Bridal Beauty : కాబోయే వధువుకు కావాలివి!

పెళ్లిలో వధువులే సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తుంటారు. ఇలాంటి అపురూప సౌందర్యాన్ని తమ సొంతం చేసుకోవడానికి నెలల ముందు నుంచే సన్నద్ధమవుతుంటారు.

Published : 05 Dec 2023 13:16 IST

పెళ్లిలో వధువులే సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తుంటారు. ఇలాంటి అపురూప సౌందర్యాన్ని తమ సొంతం చేసుకోవడానికి నెలల ముందు నుంచే సన్నద్ధమవుతుంటారు. ఫొటోషూట్లు, వీడియోల్లో మెరిసిపోవాలని వివిధ రకాల బ్యూటీ చికిత్సలూ చేయించుకుంటుంటారు. అయితే ఈ ప్రయత్నాలకు పలు ఆహార నియమాలు కూడా జోడిస్తే పెళ్లి కళ ఇనుమడిస్తుందంటున్నారు నిపుణులు. మరి, ఇంతకీ ఏంటా డైట్‌ సీక్రెట్స్‌? తెలుసుకుందాం రండి..

⚛ అవిసె గింజలు చర్మంలో కొలాజెన్‌ ఉత్పత్తిని ప్రేరేపించి కొత్త చర్మ కణాలు పుట్టుకొచ్చేలా చేస్తాయి. అలాగే వీటిలో ఉండే యాంటీ ఏజింగ్‌ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మం బిగుతుగా, నవ యవ్వనంగా మారేందుకు సహకరిస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్‌ అధికంగా ఉండే వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చర్మం మెరుస్తుంది.

⚛ శరీరంలోని విషతుల్యాలను తొలగించడానికి డీటాక్స్‌ వాటర్‌ని ఎలాగైతే రోజూ తీసుకుంటామో.. అదేవిధంగా చర్మాన్నీ డీటాక్సిఫై చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మరిగించి గోరువెచ్చగా అయిన గ్లాసు నీటిలో అరచెక్క నిమ్మరసం, టీస్పూన్‌ తేనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ పరగడుపున తీసుకోవడం వల్ల.. ఇందులోని విటమిన్‌ ‘సి’ చర్మాన్ని శుద్ధి చేస్తుంది. తద్వారా చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

⚛ విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే బీట్‌రూట్‌ రసాన్ని రోజూ తీసుకోవడం వల్ల చర్మం లోలోపలి నుంచి ప్రకాశిస్తుంది.

⚛ అల్లం, చామొమైల్‌, సోంపు, పెప్పర్‌మింట్‌.. వంటి పదార్థాలతో తయారుచేసిన హెర్బల్‌ టీలను రోజూ తాగితే జీర్ణ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. అలాగే వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.. జుట్టు ఎదుగుదలనూ ప్రేరేపిస్తాయి.

⚛ చర్మ ఆరోగ్యానికి ప్రొటీన్లు అధికంగా ఉండే చేపలు, పనీర్‌, చికెన్‌, పప్పులు.. వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిలోని అమైనో ఆమ్లాలు కొలాజెన్‌ ఉత్పత్తిని పెంచి.. చర్మం నవయవ్వనంగా ఉండేలా చేస్తాయి.

⚛ ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా లభించే అవకాడో, నట్స్‌, గింజలు, ఆలివ్‌ నూనె.. తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి చర్మాన్ని లోలోపలి నుంచి తేమగా, కాంతివంతంగా చేస్తాయి.

⚛ ఏ పదార్థమైనా మనసు పెట్టి, బాగా నమిలి తినడం వల్ల.. అందులోని పోషకాలు ఒంటికి పడతాయి. తద్వారా చర్మానికి కూడా ఆయా పోషకాలు అంది.. కాంతివంతంగా మెరిసిపోతుంది.

⚛ వధువుల పెళ్లి కళలో కేశ సౌందర్యం పాత్ర కూడా కీలకమే! ఇందుకోసం బెర్రీ పండ్లు, అవకాడో, నట్స్‌, గింజలు, పాలకూర.. వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. ఫలితంగా జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది.

ఇక వీటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, జంక్‌ ఫుడ్‌-చక్కెరలు అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం.. వంటి నియమాలు కూడా వధువులు పాటించడం ముఖ్యం. తద్వారా సంపూర్ణ పెళ్లి కళను సొంతం చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్