Updated : 28/10/2022 19:13 IST

రొమ్ము క్యాన్సర్.. అపోహలు వద్దు!

రొమ్ము క్యాన్సర్.. ప్రస్తుతం మహిళలని వేధించే వ్యాధుల్లో ముఖ్యమైనది. మన దేశంలో ఏటా దీని బారిన పడేవారు లక్షల్లో ఉంటున్నారంటే ఈ వ్యాధి తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. సరైన అవగాహన ఉంటే ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి.. దాన్ని ఎదుర్కొనే వీలుంటుంది. అయితే చాలామంది మహిళలకు రొమ్ముక్యాన్సర్ గురించి ఎన్నో రకాల అపోహలుంటాయి. 'రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం' నేపథ్యంలో ఇలాంటి కొన్ని అపోహలేంటో తెలుసుకొని, వాటిని తొలగించుకునే ప్రయత్నం చేద్దాం..

అపోహ : రొమ్ముల్లో కనిపించే గడ్డలన్నీ క్యాన్సర్ గడ్డలే.

వాస్తవం : ఇది నిజం కాదు. రొమ్ముల్లో కనిపించే గడ్డల్లో పదింట తొమ్మిది క్యాన్సర్ కారక గడ్డలు కావు. అయినా సరే గడ్డ ఏర్పడినట్లు భావించిన తక్షణం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.

అపోహ : రొమ్ము క్యాన్సర్ సాధారణంగా వయసు మీరిన వారికే వస్తుంది.

వాస్తవం : ఇది పూర్తిగా నిజం కాదు. 80 శాతం రొమ్ము క్యాన్సర్ కేసులు 50 ఏళ్ల పైబడిన స్త్రీలలోనే కనిపిస్తున్నా.. ఇటీవల కాలంలో 40 ఏళ్లు దాటిన వారిలోనూ ఈ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తోంది.

అపోహ : రొమ్ము క్యాన్సర్ పురుషులకు రాదు.

వాస్తవం : పురుషుల్లో కూడా రొమ్ము క్యాన్సర్ రావచ్చన్న విషయం చాలామందికి తెలియదు. పురుషుల్లో స్త్రీలకున్నట్లు రొమ్ములుండవు. కాబట్టి ఇది పురుషుల్లో రాదని భావించడం నిజం కాదు. రొమ్ము కణజాలం పురుషుల్లో కూడా ఉంటుంది. కాబట్టి కొంతమంది పురుషుల్లో కూడా ఈ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది.

అపోహ : రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష ప్రతి మహిళకూ అవసరం లేదు.

వాస్తవం : రొమ్ము క్యాన్సర్ రావడానికి కారణాలు ఏవైనప్పటికీ ఆలస్యం చేయకుండా వ్యాధిని గుర్తించడం మంచిది. దీనికి మన ముందున్న ఏకైక మార్గమే 'రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష'. వ్యాధి లక్షణాలను వీలైనంత త్వరగా గుర్తించి.. సాధ్యమైనంత త్వరగా నివారించుకోవాలంటే ఈ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి.

అపోహ : రొమ్ము క్యాన్సర్ వంశపారంపర్యంగా మాత్రమే వస్తుంది. కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ చరిత్ర లేకపోతే మిగిలిన వారికి రాదు.

వాస్తవం : ఇది నిజం కాదు. ఎందుకంటే రొమ్ము క్యాన్సర్ బారిన పడిన వారి కుటుంబాల్లో చాలామంది ఆరోగ్యంగానే ఉంటున్నారు. వంశపారంపర్యంగా రొమ్ము క్యాన్సర్ రావడానికి 10 శాతం వరకే అవకాశాలున్నాయని నిపుణుల అభిప్రాయం.

అపోహ : బిడ్డకు పాలిస్తే రొమ్ము క్యాన్సర్ రాదు.

వాస్తవం : ఇది కొంతవరకే నిజం. బిడ్డకు పాలివ్వడం వల్ల క్యాన్సర్ రాకూడదని లేదు. అయితే రాకుండా ఉండటానికి కొంతవరకు అవకాశాలున్నాయి.

అపోహ : రొమ్ములు పెద్దగా ఉండే స్త్రీలలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

వాస్తవం : రొమ్ముల పరిమాణానికి, దీనికీ సంబంధం లేదన్నది నిపుణుల అభిప్రాయం.

అపోహ : రొమ్ము క్యాన్సర్‌ని తొలి దశలో గుర్తించడం కష్టం.

వాస్తవం : ఇది నిజం కాదు. చేత్తో తడిమినప్పుడు గడ్డల్లా తగలడానికి కొన్నేళ్ల ముందే క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. మామోగ్రఫీ పరీక్ష ద్వారా వీటిని గుర్తించడం సాధ్యమవుతుంది. ముందే గడ్డలు గుర్తించడం వల్ల చికిత్స చాలా సులువవుతుందంటున్నారు నిపుణులు.

అపోహ : మామోగ్రఫీ పరీక్ష చాలా బాధాకరంగా ఉంటుంది.

వాస్తవం : ఇది కూడా నిజం కాదు. ఈ పరీక్ష కూడా సాధారణ ఎక్స్‌రే మాదిరే ఉంటుంది. కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ, ఎలాంటి నొప్పీ ఉండదు. డిజిటల్ మామోగ్రఫీతో కలిగే అసౌకర్యం చాలా తక్కువగా ఉండటం గమనార్హం.

అపోహ : రొమ్ము క్యాన్సర్‌కు దారితీసే నిర్దిష్ట కారణాలేంటో వైద్య పరిశోధకులకు తెలుసు.

వాస్తవం : రొమ్ము క్యాన్సర్‌కి నిర్దిష్ట కారణాలేంటో ఇప్పటివరకూ పరిశోధకులు కూడా గుర్తించలేకపోయారు. అయితే స్త్రీ కావడం, వయసు మీరడం.. ఈ రెండూ ప్రధాన అంశాలుగా భావించవచ్చు.

అలాగే రొమ్ము క్యాన్సర్‌కి దారితీసే మరికొన్ని అంశాలు:

⚛ ఇది వరకు ఒక రొమ్ములో క్యాన్సర్ రావడం.

⚛ కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉండడం (ప్రత్యేకించి దగ్గర రక్త సంబంధీకులకు ఉండడం.)

⚛ రుతుక్రమం చాలా చిన్న వయసులోనే ప్రారంభం కావడం (12 సంవత్సరాల లోపే ప్రారంభమైతే)

⚛ రుతుక్రమం ఆగిపోయే దశ ఆలస్యం కావడం (55 సంవత్సరాల తర్వాత)

⚛ పిల్లలు కలగకపోవడం, మొదటి బిడ్డ 30 ఏళ్లు దాటిన తర్వాత కలగడం.

⚛ హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (హెచ్ఆర్‌టీ) చాలా ఎక్కువకాలం వాడడం.

⚛ లావుగా ఉండడం (బరువు బాగా పెరగడం, ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన తర్వాత)

అపోహ : పైన చెప్పిన వాటిలో ఒక్క కారణం ఉన్నా.. రొమ్ము క్యాన్సర్ రావచ్చు.

వాస్తవం : పైన చెప్పిన వాటిలో కొన్ని అంశాలు వర్తించినప్పటికీ సదరు మహిళకు క్యాన్సర్ తప్పనిసరిగా వచ్చితీరుతుందని చెప్పలేం.

అపోహ : రొమ్ములకు తగిలే గాయాలు కూడా క్యాన్సర్‌కు కారణం కావచ్చు.

వాస్తవం : రొమ్ములకు తగిలే గాయాల వల్ల క్యాన్సర్ రాదు.

అపోహ : రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించలేం.

వాస్తవం : రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. ప్రారంభ దశలో గుర్తిస్తే, చికిత్స చేయడం, పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుంది.

అపోహ : రొమ్ములో గడ్డ కనబడితే తప్ప రొమ్ము క్యాన్సర్‌ను కనిపెట్టలేం.

వాస్తవం : రొమ్ములో గడ్డ ఏర్పడడానికి కొన్ని సంవత్సరాల ముందే మామోగ్రఫీ (రొమ్ము ఎక్స్‌రే)తో కనుక్కోవచ్చు.

అపోహ : మామోగ్రఫీ పద్ధతి ద్వారా రొమ్ము క్యాన్సర్‌ని నూటికి నూరుపాళ్లూ కచ్చితంగా కనిపెట్టవచ్చు.

వాస్తవం : మామోగ్రఫీ రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే కనిపెట్టడానికి ఉన్న సమర్థమైన పద్ధతి. కానీ.. ఇది మిగిలిన స్క్రీనింగ్ పరీక్షల్లాగా నూటికి నూరుపాళ్లూ కచ్చితమైన విధానం కాదు. మామోగ్రఫీ కచ్చితత్వం 85 శాతం మాత్రమే అంటున్నారు నిపుణులు. దీనికి కారణాలేంటంటే..

⚛ కొన్ని క్యాన్సర్లు మామోగ్రామ్‌లో చూడడం చాలా కష్టసాధ్యం.

⚛ శరీరంలో దాగిన కొన్ని క్యాన్సర్ కారక కణుతులు మామోగ్రామ్‌లో కనబడవు.

ఒక్కోసారి, మామోగ్రామ్ పరిశీలించి నిర్ధరించే వ్యక్తి క్యాన్సర్‌ను కచ్చితంగా అంచనా వేయలేకపోవచ్చు. (తన వృత్తిరంగంలో ఎంత పరిణతి చెందిన వ్యక్తి అయినా ఒక్కోసారి ఈ విధంగా పొరబడవచ్చు).


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని