Gold Jewellery: ఇలాంటి నగలు కచ్చితంగా ఉండాలట!

పండగైనా, పెళ్లైనా, ప్రత్యేక సందర్భమైనా.. ధరించే దుస్తులతో పాటు, మ్యాచింగ్‌గా వేసుకునే ఆభరణాలదీ కీలక పాత్రే! అలాగని ప్రతి డ్రస్సుకూ తగినట్లుగా బంగారు నగ చేయించుకోలేం కాబట్టి.. బయట దొరికే ఆర్టిఫిషియల్‌ జ్యుయలరీని ఎంచుకుంటాం.

Updated : 25 Aug 2023 20:45 IST

పండగైనా, పెళ్లైనా, ప్రత్యేక సందర్భమైనా.. ధరించే దుస్తులతో పాటు, మ్యాచింగ్‌గా వేసుకునే ఆభరణాలదీ కీలక పాత్రే! అలాగని ప్రతి డ్రస్సుకూ తగినట్లుగా బంగారు నగ చేయించుకోలేం కాబట్టి.. బయట దొరికే ఆర్టిఫిషియల్‌ జ్యుయలరీని ఎంచుకుంటాం. అయితే మన వార్డ్‌రోబ్‌లో ఇలాంటి నగలెన్ని ఉన్నా.. బంగారు ఆభరణాల సొగసు, ప్రత్యేకతే వేరు! అందుకే ప్రతి ఒక్కరి దగ్గరా చిన్నవో, పెద్దవో.. కొన్ని బంగారు నగలు తప్పనిసరిగా ఉండాలంటున్నారు నిపుణులు. వాటితో ఎలాంటి అకేషన్స్‌లోనైనా సింపుల్‌గా, స్టైలిష్‌గా మెరిసిపోవచ్చంటున్నారు. ఇంతకీ మన వార్డ్‌రోబ్‌లో కచ్చితంగా చోటివ్వాల్సిన ఆ నగలేంటో తెలుసుకుందాం రండి..

చెయిన్‌.. కాస్త ప్రత్యేకంగా!

గోల్డ్‌ చెయిన్స్‌ దాదాపు ప్రతి ఒక్కరూ ధరిస్తారు. అయితే కొంతమంది ట్రెండును బట్టి వీటిని మార్చుతూ.. కొత్తవి చేయించుకోవడం, కొనుక్కోవడం చేస్తుంటారు. ఇలాంటి ఆలోచన ఉన్న వారు రెండు లేదా మూడు లేయర్ల చెయిన్‌ ఎంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఒకే రకమైన డిజైన్‌తో రెండు లేదా మూడు లేయర్లుగా తయారుచేసే ఈ లేయర్డ్‌ చెయిన్‌ ఒక్కటి వార్డ్‌రోబ్‌లో ఉంటే చాలంటున్నారు. చూడ్డానికి సింపుల్‌గానే ఉన్నా.. చిన్న సైజు నెక్లెస్‌/నెక్‌పీస్‌లా కనిపించే దీన్ని క్యాజువల్‌గానే కాదు.. పార్టీలు, పెళ్లిళ్లు, ఇతర ప్రత్యేక సందర్భాల్లోనూ ధరించి మెరిసిపోవచ్చు. పైగా ఈ తరహా చెయిన్లు ఇప్పుడు ఫ్యాషన్‌ కూడా! ఇలా లేయర్డ్ చెయిన్‌కు కాస్త భారీగా ఉన్న ఇయర్‌రింగ్స్‌ని జతచేస్తే.. ఎంత పెద్ద ఫంక్షన్లో అయినా భారీ నెక్లెస్‌లతో పనిలేకుండానే హెవీగా కనిపించేయచ్చు.. కూల్‌ లుక్‌ను సొంతం చేసుకోవచ్చు.

హూప్స్‌తో ట్రెండీగా..!

హూలాహూప్‌ ఇయర్‌ రింగ్స్‌.. ఇప్పుడు చాలామంది అమ్మాయిల వార్డ్‌రోబ్‌లో కామనైపోయిందీ నగ. కాకపోతే.. ఆర్టిఫిషియల్‌, సిల్వర్‌, ఆక్సిడైజ్‌డ్‌ హూప్సే ఎక్కువ మంది దగ్గర కనిపిస్తాయి. అయితే ఇలా ఎన్ని మార్చినా.. బంగారంతో తయారుచేసిన హూప్‌ ఇయర్‌రింగ్స్‌కు ఏదీ తీసిపోదంటున్నారు నిపుణులు. అందుకే గోల్డ్‌ హూప్‌ రింగ్స్‌ని ఎంచుకోమంటున్నారు. ఇందులోనూ ప్రస్తుతం బోలెడన్ని డిజైన్లు మార్కెట్లో కొలువుదీరాయి. ప్లెయిన్‌ హూప్స్‌తో పాటు కింద బుట్టాలున్నవి, పొడవాటి చెయిన్‌ అనుసంధానించినవి, డ్రాప్‌ మాదిరిగా డిజైన్‌ చేసినవి, ముత్యాలు/స్టోన్స్‌ పొదిగినవి, చాంద్‌బాలీ హూప్స్‌.. ఇలా మీకు నచ్చిన డిజైన్‌ను ఎంచుకొని.. చేయించుకుంటే ఏ అకేషన్‌కైనా ధరించచ్చు. పైగా మ్యాచింగ్‌ అంటూ ప్రతి డ్రస్‌కూ ఇయర్‌రింగ్స్‌ కొనాల్సిన అవసరమూ ఉండదు.. ఒక్కసారి బంగారంతో చేయించుకుంటే.. పదే పదే ఇలాంటి ఖర్చూ తప్పుతుంది. ఇక ఈ హూప్‌ ఇయర్‌రింగ్స్‌ క్యాజువల్‌, ట్రెడిషనల్‌.. ఎలాంటి అకేషన్‌కైనా.. ఏ తరహా దుస్తుల మీదికైనా ఇట్టే నప్పుతాయి కూడా!

స్టడ్స్‌తో సింపుల్‌ లుక్!

కొంతమందికి క్యాజువల్‌గానైనా, అకేషనల్‌గానైనా.. సింపుల్‌గా తయారవడానికే ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలో జుంకాలు, పెద్ద పెద్ద ఇయర్‌ రింగ్స్‌ నచ్చని వారు స్టడ్స్‌తో సింపుల్‌గా, సౌకర్యవంతంగా మెరిసిపోవాలనుకుంటారు. ఇలాంటి వారి వార్డ్‌రోబ్‌లో బంగారంతో తయారుచేసిన స్టడ్స్‌ తప్పనిసరిగా ఉండాలంటున్నారు నిపుణులు. ఇందులోనూ ప్రస్తుతం బోలెడన్ని డిజైన్లలో రూపొందించిన స్టడ్స్‌ అమ్మాయిల మనసు దోచుకుంటున్నాయి. ముత్యాలు, వజ్రాలు, రంగురంగుల రాళ్లు, అదృష్ట రత్నం.. వంటివి అమర్చుకొని మీకు నచ్చిన గోల్డ్‌ స్టడ్స్‌ని తయారుచేయించుకోవచ్చు. ఇక ప్రస్తుతం మెష్‌ తరహా స్టడ్స్‌ని ఎక్కువమంది అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. వాటిలోనూ మధ్యమధ్యలో స్టోన్స్‌, డైమండ్స్‌ పొదిగినవి ఎంచుకుంటే మరింత క్లాసీ లుక్‌ని సొంతం చేసుకోవచ్చు. ఇక వీటిని క్యాజువల్‌ దుస్తుల పైకే కాదు.. పార్టీ వేర్‌, ప్రత్యేక సందర్భాల్లోనూ మనం ధరించే దుస్తులకు మ్యాచ్‌ చేసుకుంటే నలుగురిలోనూ సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలవచ్చు.

బ్రేస్‌లెట్‌.. బ్యాంగిల్‌.. మీ ఇష్టం!

ఒక చేతికి వాచీ పెట్టుకున్నా.. మరో చేయిని అలా బోసిగా వదిలేయలేం..! అలాగని ప్రతి డ్రస్‌కు మ్యాచింగ్‌గా గాజుల్నీ కొనలేం. కాబట్టి బంగారంతో తయారుచేసిన ఓ గాజో లేదంటే కాస్త లావుగా చేయించుకున్న కంకణమో ధరిస్తే.. ప్రత్యేకమైన లుక్‌ వస్తుంది. పైగా మనం ధరించేది చీరైనా, డ్రస్సైనా.. ఈ గాజులు, కంకణాలు చక్కగా సరిపోతాయి. ఎలాంటి అకేషన్‌కైనా ఇట్టే నప్పేస్తాయి కూడా! అయితే గాజులు మరీ ట్రెడిషనల్‌గా ఉంటాయేమో అనుకునే వారు.. బంగారు బ్రేస్‌లెట్‌ను తయారుచేయించుకోవచ్చు. అలాగని తులాల కొద్దీ బంగారం దీనికి అవసరం ఉండదు. సింపుల్‌గా ఉండాలనుకునే వారు అరతులంలోనే వివిధ డిజైనర్ బ్రేస్‌లెట్లు తయారుచేయించుకోవచ్చు. చెయిన్‌ తరహా బ్రేస్‌లెట్‌ మోడల్‌ పాతబడిపోయిందనుకునే వారు.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న కటౌట్‌ బ్రేస్‌లెట్‌ మోడల్‌ను ఎంచుకోవచ్చు. ఇవీ అన్ని రకాల అకేషన్స్‌కి, అన్ని రకాల దుస్తులకూ సూటవుతాయి.

ఉంగరం.. ఇలా!

డ్రస్‌కు, అకేషన్‌కు తగ్గట్లుగా ఉంగరాలు మార్చే వారు చాలా తక్కువమంది ఉంటారు. అలాగని వేళ్లకు ఏమీ పెట్టుకోకపోతే బోసిగా ఉంటుంది. ఇప్పుడు ఉంగరాల్లో ఎన్నో ట్రెండీ డిజైన్లు వస్తున్నాయి. ఈ క్రమంలో మీకు నచ్చిన ఉంగరాలు కొనుక్కుంటే.. ఇటు రోజూ, అటు అకేషనల్‌గా.. ఇలా రెండు విధాలుగా ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. అలాగే ట్రెడిషనల్‌గా ఉండాలనుకునేవారు అదృష్ట రత్నం పొదిగినవి, రాళ్లు-డైమండ్స్‌ పొదిగినవి, జాలీ మాదిరిగా డిజైన్‌ చేసినవి, టెంపుల్ జ్యుయలరీ తరహాలో ఉండేవి.. .. ఇలా మీకు నప్పినవి కొనుక్కోవచ్చు.. లేదంటే ప్రత్యేకంగా చేయించుకోవచ్చు. ఇవేవీ వద్దనుకునే వారు తమకున్న హారాలు, నెక్లెస్‌లకు మ్యాచింగ్‌గా ఓ సింపుల్ ఉంగరం చేయించుకుంటే.. అన్ని అకేషన్లకు ధరించచ్చు. అయితే జాలీ తరహా ఉంగరాల్లో మురికి త్వరగా చేరుతుంది. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్