Kriti Sanon: చలికాలంలో ఇలా మెరిసిపోతా!

చలికాలంలో అందాన్ని సంరక్షించుకోవడమంటే సవాలే! చర్మం పొడిబారడం, పగుళ్లు, పెదాలు తేమను కోల్పోవడం, అతినీలలోహిత కిరణాల ప్రభావం, ఎగ్జిమా.. ఇలా ఈ కాలంలో ఎదురయ్యే సమస్యల నుంచి విముక్తి పొందాలంటే చర్మ సౌందర్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

Published : 02 Jan 2024 12:19 IST

(Photos: Instagram)

చలికాలంలో అందాన్ని సంరక్షించుకోవడమంటే సవాలే! చర్మం పొడిబారడం, పగుళ్లు, పెదాలు తేమను కోల్పోవడం, అతినీలలోహిత కిరణాల ప్రభావం, ఎగ్జిమా.. ఇలా ఈ కాలంలో ఎదురయ్యే సమస్యల నుంచి విముక్తి పొందాలంటే చర్మ సౌందర్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే! ఈ క్రమంలోనే తాను ప్రత్యేకమైన స్కిన్‌ కేర్‌ రొటీన్‌ పాటిస్తున్నానంటోంది బాలీవుడ్‌ అందాల తార కృతీ సనన్‌. చలికాలంలో చర్మ ఆరోగ్యం కోసం తాను పాటించే రొటీన్‌ని, చిట్కాల్ని తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయగా.. అవి వైరలవుతున్నాయి. మరి, ఆ బ్యూటీ టిప్స్‌ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే బాలీవుడ్‌ తార కృతి.. తన వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన విషయాల్ని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటుంది. అంతేకాదు.. తాను పాటించే సౌందర్య చిట్కాల్నీ ‘స్కిన్‌కేర్‌ డైరీస్‌’ పేరుతో పోస్ట్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో వీడియో పోస్ట్‌ చేసిందీ ముద్దుగుమ్మ. చలికాలంలో ఎదురయ్యే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుంటూ.. చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకునేందుకు తాను పాటించే కొన్ని చిట్కాల్ని ఇందులో భాగంగా పంచుకుందీ ముద్దుగుమ్మ.

ఏడంచెల రొటీన్!

చలికాలంలో తన అందాన్ని సంరక్షించుకోవడానికి ఏడంచెల రొటీన్‌ను పాటిస్తున్నానంటోంది కృతి. ఈ క్రమంలోనే తాను ఉపయోగించే సౌందర్య సాధనాల్నీ వీడియోలో భాగంగా పరిచయం చేసిందీ ముద్దుగుమ్మ.

క్లెన్సింగ్‌తో నా బ్యూటీ రొటీన్‌ మొదలవుతుంది. ఈ క్రమంలో నా ముఖాన్ని రెండుసార్లు శుభ్రం చేసుకుంటా. మొదటగా కొబ్బరి నూనె/క్లెన్సింగ్‌ బామ్‌తో మేకప్‌ తొలగించుకుంటా. ఆపై నురుగు ఆధారిత క్లెన్సర్‌తో ముఖాన్ని మరోసారి శుభ్రపరచుకుంటా.

గులాబీ నీరు, గ్లిజరిన్‌ కలిపి తయారుచేసిన మిశ్రమాన్ని టోనర్‌గా ఉపయోగిస్తా. ఎన్నో ఏళ్లుగా ఇదే చిట్కా ఫాలో అవుతున్నా. చలికాలంతో పాటు ఇతర కాలాల్లోనూ దీన్ని వాడుతుంటా.

ఆపై యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే సీరమ్‌ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుంటా.

నా చర్మ సౌందర్య రొటీన్‌లో బ్యారియర్‌ కేర్‌ క్రీమ్‌ పాత్ర కీలకం. ఇది చర్మానికి రక్షణ కవచంలా పనిచేసి.. చల్లగాలుల వల్ల చర్మం పొడిబారకుండా చేస్తుంది. ఇందులోనూ సెరమైడ్స్‌, పెప్టైడ్స్‌.. వంటి పదార్థాలు అధికంగా ఉన్న క్రీమ్‌ను ఎంచుకుంటా.

బ్యారియర్‌ కేర్‌ క్రీమ్‌ అప్లై చేసుకున్న తర్వాత ఫేస్‌ ఆయిల్‌ రాసుకుంటా. ఇది చర్మంలోని తేమను లాక్‌ చేస్తుంది. ఫలితంగా పొడిబారే సమస్య తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు. అయితే ఈ ఫేస్‌ ఆయిల్‌ తప్పనిసరిగా రాసుకోవాలన్న నియమమేమీ లేదు. జిడ్డుగా ఉంటుందేమో అనుకునే వారు, జిడ్డు చర్మతత్వం ఉన్న వారు దీన్ని స్కిప్‌ చేయచ్చు.

కనుబొమ్మలు, కనురెప్పల అందానికి ఆముదం, ఆలివ్‌ నూనెల్ని ఉపయోగిస్తా. ముందుగా వీటిని కర్లర్‌తో తీర్చిదిద్దుకొని.. ఆపై నూనె మిశ్రమాన్ని అప్లై చేసి కాస్త మర్దన చేసుకుంటా.

ఆఖరుగా పెదాలకు లిప్‌ బామ్‌ అప్లై చేసుకోవడంతో నా బ్యూటీ కేర్‌ రొటీన్ ముగుస్తుంది..’ అంది కృతి.

అది నా బ్యాగులో ఉండాల్సిందే!

చలికాలంలోనే కాదు.. ఏ కాలంలోనైనా తాను పాటించే బ్యూటీ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటుంది కృతి. ఇందులో భాగంగా..

⚛ నా హ్యాండ్‌బ్యాగ్‌లో ఏమున్నా, లేకపోయినా సన్‌స్క్రీన్‌ తప్పనిసరిగా ఉంటుంది. కాలం, వాతావరణంతో సంబంధం లేకుండా రోజూ మూడు గంటలకోసారి దీన్ని అప్లై చేసుకుంటా. అతినీల లోహిత కిరణాల నుంచే కాదు.. ట్యానింగ్‌, పిగ్మెంటేషన్‌ సమస్యల నుంచీ ఇది రక్షిస్తుంది.

⚛ రాత్రి నిద్రపోయే ముందు మేకప్‌ తప్పనిసరిగా తొలగించుకుంటా. ఈ క్రమంలో గాఢత తక్కువగా ఉండే క్లెన్సర్‌తో ముందు ముఖాన్ని శుభ్రం చేసుకొని.. ఆపై ఫేస్‌వాష్‌తో ముఖం కడుక్కుంటా.

⚛ తరచూ ఫేస్‌ప్యాక్‌లు వేసుకోవడం కూడా నా అందానికి ఓ కారణమే! అది కూడా కలబంద, శెనగపిండి, పసుపు, నిమ్మరసం.. వంటి సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన ఫేస్‌ప్యాక్‌లకే ప్రాధాన్యమిస్తా.

⚛ ఆహారం కూడా మన అందాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే చర్మాన్ని లోలోపలి నుంచి మెరిపించడానికి పండ్ల రసాలు, కాయగూరలతో చేసిన జ్యూసులు, నీళ్లు ఎక్కువగా తీసుకుంటా..’ అందీ బాలీవుడ్‌ అందం.

జుట్టుకు కొబ్బరి నూనె!

చలి ప్రభావం చర్మం పైనే కాదు.. జుట్టు పైనా పడుతుంది. అందుకే కేశ సౌందర్యం విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకుంటానంటోంది కృతి.

⚛ షూటింగ్‌ మినహా ఇతర సందర్భాల్లో హెయిర్‌స్టైలింగ్‌ ఉత్పత్తులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటా. తలస్నానం చేశాక కూడా హెయిర్‌ డ్రయర్స్‌తో పని లేకుండా సహజసిద్ధంగానే జుట్టును ఆరబెట్టుకుంటా.

⚛ ఆమ్లత్వం నిండిన పదార్థాలు తీసుకుంటే జుట్టు బలహీనపడి ఎక్కువగా రాలిపోతుంటుంది. అందుకే జుట్టు ఆరోగ్యం కోసం ప్రొటీన్లు అధికంగా ఉండే కోడిగుడ్లు, నట్స్‌, బీన్స్‌, గింజలు.. వంటివి ఎక్కువగా తీసుకుంటా. అలాగే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు నిండి ఉన్న అవిసె గింజలు, ఆకుకూరలు, చేపలు.. తీసుకుంటా.

⚛ షాంపూ చేసుకునే ముందు జుట్టును, కుదుళ్లను కొబ్బరి నూనెతో మర్దన చేసుకోవడం నాకు అలవాటు. దీనివల్ల జుట్టు ప్రకాశవంతంగా మారుతుంది. అలాగే మర్దన వల్ల కుదుళ్లకు రక్తప్రసరణ మెరుగై జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

⚛ చలికాలంలో జుట్టు విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నా తేమను కోల్పోయి పొడిబారిపోతుంటుంది. అందుకే ఈ సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా వారానికోసారి సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన హెయిర్‌మాస్క్‌ని వేసుకుంటా. ఇక తలస్నానం తర్వాత కండిషనర్‌ రాసుకోవడం మాత్రం అస్సలు మిస్సవ్వను..’ అంటూ తన హెయిర్‌కేర్‌ సీక్రెట్స్‌నీ పంచుకుందీ బాలీవుడ్‌ బ్యూటీ.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్