Updated : 07/12/2021 14:03 IST

మెనోపాజ్ దశలోకి ప్రవేశిస్తున్నారా? అయితే ఇది చదవండి..

మెనోపాజ్.. చాలామంది పెద్ద వయసులో ఎదురయ్యే ఇబ్బందిగా భావిస్తారు. అయితే నిజానికిది ఇబ్బంది కాదు.. ఓ సూచన మాత్రమే.. లేటు వయసులో మనకెదురవబోతున్న సమస్యలన్నింటికీ అలారంలా పనిచేసి వాటిపై మనం దృష్టి సారించేలా చేస్తుంది. అందుకే మెనోపాజ్ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా అదుపులో ఉంచే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తే జీవితాంతం ఆనందంగా గడపొచ్చు.. అక్టోబర్‌ను ‘ప్రపంచ మెనోపాజ్‌ అవగాహన మాసం’గా జరుపుకుంటోన్న నేపథ్యంలో దీని గురించి అవగాహన పెంచుకుందాం...

మెనోపాజ్.. చాలా సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా వచ్చిన నెలసరి ఆగిపోయే టైమ్. స్త్రీ పునరుత్పత్తి వయసు అయిపోయిందనడానికి ఇది సూచన అన్నమాట. అర్థం కాలేదా? ప్రతి ఆడపిల్లా పుట్టినప్పుడు దాదాపు పది నుంచి ఇరవై లక్షల అండాలతో పుడుతుంది. ఇవి రోజులు గడిచే కొద్దీ తగ్గుతూ ఉంటాయి. రుతుక్రమం ప్రారంభమయ్యే సమయానికి మూడు నుంచి నాలుగు లక్షల అండాలు మాత్రమే మిగులుతాయి. ఇలా ప్రతి నెలా కొన్ని అండాలు విడుదలవుతూ, మెనోపాజ్ నాటికి ఈ నిల్వ పూర్తిగా తరిగిపోతుంది. తర్వాత అండాశయాల నుంచి ఇక అండం విడుదల కాదు. దాంతో పాటే హార్మోన్ల విడుదల కూడా ఆగిపోతుంది.

అయితే ఈ ప్రక్రియ అంతా ఒక్కసారిగా ఏం జరిగిపోదు.. మెనోపాజ్‌కి 5-7 సంవత్సరాలకు ముందు నుంచే ఈ మార్పులు ప్రారంభమవుతాయి. హార్మోన్ల స్థాయి కూడా నెమ్మదిగానే తగ్గుతుంది. ఆ సమయంలో పిట్యూటరీ గ్రంథి నుంచి గొనడోట్రోపిన్ లాంటి హార్మోన్ల విడుదల ఎక్కువై శారీరకంగా మార్పులు జరుగుతాయి. దాంతో మెనోపాజ్ దశకు చేరుకుంటారు. సాధారణంగా 47 నుంచి 53 సంవత్సరాల లోపు ఈ ప్రక్రియ జరుగుతుంది. మెనోపాజ్ సగటు వయసు 51 సంవత్సరాలు. అలాకాకుండా మెనోపాజ్ మరీ 40 కంటే ముందే వస్తే దాన్ని 'ప్రిమెచ్యూర్ మెనోపాజ్' అంటారు.

లక్షణాలతో గుర్తించొచ్చు..

మెనోపాజ్‌ని ఎలా గుర్తించాలి? ఆ సమయంలో ప్రతి ఒక్కరికీ కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. వాటి ద్వారా మెనోపాజ్ దశకు చేరుకున్నామని గుర్తించొచ్చు. వీటిల్లో కొన్ని లక్షణాలు ఒక్కసారిగా దాడి చేస్తే మరికొన్ని ఆలస్యంగా మొదలవుతాయి. వెంటనే, ఉన్నట్టుండి మొదలయ్యే లక్షణాల్లో.. శరీరమంతా లేదా కొన్ని భాగాల్లో అంటే తల, మెడ, ఛాతీ దగ్గర చర్మం అంతా కందిపోయినట్టు ఎర్రగా తయారవుతుంది. ఈ భాగాల్లో చాలా వేడిగా కూడా ఉంటుంది. చెమటలు కారిపోతూ ఉంటాయి. వీటిని 'హాట్ ఫ్లషెస్' అంటాం.. నిద్రలోనూ చెమటలు పట్టి, పక్కంతా తడిసిపోయి ఉన్నట్టుండి మెలకువ వచ్చేస్తుంది. ఇలా ఎక్కువసార్లు జరగడం వల్ల దాని ప్రభావం దినచర్యపై పడి చిరాకు, కోపం, అసహనం లాంటివి పెరిగిపోతూ ఉంటాయి. ఓ రకంగా చూస్తే ఇది మొదటి లక్షణం.. ఈ లక్షణాలు మరీ విపరీతంగా ఉన్నప్పుడు డాక్టర్లు ఈస్ట్రోజెన్ హార్మోన్‌ని సూచిస్తారు. అయితే కొన్ని సంవత్సరాల ముందు నుంచే ప్రాణాయామం, ధ్యానం, యోగా లాంటివి చేసే వారిలో ఈ లక్షణాలు తక్కువగా కనిపిస్తాయి. హార్మోన్ తీసుకోవడానికి వీల్లేని వారికి యాంటీ డిప్రెసెంట్లు మరో ప్రత్యామ్నాయం.

రెగ్యులర్ పిరియడ్స్ కోసం..

మెనోపాజ్‌ని సూచించే మరో లక్షణం నెలసరిలో తేడా.. మెనోపాజ్‌కు ఏడాది, రెండేళ్ల ముందు నుంచీ నెలసరి క్రమం తప్పుతుంది. కొన్నిసార్లు త్వరగా వచ్చేస్తే, మరికొన్నిసార్లు ఆలస్యంగా రెండు మూడు నెలలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఆ సమయంలో కూడా రక్తస్రావం మరీ ఎక్కువగా లేదా మరీ తక్కువగా ఒక పద్ధతంటూ లేకుండా వచ్చి ఇబ్బంది పెడుతుంది. ఒకటి, రెండు నెలలు నెలసరి రాకపోయేసరికి ఒక్కోసారి గర్భం అనుకొని చాలామంది భయపడుతూ ఉంటారు. అలాంటి తేడాలుంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. డాక్టర్లు గర్భనిరోధక మాత్రలను సూచిస్తారు. చాలామంది వీటిని వాడటానికి సందేహిస్తూ ఉంటారు కానీ ఇవి ఒక విధంగా మనకు మేలే చేస్తాయని అనుకోవచ్చు. ఎందుకంటే వాటిని వాడటం వల్ల నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది. అదే సమయంలో ఈ మాత్రలు ఎముకలకు రక్షణగా పనిచేస్తాయి. ఎండోమెట్రియల్, అండాశయ క్యాన్సర్ల బారి నుంచి కూడా రక్షిస్తాయి. వీటన్నింటి వల్లా అవాంఛిత గర్భం వస్తుందనే భయం కూడా ఉండదు.

సమస్యకు స్వాంతన

మెనోపాజ్ ప్రభావం మూత్రవ్యవస్థ, జననేంద్రియాల పైన కూడా పడుతుంది. ఎందుకంటే మెనోపాజ్ ముందు వరకు యోని, మూత్రనాళం, మూత్రకోశాల్లో ఈస్ట్రోజెన్ రిసెప్టర్లు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఈస్ట్రోజెన్ తగ్గుతుందో అప్పుడు ఆ కణజాలం బలహీనమై, పొడిబారిపోతుంది. అదే అసౌకర్యానికి, మంటకు దారితీస్తుంది. ఇక మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కలయిక సమయంలో నొప్పి వంటివి సాధారణంగా వచ్చే సమస్యలే.. ఇలాంటి సమస్యలను తగ్గించడానికి హార్మోన్లు తీసుకోవడమే మంచి పద్ధతి. దాన్నే హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ (హెచ్ఆర్‌టీ) అంటారు. ఒకవేళ హార్మోన్లు వద్దనుకుంటే ఈస్ట్రోజెన్‌ను ఆయింట్‌మెంట్ రూపంలో వాడొచ్చు. అలాగే వెజైనల్ క్రీములు కూడా డాక్టర్ సలహాతో ఎంచుకోవచ్చు. కలయిక సమయంలో కలిగే అసౌకర్యాన్ని తగ్గించుకోడానికి ల్యూబ్రికెంట్ జెల్లీలు కొంతవరకు ఉపయోగపడతాయి.

కొన్ని సమస్యలు ఆలస్యంగా..

అండాశయాల నుంచి హార్మోన్ల విడుదల ఆగిపోవడం, ముఖ్యంగా ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గడం వల్ల కొన్ని సమస్యలు కనిపిస్తూ ఉంటాయి.

* ఎముక లోపల క్యాల్షియం, విటమిన్ 'డి' నిల్వలు తగ్గి అవి బలహీనంగా మారతాయి. ఈ దశను 'ఆస్టియోపీనియా' అంటారు. ఎముకలు క్రమంగా గుల్లబారి మెత్తగా తయారవుతాయి. అదే ఆస్టియోపోరోసిస్.. కొన్నిసార్లు ఒళ్లంతా నొప్పులుగా అనిపించడం, చిన్న దెబ్బ తగిలినా ఫ్రాక్చర్లు కావడం లాంటివి ఆస్టియోపొరోసిస్‌ను సూచిస్తాయి. ఎముకల సాంద్రత తగ్గకుండా ఈస్ట్రోజెన్‌తో పాటు క్యాల్షియం, విటమిన్ 'డి' తీసుకోవాలి. ఒకవేళ ఎముకల బలం విపరీతంగా తగ్గితే వాటిని పెంచేందుకు మందులు వాడొచ్చు.

* మెనోపాజ్ ప్రభావం మానసిక ఆరోగ్యం పైనా పడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. మగవారితో పోలిస్తే ఆడవారిలో అల్జీమర్స్ సమస్య ఎక్కువని తేలింది. ఈస్ట్రోజెన్‌కి నాడీ వ్యవస్థను కాపాడే లక్షణం ఉంటుంది. ఎప్పుడైతే ఆ హార్మోన్ స్థాయి తగ్గుతుందో సమస్య మొదలవుతుంది. అలాగే కండరాలు కూడా బలహీనమైపోతాయి.

* మెనోపాజ్ వచ్చే వరకు స్త్రీలలో గుండెపోటు చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ యాభై సంవత్సరాలు దాటిన తర్వాత పురుషులతో సమానంగా మహిళలు కూడా గుండెపోటు ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. ఎందుకంటే అప్పటివరకు ఈస్ట్రోజెన్ గుండెను, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అదీ కాక యాభై దాటిన తర్వాత రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల అవి సన్నగా మారిపోతాయి.

 

లైఫ్‌స్టైల్‌ మార్పులతో..

మెనోపాజ్ దశలో వచ్చే సమస్యలను అధిగమించాలంటే జీవనశైలి పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి..

* ఈ సమయంలో సోయాబీన్స్, బీన్స్ జాతి గింజలు, వాటితో దొరికే ఇతర పదార్థాలు, ఎక్కువగా తీసుకోవాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయల మోతాదును పెంచాలి.

* యాంటీ క్యాన్సర్ పదార్థాలుగా పరిగణించే టొమాటో, గుమ్మడి, క్యారెట్, బొప్పాయి లాంటి వాటికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.

* జ్ఞాపక శక్తి కోసం ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా లభించే అవిసె గింజలు, డ్రైఫ్రూట్స్, చేపల్ని తరచుగా తినాలి. ఫైబర్, ప్రొటీన్లుండే పదార్థాలను ఎక్కువగా ఎంచుకోవాలి. అదే సమయంలో కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, జంక్‌ఫుడ్, ప్రిజర్వేటివ్స్ కలిపినవి తగ్గించాలి.

* వ్యాయామం వల్ల కొవ్వు తగ్గడమే కాకుండా కండరాలు బలహీనపడకుండా ఉంటాయి. అలాగే ఎముకలకు క్యాల్షియం చేరేలా చేయడంలోనూ వ్యాయామం పాత్ర చాలా కీలకం. రోజూ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల ఎముకల్లోకి క్యాల్షియం చేరుతుంది. అలాగే రక్తప్రసరణ కూడా చక్కగా జరిగి.. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

* 'యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్' అనే మాట వినే ఉంటారు. ఏదైనా సరే దీర్ఘకాలం పాటు వాడకపోతే, అది పనిచేయడం మానేస్తుంది. ఈ మాట మన మెదడుకు చక్కగా వర్తిస్తుంది. మెనోపాజ్ సమయంలో ఎదురయ్యే కొన్ని చికాకులతో కొంతమంది నిర్లిప్తంగా మారిపోతుంటారు. ఇలా కావడం వల్ల మెదడు పనితీరు కూడా తగ్గిపోతుంది. దాన్ని అధిగమించాలంటే మెదడుకు కూడా తగినంత పని చెప్పాలి. చురుగ్గా ఉండాలి. అలాంటప్పుడే మానసిక ఆరోగ్యం మన సొంతమవుతుంది.

* మనం ఆరోగ్యంగా ఉన్నామా? లేదా? అని నిర్ధరించుకోవడం కూడా ఈ సమయంలో ముఖ్యమే.. దీనికోసం చేయించుకోవాల్సిన పరీక్షలు కొన్నున్నాయి. 40 సంవత్సరాలు వచ్చిన దగ్గర్నుంచి మమోగ్రామ్, పాప్‌స్మియర్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్ టెస్ట్, బీపీ చెకప్.. లాంటివి చేయించుకుంటూ ఉండాలి. మెనోపాజ్ వచ్చిన తర్వాత ఐదేళ్లకోసారి బోన్ డెన్సిటీ టెస్ట్ కూడా చేయించుకోవాలి..

ఈ విధంగా జీవనశైలిలో కొన్ని మార్పులు పాటిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే మెనోపాజ్ దశలోనూ మామూలుగానే ఉండటానికి అవకాశం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని