Updated : 16/08/2022 20:24 IST

ఇలా ప్రొటీన్లు పొందేద్దాం..!

ఉదయాన్నే నిద్ర లేచింది మొదలు.. వూపిరి సలపని పనులు.. క్షణం తీరికుండదు.. ఒత్తిడి, అలసట.. ఈ విధంగా అలసట రాకుండా ఉండాలంటే శరీరంలో తగినంత శక్తి ఉండాలి. మరి ఆ శక్తి రావాలంటే ఏం చేయాలి? ప్రొటీన్లు మెండుగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీర కండర వ్యవస్థ దృఢమవుతుంది. దీంతో ఎలాంటి అలసట లేకుండా సునాయాసంగా పనులు చేసుకోవడం సాధ్యమవుతుంది. అలాగే ప్రొటీన్లు గుండె బలంగా ఉండేందుకు, రోగ నిరోధకశక్తిని పెంపొందించేందుకూ దోహదం చేస్తాయి. అవసరమైన మేరకు ప్రొటీన్లు లభించే ఆహారం తీసుకుంటే తక్కువ క్యాలరీలతోనే కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది.

నట్స్

ప్రొటీన్లతో నిండిన బాదంపప్పు, పిస్తా, అక్రోట్ వంటి గింజలను ప్రతిరోజూ పరిమితంగా తీసుకోవడం మంచిది. అవి గుండెకు మేలు చేస్తాయి. సలాడ్లు, ఉడికించిన కూరగాయలతో కూడా వీటిని కలుపుకొని తినొచ్చు. అయితే నట్స్‌లో క్యాలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మితంగానే తీసుకోవాలి.

సోయాబీన్స్

సోయాబీన్స్‌లో ప్రొటీన్ల మోతాదు ఎక్కువ. వీటిని సోయా పాలు, సోయా పేస్ట్, టోఫూ రూపంలోనూ తీసుకోవచ్చు. మామూలు పాలలో మాదిరిగానే సోయా పాలలోనూ ప్రొటీన్ ఉంటుంది.

పాలు, పాల పదార్థాలు

కండరాల నిర్మాణానికి తోడ్పడే ప్రొటీన్లు పాల పదార్థాల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటు తగ్గటానికీ తోడ్పడతాయి. గుండె జబ్బు, మధుమేహం ముప్పును దూరంగా ఉంచుతాయి. వెన్న తీసిన పాలు ఒక గ్లాసు తాగితే 8 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. పూర్తిగా కొవ్వు తీసేసిన లేదా తక్కువ కొవ్వు ఉండే పాల పదార్థాలను తీసుకోవాలి.

కూరగాయలు, చిక్కుళ్లు

బఠాణీలు, రాజ్మా, బీన్స్, చిక్కుళ్లు, ఇతర కూరగాయల్లోనూ ప్రొటీన్ ఉంటుంది. ఒక కప్పు రాజ్మాతో 18 గ్రాములు, బఠాణీలతో 9 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. ఒక మాదిరి బంగాళాదుంపలో 4 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.

చేపలు

వీటిల్లో ప్రొటీన్లతో పాటు గుండెకు మేలు చేసే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలూ ఎక్కువగానే ఉంటాయి. ట్యూనా, సాల్మన్, సార్‌డైన్, ట్రాట్ వంటి చేపల్లోనూ ప్రొటీన్ ఎక్కువగానే ఉంటుంది. సుమారు 115 గ్రాముల చొప్పున వారానికి కనీసం రెండుసార్లు ఫిష్ తినడం మంచిది.

మాంసాహారం

మేక, గొర్రె వంటి మాంసాహారంలో ప్రొటీన్లు దండిగా ఉంటాయి. అయితే వీటిల్లో కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మితంగానే తినాలి. 85 గ్రాముల మాంసం ద్వారా 21 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. అలాగే చర్మం తీసేసిన కోడి మాంసం తీసుకోవడం మంచిది. ఇక ఒక కోడిగుడ్డులో 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. కానీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు, గుండెజబ్బు, మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారు డాక్టర్ల సలహా మేరకే ఎన్ని గుడ్లను తినొచ్చో నిర్ణయించుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని