Published : 31/10/2022 20:55 IST

ఈ మసాజ్‌ ఆయిల్స్‌తో ఉపయోగాలెన్నో..!

మసాజ్‌.. అందాన్ని పెంపొందించుకోవడానికి, శారీరక నొప్పుల్ని దూరం చేసుకోవడానికి ఎంతగానో దోహదం చేస్తుందీ ప్రక్రియ. అందులోనూ కొన్ని అత్యవసర నూనెల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మరి, ఏంటా నూనెలు? వాటిలో దాగున్న పోషకాలేంటి? అవి ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి? రండి.. తెలుసుకుందాం...

బాదం నూనె

శరీరానికి మసాజ్‌ చేసే నూనెల్లో బాదం నూనె చాలా ముఖ్యమైంది. చర్మం తేమను కోల్పోయి నిర్జీవంగా తయారైనప్పుడు ఈ నూనెతో మసాజ్‌ చేయించుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీనికి కారణం ఇందులో అధిక మొత్తంలో ఉండే ఓలియిక్‌, లినోలెయిక్‌ ఆమ్లాలే. ఇవి చర్మాన్ని ఎక్కువ తేమగా ఉంచడానికి సహాయపడతాయి. బాదం నూనెతో మసాజ్‌ చేయించుకోవడం వల్ల కండరాల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

ఆలివ్‌ ఆయిల్

మసాజ్‌ కోసం ఉపయోగించే నూనెల్లో ఆలివ్‌ ఆయిల్‌ చాలా ముఖ్యమైంది. దీనిలో శరీరానికి కావాల్సిన జింక్‌, క్యాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం.. వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇందులో ఉండే విటమిన్‌ ఇ చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఇది అన్ని చర్మతత్వాల వారికీ సరిపోతుంది. అలాగే ఈ నూనెతో మసాజ్‌ చేయించుకోవడం వల్ల శరీరంలోని కండరాలు పటిష్టమై మంచి శరీరాకృతి సొంతమవుతుంది.

నిమ్మగడ్డి నూనె

తాజా నిమ్మగడ్డి ఆకుల్ని తీసుకుని స్టీమ్‌ డిస్టిలేషన్‌ ప్రక్రియ ద్వారా నిమ్మగడ్డి నూనెను తయారుచేస్తారు. ఇది అలసటను తగ్గించి శరీరాన్ని పునరుత్తేజితం చేస్తుంది. ఈ నూనెతో మసాజ్‌ చేయించుకోవడం వల్ల తలనొప్పి తగ్గడంతో పాటు నాడీవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా తోడ్పడుతుంది. అలాగే జలుబు, ఫ్లూ, జ్వరం.. వంటి అనారోగ్యాలు దరిచేరకుండా కూడా ఉంటాయి. కండరాల్లోని నొప్పిని తగ్గించి, వాటిని దృఢంగా తయారుచేయడంలోనూ నిమ్మగడ్డి నూనె బాగా సహకరిస్తుంది.

నువ్వుల నూనె

చర్మంపై అప్పుడప్పుడూ ఎర్రగా దద్దుర్లలాగా ఏర్పడతాయి. మరి ఇలాంటి చర్మ సమస్యల నుంచి విముక్తి పొందడానికి నువ్వుల నూనెతో మసాజ్‌ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు, విటమిన్‌ ఇ.. వంటివి వివిధ రకాల చర్మ సమస్యల్ని దూరం చేసి చర్మాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే ఇది ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను కూడా దూరం చేయడంలో సహకరిస్తుంది.

కొబ్బరి నూనె

శరీరానికి, మనసుకు ప్రశాంతతను చేకూర్చేది కొబ్బరి నూనె. ఇందులో లాక్టిక్‌, లారిక్‌ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇది వాతావరణంలోని హానికారక క్రిములు, బ్యాక్టీరియా నుంచి చర్మాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే ఇందులో ఎక్కువ మొత్తంలో ఉండే విటమిన్‌ ఇ చర్మాన్ని తాజాగా, పునరుత్తేజితమయ్యేలా చేస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను తగ్గించి చర్మాన్ని నవయవ్వనంగా ఉండేలా చేస్తాయి. కాబట్టి మసాజ్‌ ఆయిల్స్‌లో కొబ్బరి నూనెకు ఓ ప్రత్యేక స్థానం ఉంది.

అవకాడో నూనె

అవకాడో నూనె చాలా మందంగా ఉంటుంది. కాబట్టి దీన్ని బాదం, కొబ్బరి.. వంటి పలుచటి నూనెలతో కలిపి ఉపయోగిస్తారు. ఈ నూనెలో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్లు ఎ,డి.. వంటి పోషకాలు అలర్జీ, మొటిమలు, మచ్చలు.. లాంటి చర్మ సమస్యల్ని దూరం చేస్తాయి. అలాగే వయసు పైబడే కొద్దీ చర్మంపై పడే ముడతల్ని తగ్గిస్తాయి. అవకాడో నూనె శరీరంలో కొలాజన్‌ పనితీరును మెరుగుపరిచి చర్మకణాల సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని