Zero waste: పాత దుస్తులకు కొత్త రూపు తెస్తోంది!

నచ్చిందనో, కొత్త ఫ్యాషన్‌ అనో.. షాపింగ్‌కి వెళ్లినప్పుడల్లా ఏదో ఒక డ్రస్‌/చీర కొనేస్తుంటాం. ఓ నాలుగుసార్లు తృప్తిగా దాన్ని ధరించకముందే అది పాతబడిందంటూ పక్కన పడేస్తాం. దీంతో వార్డ్‌రోబ్‌లో చీరలు, దుస్తులు కొండలా పేరుకుపోతాయి. ఇలా ‘అవుటాఫ్ ఫ్యాషన్‌’ అని మనం పక్కన పడేసే పాత దుస్తులకు....

Published : 22 Jan 2023 14:27 IST

నచ్చిందనో, కొత్త ఫ్యాషన్‌ అనో.. షాపింగ్‌కి వెళ్లినప్పుడల్లా ఏదో ఒక డ్రస్‌/చీర కొనేస్తుంటాం. ఓ నాలుగుసార్లు తృప్తిగా దాన్ని ధరించకముందే అది పాతబడిందంటూ పక్కన పడేస్తాం. దీంతో వార్డ్‌రోబ్‌లో చీరలు, దుస్తులు కొండలా పేరుకుపోతాయి. ఇలా ‘అవుటాఫ్ ఫ్యాషన్‌’ అని మనం పక్కన పడేసే పాత దుస్తులకు సరికొత్త ఫ్యాషన్‌ హంగులు అద్దుతున్నారు హైదరాబాద్‌కు చెందిన ప్రియాంక. పాత దుస్తుల్ని అప్‌సైక్లింగ్‌ చేసే ముఖ్యోద్దేశంతో ఓ స్టార్టప్‌ను ప్రారంభించారామె. దుస్తుల దగ్గర్నుంచి ప్యాకింగ్‌ దాకా అడుగడుగునా ‘జీరో వేస్ట్‌’ నినాదంతో ముందుకు సాగుతోన్న తన ఫ్యాషన్‌ లేబుల్‌ గురించి ‘వసుంధర.నెట్‌’తో ప్రత్యేకంగా పంచుకున్నారామె.

నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. ఫ్యాషన్‌పై మక్కువతో బెంగళూరులో ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాను. ఆ తర్వాత వివిధ సంస్థలలో మెన్స్‌వేర్‌, కిడ్స్‌వేర్‌ డిజైనర్‌గా పనిచేశాను. ఇలా డిజైనింగ్‌లో మరింత అనుభవం గడించాక.. ఉద్యోగం మానేసి సొంతంగా ఓ డిజైనింగ్‌ ఏజెన్సీ తెరిచాను. దేశవ్యాప్తంగా పలు రిటైల్ బ్రాండ్స్‌కు అవసరమైన డిజైన్లను రూపొందించి అందించా. అయితే రెండో బిడ్డ పుట్టడంతో కొద్ది రోజులు బ్రేక్  తీసుకున్నా.

ఆచరణే వ్యాపార సూత్రమైంది!

అయితే పాప పెరిగి పెద్దయ్యే కొద్దీ మరింత ఖాళీ సమయం దొరికేది. ఈ క్రమంలో సొంతంగా మళ్లీ ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనిపించేది. చిన్నతనం నుంచే పర్యావరణహిత ఫ్యాషన్స్‌కు ప్రాధాన్యమివ్వడం నాకు అలవాటు. దీన్నే నా వ్యాపార సూత్రంగా ఎందుకు మలచుకోకూడదనిపించింది. ఈ ఆలోచనకు తోడు.. వ్యక్తిగతంగా నేను ఎదుర్కొన్న కొన్ని సమస్యలు.. సస్టెయినబుల్‌ ఫ్యాషన్‌ దిశగా నాతో అడుగులు వేయించాయి. అయితే ఈ ఆలోచనను ఆచరణలో పెట్టే క్రమంలో పలువురు మహిళల అభిప్రాయాల్ని కూడా పరిగణనలోకి తీసుకున్నా. ఇవన్నీ ‘కుల స్టూడియో’ పేరుతో ఓ అప్‌సైక్లింగ్‌ ఫ్యాషన్‌ స్టోర్ తెరిచేందుకు ఊతమిచ్చాయి. చాలామంది వార్డ్‌రోబ్స్‌లో కట్టుకోని చీరలు, వేసుకోని దుస్తులు కుప్పలు తెప్పలుగా పడి ఉంటాయి. కొంతమంది వాటితో తమకు నచ్చినట్లుగా దుస్తులు డిజైన్‌ చేయించుకోవాలనుకున్నా సరైన డిజైనర్‌ దొరక్కపోవచ్చు. ఒకవేళ దొరికినా అది వెస్ట్రన్‌/ట్రెడిషనల్‌.. ఇలా వారి ఇష్టాలకు అనుగుణంగా రాకపోవచ్చు. చాలామంది ఎదుర్కొనే ఈ సమస్యనే మా లేబుల్‌ ద్వారా పరిష్కరించాలనుకున్నాం. వృథా అంటూ పక్కన పడేసే దుస్తులతోనే వినియోగదారుల శరీరాకృతికి తగినట్లుగా, వారి అభిరుచులకు అనుగుణంగా ఫ్యాషనబుల్‌ దుస్తుల్ని డిజైన్‌ చేయడమే మా ముఖ్యోద్దేశం.

150కి పైగా స్టైల్స్!

కాటన్‌ చీరలు, సిల్క్‌ చీరలు, డెనిమ్స్.. ప్రస్తుతం ఈ మూడు విభాగాలకు సంబంధించిన విభిన్న డిజైనర్‌ టెంప్లెట్స్‌ మా వద్ద ఉన్నాయి. వీటితో వెస్ట్రన్‌, ఇండో-వెస్ట్రన్‌, కుర్తా, లెహెంగా.. వంటి దుస్తుల్ని రూపొందించడంతో పాటు డ్యామేజ్‌ అయిన దుస్తులతో, కుట్టగా మిగిలిపోయిన కట్‌ పీసెస్‌తో.. టేబుల్‌ రన్నర్, దివాన్‌ సెట్‌, పర్సులు, ఐప్యాడ్‌ కవర్లు, కళ్లద్దాల కవర్లు, బ్యాగ్స్‌.. వంటి ఇంటికి సంబంధించిన పలు ఉత్పత్తులు, యాక్సెసరీస్‌ని కూడా డిజైన్‌ చేస్తున్నాం. మొదట్లో వినియోగదారుల నుంచి సేకరించిన పాత దుస్తుల్ని వారికి కావాల్సినట్లుగా డిజైన్‌ చేసి తిరిగిచ్చేసేవాళ్లం. కానీ తర్వాత్తర్వాత మేమే చేనేత క్లస్టర్లు, చేతివృత్తి కళాకారుల దగ్గర్నుంచి.. వృథాగా పడేసే కట్‌పీసెస్‌, దుస్తులకు సంబంధించిన మెటీరియల్‌ను కొనడం మొదలుపెట్టాం. వాటిని ‘కుల లైబ్రరీ’లో పొందుపరిచి.. వినియోగదారుల అవసరం, అభిరుచిని బట్టి డిజైన్‌ చేసివ్వడం ప్రారంభించాం. ఇలా ప్రస్తుతం వినియోగదారులు ఇచ్చిన దుస్తుల్ని తిరిగి సరికొత్తగా అందించడంతో పాటు.. మా మెటీరియల్‌తోనూ విభిన్న స్టైల్స్‌లో దుస్తుల్ని రూపొందిస్తున్నాం. ప్రస్తుతం మా వెబ్‌సైట్లో 150కి పైగా స్టైల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో దేశవ్యాప్తంగా మా సేవలు అందిస్తున్నాం. కొన్నిసార్లు పాప్‌-అప్‌ స్టోర్స్‌ కూడా ఏర్పాటుచేస్తుంటాం. ‘జీరో వేస్ట్‌’ అనేది మా లేబుల్‌ నినాదం. అందుకే దుస్తులే కాదు.. మా వద్ద ప్యాకింగ్‌ కూడా పర్యావరణహితంగానే ఉంటుంది.

బాడీ పాజిటివిటీని పెంపొందించేలా..

ముఖ్యంగా మా బ్రాండ్‌ని బాడీ పాజిటివిటీని ప్రోత్సహించే దిశగా ముందుకు తీసుకెళ్దామనుకున్నాం. అందుకే దుస్తులకు సంబంధించిన టెంప్లెట్స్‌ మాత్రమే కాదు.. తమ శరీరాకృతి, కొలతల్ని బట్టి వినియోగదారులు తమ ‘అవతార్‌’ని తామే ఎంచుకునేలా.. భారతీయ మహిళల శరీరాకృతుల్ని పరిగణనలోకి తీసుకొని కొన్ని క్యారక్టర్స్‌ని డిజైన్‌ చేశాం. అందులో తమ శారీరక కొలతల్ని బట్టి తగిన క్యారక్టర్‌ని ఎంచుకోవచ్చు.. లేదంటే వినియోగదారులు విడిగా తమ కొలతలు ఇచ్చి దుస్తుల్ని డిజైన్‌ చేయించుకోవచ్చు. ఈ క్రమంలో ‘సైజింగ్‌ అవతార్‌ గైడ్‌’ని మెయిల్‌ చేస్తాం. లేదంటే ఆర్డర్‌ పెట్టగానే అందులోనే కొలతలు ఫీడ్‌ చేసుకునేలా ఆప్షన్‌ ఉంటుంది. అలాగే కొన్ని ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల వేదికగా మా దుస్తుల్ని విక్రయించాలన్న ఆలోచన కూడా ఉంది. భవిష్యత్తులో మా సేవల్ని మరో మూడు దేశాలకు విస్తరించాలనుకుంటున్నా. దుస్తుల రీసైక్లింగ్ ద్వారా వాతావరణ కాలుష్యాన్ని సాధ్యమైనంతమేర తగ్గించాలన్నది నా ఆశయం.

వాటి సహకారం ఎంతో..!

వ్యాపారం ప్రారంభించడంతోనే సరిపోదు.. అందులో నిలదొక్కుకోవాలంటే.. మరిన్ని మెలకువలు నేర్చుకోవాలి. ఈ క్రమంలోనే ఐఐఎం బెంగళూరులో నిర్వహించిన ‘విమెన్‌ స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ ప్రోగ్రామ్’ నాకెంతగానో దోహదపడింది. ఇందులో భాగంగా.. టాప్‌-40 స్టార్టప్స్‌లో చోటు దక్కించుకున్నా. అలాగే దాన్నుంచి మాకు కొన్ని గ్రాంట్స్‌ కూడా అందాయి. వీ-హబ్‌లో చేరాక మార్కెటింగ్‌ నైపుణ్యాలు మెరుగయ్యాయి. నీతి ఆయోగ్‌లోనూ భాగమయ్యాను. ఇక వ్యాపారం కోసం నా సొంత డబ్బుతో పాటు.. స్టార్టప్‌ ఇండియా, ‘అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌’ నుంచి కొన్ని నిధులు సమీకరించాను. ‘యూఎన్‌ ఇండస్ట్రీ డిస్‌రప్టివ్‌ ప్రోగ్రామ్‌’కు ఎంపికైన అతి కొన్ని స్టార్టప్స్‌లో మాది ఒకటి. ప్రస్తుతం బిట్స్‌ పిలానీ- గోవా ‘బయోనెస్ట్‌’లో భాగమయ్యాం. అంతేకాదు.. అంతర్జాతీయంగా పలు సంస్థల సహకారం కూడా మాకు అందుతోంది.

సౌకర్యం ముఖ్యం!

చాలామంది మహిళలు దుస్తుల ఫిట్టింగ్‌ అంటే శరీరాకృతికి అతికినట్లుగా, నప్పేలా ఉంటే చాలనుకుంటారు. కానీ శరీరాకృతికి నప్పడంతో పాటు సౌకర్యవంతంగా ఉన్నప్పుడే అందం ఇనుమడిస్తుంది. స్టైల్‌ అనేది వ్యక్తిగతం. అలాంటప్పుడు ఇతరుల మాటలు పట్టించుకోవడం, ఇతరులతో పోల్చుకోవడం.. వంటివి సరికాదు. కాబట్టి శరీరానికి నప్పేలా, సౌకర్యవంతంగా ఉండేలా, చూడ్డానికి ఇంపుగా కనిపించేలా దుస్తుల ఎంపిక ఉండాలి. అంతేకానీ.. ఇతరుల అభిప్రాయాలకు తగినట్లుగా వాటిని ఎంచుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మనం కొత్త దారిని ఎంచుకున్నప్పుడు విమర్శలు సహజం. వాటిని పట్టించుకోకుండా.. మన మనసు మాట విన్నప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలం. నా బిజినెస్ జర్నీలో నేను నేర్చుకున్నది ఇదే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్