ఆమె చెల్లెల్ని పట్టించుకోవట్లేదు...

నా స్నేహితురాలికి అక్కంటే ప్రాణం. కానీ ఆమె మాత్రం నా స్నేహితురాలిని అసలు పట్టించుకోదు. దీంతో తను బాధపడుతోంది.

Published : 06 Mar 2023 00:15 IST

నా స్నేహితురాలికి అక్కంటే ప్రాణం. కానీ ఆమె మాత్రం నా స్నేహితురాలిని అసలు పట్టించుకోదు. దీంతో తను బాధపడుతోంది. నేనెంత సముదాయించినా ఫలితం లేదు. వాళ్ల అమ్మగారు చనిపోతే అమ్మమ్మే పెంచి పెళ్లిళ్లు చేశారు.

- ఒక సోదరి

చిన్నతనంలో అక్కచెల్లెళ్లిద్దరూ పరస్పరం అన్యోన్యంగా, ఆత్మీయంగా ఉండి ఉంటారు. మీ స్నేహితురాలిది ఉద్వేగాలు పంచుకోవడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి, ధైర్యం కోసం ఇంకొకరి మీద ఆధారపడే తత్వం. దీన్నే ఎమోషనల్లీ డిపెండెంట్‌ పర్సనాలిటీ అంటారు. వీళ్లు శారీరకంగా, మానసికంగా అన్నిటికీ వేరొకరి మీద ఆధారపడతారు. ఆమెకి సోదరి అలా సహకరించి ఉంటుంది. అమ్మ పోవడంతో అక్క మీదే ప్రేమ పెంచుకుంది. కానీ పెళ్లిళ్లయ్యాక ఎవరి జీవితం వారిది, ఎవరి బాధ్యతలు వారివి. ఇప్పుడీమె భర్త, అత్తమామల ఆలంబన పొందడం అలవరచుకోవాలి. వయసుతో, పెళ్లితో ఆలోచనల్లో మార్పు రాకుండా ఇంకా అక్క మీదే ఆధారపడటం వల్ల ఈమె బాధపడుతోంది. సోదరిలో పరిణతి ఉంది కనుక తన కుటుంబ బాధ్యతలు నిర్వహించుకుంటోంది. తల్లిదండ్రులు, స్నేహితులు, సహోద్యోగులు, భాగస్వామి, అత్తమామలు, పిల్లలు.. ఇలా మనకు ఒక్కో దశలో ఒక్కో ఆధారం ఉంటుంది. ఆమె వేరేవాళ్లలో కూడా ఆధారం వెతుక్కుని బలంగా నిలదొక్కుకోవాలి. ఒకరి మీదే ఆధారపడితే ఇలాగే అసహాయత, న్యూనతాభావం, దుఃఖం ఆవరించి ఒంటరితనంతో బాధపడతారు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. అక్కయ్య ఎలా అయితే ఆధారం ఇచ్చిందో దాన్ని మిగతావాళ్ల నుంచి కూడా పొందొచ్చు. అది గ్రహించకుండా ఇంకా అక్కతోనే అన్నీ పంచుకోవాలి, ఆమె నిరంతరం సహకారం అందించాలి- అనుకుంటే మున్ముందు మరింత దుఃఖం, మానసిక అస్థిరత ఏర్పడతాయి. లోకరీతి గురించి చెప్పి ఆమె మారి, ఇతరుల సహకారం తీసుకునేలా, తనంతట తాను నిలబడగలిగేలా అవగాహన కలిగించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్