Legal Advice: ఆస్తి వెనక్కి తీసుకోవచ్చా??

మా వారు రిటైర్డ్‌ ఉద్యోగి. నేను గృహిణిని. ఇద్దరం ఎనభయ్యో పడికి దగ్గర్లో ఉన్నాం. మాకు ఇద్దరబ్బాయిలు. వయసు పైబడుతోందని ఆస్తులన్నీ వారి పేరిట రాసి మేం విశ్రాంతి తీసుకోవాలనుకున్నాం.

Published : 11 Apr 2023 00:48 IST

మా వారు రిటైర్డ్‌ ఉద్యోగి. నేను గృహిణిని. ఇద్దరం ఎనభయ్యో పడికి దగ్గర్లో ఉన్నాం. మాకు ఇద్దరబ్బాయిలు. వయసు పైబడుతోందని ఆస్తులన్నీ వారి పేరిట రాసి మేం విశ్రాంతి తీసుకోవాలనుకున్నాం. అనుకున్నట్లుగానే ఆ పని చేశాం. అయితే, పిల్లలు మాత్రం మా బాధ్యతలు తీసుకోలేదు. మమ్మల్ని భారంగా భావించి నెలరోజులకే వృద్ధాశ్రమంలో చేర్చారు. అప్పటి నుంచి నా భర్త మనోవ్యధతో మంచం పట్టారు. నేను మాత్రం వారికి బుద్ధి చెప్పాలనుకుంటున్నా. మా ఆస్తిని వెనక్కి తీసుకునే దారేదైనా ఉందా? చట్టం మాకేమైనా సాయం చేయగలదా?

- ఓ సోదరి

మీ పరిస్థితి బాధాకరం. మీలాంటి వారి సంరక్షణ కోసమే ‘2007 సీనియర్‌ సిటిజన్‌ యాక్ట్‌’ని తీసుకొచ్చారు. వయోవృద్ధులకు పోషణ, భద్రత కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. అరవై ఏళ్లు పైబడిన అందరూ ఈ చట్టం పరిధిలోకి వస్తారు. ఇందులోని సెక్షన్‌ 4 ప్రకారం తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్న వృద్ధులు... వారి పిల్లల దగ్గర నుంచి కానీ, వారి ఆస్తిని పంచుకున్న బంధువర్గం నుంచి కానీ జీవన భృతిని పొందవచ్చు. ఇందులో కూతురు, కొడుకు, మనవడు, మనవరాళ్లను పిల్లలుగా పరిగణిస్తారు. మైనర్లు ఈ చట్టపరిధిలోకి రారు. వృద్ధుల పోషణ బాధ్యత అంటే తిండి, బట్ట, ఉండటానికి ఇల్లు, ఆరోగ్య అవసరాలు తీర్చడమే. ముందు మెయింటెనెన్స్‌ని కోరుతూ సీనియర్‌ సిటిజన్‌ యాక్ట్‌ కింద ఏర్పాటయిన ట్రైబ్యునల్‌లో దరఖాస్తు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ పెద్దవారు దరఖాస్తు పెట్టలేని స్థితిలో ఉంటే వారి తరఫున ఎవరైనా కూడా ఆ పని చేయొచ్చు. ఇందులో ఎవరినైతే ప్రతివాదులుగా చేరుస్తారో...వారిని ట్రైబ్యునల్‌ పిలిపించి విచారణ చేస్తుంది. ఈ చట్టంలోని సెక్షన్‌ 23 అరవైఏళ్లు దాటిన వ్యక్తులెవరైనా తమ ఆస్తులను పిల్లలకు రాసిన తర్వాత వారు తమ తల్లిదండ్రుల పోషణ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోతే ఆ ఆస్తిని వెనక్కి తీసుకునే అవకాశం కల్పిస్తోంది. కాబట్టి, ముందు మీరు సీనియర్‌ సిటిజన్స్‌ ట్రైబ్యునల్‌లో దరఖాస్తు ఇవ్వండి. వారు మీ పిల్లలను పిలిపించి విచారణ జరిపి మీకు న్యాయం చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్