ఆత్మహత్య చేసుకున్నాడు...ఆస్తి రాదా!

నాకు పెళ్లై మూడేళ్లు. నా భర్త వ్యసనపరుడనే విషయం దాచి పెళ్లి చేశారు. పెళ్లయిన మూడురోజులకే తాగి కొట్టడంతో పుట్టింటికి వచ్చేశా.

Published : 07 Feb 2023 00:25 IST

నాకు పెళ్లై మూడేళ్లు. నా భర్త వ్యసనపరుడనే విషయం దాచి పెళ్లి చేశారు. పెళ్లయిన మూడురోజులకే తాగి కొట్టడంతో పుట్టింటికి వచ్చేశా. అప్పటి నుంచి పెద్ద మనుషులతో మాటలు జరుగుతున్నాయి. ఈలోగా చేసిన అప్పులు తీర్చడానికి....అత్తమామలు డబ్బులు ఇవ్వలేదని ఆవేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. వారికి మా వారొక్కరే కొడుకు. మా అబ్బాయిని కాదనుకుని వెళ్లావు. నీకు చిల్లిగవ్వ ఇచ్చేది లేదంటున్నారు. నాకు ఆయన ఆస్తిలో వాటా వచ్చే అవకాశం ఉందా?

- ఓ సోదరి

కచ్చితంగా వస్తుంది. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్‌ 10 ప్రకారం మీరు క్లాస్‌ 1 వారసుల కిందకు వస్తారు. మీ భర్త చనిపోయే నాటికి అతని పేరు మీద ఏదైనా ఆస్తి ఉంటే అందులో మీకు సగం వాటా వస్తుంది. అతడు చనిపోక ముందు మీరు ఇల్లు వదిలి వెళ్లడానికి కారణాలు జతపరుస్తూ... మిమ్మల్ని మీరు పోషించుకోలేని ప్రస్తుత స్థితిని తెలియచేస్తూ...మీ అత్తమామల్ని ప్రతివాదులుగా చేర్చి కోర్టులో మెయింటెనెన్స్‌ పిటిషన్‌ వేయండి. హిందూ దత్తత భరణపోషణముల చట్టంలోని సెక్షన్‌ 19 క్లాజ్‌(1)(ఎ) ప్రకారం భర్త చనిపోయిన కోడలు తనని తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు భర్త ఆస్తి నుంచీ లేదా మామగారి దగ్గర నుంచి భరణం కోరవచ్చు. అలానే, పెళ్లప్పుడు ఇచ్చిన కట్నకానుకలు, పెట్టిన ఖర్చులు కూడా తిరిగి తీసుకోవాలనుకుంటే గృహహింస చట్టాన్ని ఆశ్రయించాలి. ఈ చట్టంలోని మూడు, నాలుగు సెక్షన్‌లలో ఆర్థిక హింసను నిరోధించేందుకు... న్యాయంగా దక్కాల్సిన ఆస్తిని వారికి వచ్చేలా చేయడం, వారికి చెందాల్సిన ఆస్తిని అమ్మనీయకుండా రక్షణ కల్పించడం, తమని తాము పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు తగినంత జీవనభృతి కల్పించడం వంటివి చేర్చారు. అంతేకాదు ఈ డొమెస్టిక్‌ వయొలెన్స్‌ యాక్ట్‌-17 ద్వారా ఇంట్లో ఉండే హక్కు, సెక్షన్‌ 19 ప్రకారం మీ ఆస్తిని మీరు దక్కించుకునేందుకు రెసిడెన్స్‌ ఆర్డర్‌ని అడగొచ్చు.అయితే, ఇవన్నీ మీ మామగారు పోషించగలిగే స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలి. ముందు ఓ మంచి లాయర్‌ని కలవండి. తప్పక న్యాయం జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్