ఇలా చేస్తే.. అందం తగ్గదు..!

ఎవరికైనా సరే.. అన్ని వేళల్లోనూ అందంగా కనిపించాలనే ఉంటుంది.. అయితే సహజంగా అందంగా ఉన్నా సరే... మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల అందం తగ్గినట్లు కనిపించే అవకాశం ఉంటుంది.. మరి అలాంటి కొన్ని పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలో చూద్దాం రండి..

Published : 18 Mar 2024 16:05 IST

ఎవరికైనా సరే.. అన్ని వేళల్లోనూ అందంగా కనిపించాలనే ఉంటుంది.. అయితే సహజంగా అందంగా ఉన్నా సరే... మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల అందం తగ్గినట్లు కనిపించే అవకాశం ఉంటుంది.. మరి అలాంటి కొన్ని పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలో చూద్దాం రండి..

ముఖానికి..

ప్రతి ఉదయం అందంగా కనిపించాలంటే ముందురోజు రాత్రి నిద్రపోయే ముందే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. పడుకొనే ముందు ముఖానికి వేసుకున్న మేకప్‌ని పూర్తిగా తొలగించాలి. తర్వాత క్లెన్సర్‌తో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. నైట్‌క్రీం రాసుకోవడం మాత్రం మరిచిపోవద్దు. ఎందుకంటే ఇది చర్మానికి తేమను అందించి మెరిసేలా చేస్తుంది. అలా అని క్రీం మరీ ఎక్కువ మోతాదులో రాసుకుంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది.

పెదవులకు..

పెదవులపై ఉండే చర్మం చాలా సున్నితమైంది. అందుకే వాటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రాత్రి నిద్రపోయే ముందు అధరాలను నీటిలో ముంచిన దూదితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత పెదవులకు నూనె రాసుకొని అయిదు నుంచి పది నిమిషాల పాటు మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా చేస్తే పెదవులకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో అవి ఆరోగ్యంగా, అందంగా తయారవుతాయి.

కళ్ల విషయంలో..

కంటి అందాన్ని మరింతగా పెంచి చూపించడానికి చాలామంది కాటుక, ఐషాడో, మస్కారా వంటివి రాస్తూ ఉంటారు. అయితే చాలామంది ముఖానికి వేసుకున్న మేకప్ తొలగించేటప్పుడు వీటి గురించి మర్చిపోతారు. దీనివల్ల మరుసటి రోజు ఉదయానికి కళ్లు అలసినట్లుగా కనిపిస్తాయి. అంతేకాదు.. కంటి చుట్టూ నల్లని వలయాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి కళ్లకు వేసుకున్న మేకప్‌ని పూర్తిగా తొలగించాక గానీ నిద్రకు ఉపక్రమించకపోవడం మంచిది. అలాగే కనురెప్పలు, కనుబొమ్మలకు కొద్ది మొత్తంలో నూనె రాసి మృదువుగా మర్దన చేసుకోవాలి.

కురులను ఇలా..

ఉదయం ఎప్పుడో జుట్టు దువ్వుకొని రడీ అయి వెళ్లిపోతాం. ఆ తర్వాత మళ్లీ జుట్టు గురించి ఆలోచించం. నిద్రపోయే ముందు కూడా దాన్ని అలానే వదిలేస్తాం. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లకు సరైన రక్త ప్రసరణ జరగదు. దాంతో పాటు గాలి వల్ల చిక్కుపడిన జుట్టును అలాగే వదిలేసి నిద్రపోతే మరిన్ని చిక్కులు పడి మధ్యలోకి తెగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పడుకొనే ముందు లావుపాటి పళ్లున్న దువ్వెనతో జుట్టును దువ్వుకోవాలి. తర్వాత వదులుగా ముడి వేసుకుని రబ్బరు పెట్టుకోవాలి. ఇలా చేస్తే తలకు పట్టిన చెమట కూడా ఆరిపోతుంది. చుండ్రు లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

రాత్రి సమయంలో చర్మానికి మంచి మాయిశ్చరైజర్ రాసుకోవడం కూడా తప్పనిసరి. ఇలా చేయడం వల్ల చర్మం నిగారింపు ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటుంది. అంతే కాకుండా మనం నిద్రపోయే భంగిమ కూడా మన అందంపై ప్రభావం చూపిస్తుంది. బోర్లా పడుకోవడం వల్ల ముఖం మీద చర్మం దిండుకు రాసుకుపోయి సన్నని గీతలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వెల్లకిలా పడుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్