పని ప్రదేశంలో.. భావోద్వేగాలు!

నా కష్టపడేతత్వం, అంకింతభావంతో పనిచేసే తీరుతో పదోన్నతి దొరికింది. ఆరుగురికి సారథ్యం వహించాలి. చాలా ఉత్సాహంగా ఉంది. దాంతోపాటు ఉత్తమ పనితీరూ కనబరచాలనుకుంటున్నా. నేనో హెచ్‌ఆర్‌ని. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ప్రాజెక్టుపై పనిచేస్తున్నా. నేను, నా బృందం పని ప్రదేశంలో అవసరమైన భావోద్వేగాలపై పట్టు సాధించాలనుకుంటున్నా.

Published : 18 Jan 2023 00:43 IST

నా కష్టపడేతత్వం, అంకింతభావంతో పనిచేసే తీరుతో పదోన్నతి దొరికింది. ఆరుగురికి సారథ్యం వహించాలి. చాలా ఉత్సాహంగా ఉంది. దాంతోపాటు ఉత్తమ పనితీరూ కనబరచాలనుకుంటున్నా. నేనో హెచ్‌ఆర్‌ని. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ప్రాజెక్టుపై పనిచేస్తున్నా. నేను, నా బృందం పని ప్రదేశంలో అవసరమైన భావోద్వేగాలపై పట్టు సాధించాలనుకుంటున్నా. ఇది అవసరమేనా? సలహా ఇవ్వండి.

నాయకులకు ఉండాల్సిన నైపుణ్యాల్లో ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ (భావోద్వేగ ప్రజ్ఞ) కూడా ఒకటి. అయితే వాటిని సహోద్యోగుల్లో నెలకొల్పడమే సమస్య. ఒక పరిస్థితిని అంచనా వేయడం, కష్టాన్ని తట్టుకోవడం, నియంత్రించడం, భావోద్వేగాల ఆధారంగా ఎదుటివారిని అంచనా వేయడం, చర్చలు జరపడం వంటివన్నీ దీని కిందకే వస్తాయి. అందుకే నిపుణులూ విజయం సాధించాలంటే ఐక్యూ కంటే దీనికే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలంటారు. భావోద్వేగాలకు విలువిచ్చే చోట అందరూ మనసువిప్పి మాట్లాడగలుగుతారు. ఫలితంగా తోటి సభ్యుల మధ్య బంధాలూ బలపడతాయి, పని ప్రదేశమూ ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి.. ఇది అవసరమే!

ముందు మీ భావోద్వేగాలు, బలాలు, బలహీనతలు, మిమ్మల్ని ముందుకు నడిపే అంశాలేంటో తెలుసుకోండి. మీరేంటో మీకు తెలిసినప్పుడే ఇతరుల తీరు, ఆలోచనలు అర్థమవుతాయి. అప్పుడు దిశానిర్దేశం చేయడంతోపాటు అదుపు ఎలా చేయాలో కూడా తెలుస్తుంది. భిన్న సమయాల్లో ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించుకుంటూ ఉండండి. పొరపాటు చేసినట్లు అనిపిస్తే సరిదిద్దుకోండి. ఇది మిమ్మల్ని ఉత్తమ నాయకురాలిని చేయగలదు.

పైస్థాయిలో ఉన్నవాళ్లు కిందవాళ్ల పనితీరుని ‘సాధారణమే’ అన్నరీతిలో చూడటం సహజమే! కానీ వాళ్ల కష్టానికి గుర్తింపుగా చిన్న ప్రశంస ఇవ్వండి. అదిచ్చిన ఆనందంతో జరిగే అద్భుతాలెన్నో. చిన్న ప్రశంస వారి పనిలో భారీ మార్పును తేగలదు. తప్పులు చెబుతూనే బాధ్యతగా ప్రవర్తించిన వారికి మెప్పు ఇవ్వండి. అందరూ దాన్ని పొందడానికి కృషి చేస్తారు. మెప్పుదల విషయంలో మాత్రం సమానత్వం తప్పనిసరి. తప్పులు ఒప్పుకొనే వీలు కల్పించడం.. మాట్లాడే అవకాశమివ్వడం.. సాయానికి ముందుండటం వంటివీ పనిచేసే చోట ఆరోగ్య వాతావరణాన్ని కల్పిస్తాయి. అయితే ఇదంతా ఒక్కరోజులో నేర్పలేరు. సమయం, ఓపిక కావాలి. ఒక్కసారి మార్పు మొదలైతే మాత్రం దాని ప్రభావం కొనసాగుతుంది. అదనంగా ప్రభావవంతమైన కమ్యూనికేషన్‌, నమ్మకంతో పనిచేయడం వంటి అదనపు లాభాలూ తోడవుతాయి. ఓపిగ్గా ప్రయత్నించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్