్తారు. బ్లీచ్‌లో బలమైన బ్యాక్టీరిసైడల్ ధర్మాలుంటాయి. ఇవి కిడ్డీపూల్‌లో ఉండే హానికరమైన క్రిములను నాశనం చేస్తాయి. అవసరమైతే క్లోరిన్, ఆల్గేసైడ్.. మొదలైనవి కలపచ్చు.

ప్రతివారం కిడ్డీపూల్‌ని శుభ్రపరచి, ఎండబెట్టి, తిరిగి నీరు నింపాలి. పెద్ద కిడ్డీపూల్స్‌ల్లో అయితే.. నీరు నింపడానికి వాటి అవసరాన్ని బట్టి ఒక పంపు, ఫిల్టర్‌ను ఏర్పాటు చేయవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

⚛ శుభ్రం చేయడానికి వాడే రసాయనాలను తగు మోతాదులో వాడాలి. పూల్ సరఫరా చేసే కంపెనీల సూచనలు పాటిస్తే మంచిది.

⚛ పిల్లలు పూల్‌లో ఆడుకుంటున్నప్పుడు మీ పర్యవేక్షణ చాలా అవసరం.

⚛ స్విమ్మింగ్ సీజన్‌కు ముందు పూల్‌ని చక్కగా శుభ్రపరచాలి. అలాగే పూల్‌లో అడుగుపెట్టే ముందు పిల్లల పాదాలను కూడా శుభ్రంగా కడగాలి.

⚛ ఒకవేళ నీరు మురికిగా ఉంటే.. ఆ నీటిని పారబోసి, పూల్‌ని ఎండబెట్టి మళ్లీ నీరు నింపాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని