అందుకే తడి జుట్టుతో నిద్ర వద్దు..!

రోజువారీ పనుల్లో పడిపోయి, వృత్తి ఉద్యోగాల్లో బిజీగా ఉన్న మహిళలకు తమకంటూ కాస్త సమయం కేటాయించుకోవడానికి కూడా సమయం సరిపోదు. కనీసం తమ అందాన్ని పరిరక్షించుకోవడానికి కూడా వారికి టైముండదు! ఈ క్రమంలో చివరికి తలస్నానాన్ని....

Published : 14 Oct 2022 13:18 IST

రోజువారీ పనుల్లో పడిపోయి, వృత్తి ఉద్యోగాల్లో బిజీగా ఉన్న మహిళలకు తమకంటూ కాస్త సమయం కేటాయించుకోవడానికి కూడా సమయం సరిపోదు. కనీసం తమ అందాన్ని పరిరక్షించుకోవడానికి కూడా వారికి టైముండదు! ఈ క్రమంలో చివరికి తలస్నానాన్ని కూడా వాయిదా వేసే వారూ లేకపోలేదు. ఇలాంటి వారు ఏ రాత్రికో, పడుకునే ముందో తలస్నానం చేసి ఆరబెట్టుకోవడానికి సమయం లేక.. జుట్టు తడిగా ఉండగానే నిద్ర పోతుంటారు. మీరూ ఇలాగే చేస్తున్నారా? అయితే మీ జుట్టు ఆరోగ్యాన్ని మీరే చేజేతులా దెబ్బ తీస్తున్నారన్నమాట! అంతేకాదు.. ఈ అలవాటు మన రోగనిరోధక శక్తి పైనా ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. మరి, తడి జుట్టుతో అలాగే నిద్రపోవడం వల్ల సౌందర్యపరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? అలా జరగకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? రండి.. తెలుసుకుందాం..

తడిసిన జుట్టు చాలా బలహీనంగా ఉంటుంది.. అందుకే తలస్నానం చేసిన వెంటనే దువ్వకూడదని చెబుతుంటారు సౌందర్య నిపుణులు. ఒకవేళ అలా చేస్తే వెంట్రుకలు తెగిపోవడం, ఎక్కువ జుట్టు రాలిపోవడం.. వంటి సమస్యలొస్తాయి. అదేవిధంగా జుట్టు తడిగా ఉన్నప్పుడు అలాగే నిద్రపోవడం వల్ల కూడా వివిధ రకాల సమస్యలకు లోనయ్యే అవకాశం ఉంది..

జుట్టు తెగిపోతుంది!

సాధారణంగా జుట్టు తడిగా ఉన్నప్పుడు ముడుచుకోకుండా అలాగే వదిలేస్తుంటాం. పడుకునే ముందు తలస్నానం చేసినా జుట్టు విరబోసుకొనే పడుకుంటాం. ఈ క్రమంలో బెడ్‌పై అటూ ఇటూ దొర్లడం వల్ల జుట్టు, దిండుతో రాపిడికి గురవుతుంది. ఫలితంగా అప్పటికే బలహీనంగా ఉండడం వల్ల వెంట్రుకలు సులభంగా తెగిపోవడం, చిట్లిపోవడం.. వంటివి జరుగుతాయంటున్నారు నిపుణులు. అందుకే ఎంత ఆలస్యమైనా సరే.. పడుకునే ముందు కాస్త సమయం కేటాయించి జుట్టును కాటన్‌ టవల్‌తో తుడుచుకొని ఆరబెట్టుకోవాలని సూచిస్తున్నారు.

జలుబు చేస్తుంది..

తడిగా ఉన్న జుట్టును బిగుతుగా ముడేసుకోవడం, జడ వేసుకోవడం.. వంటివి చేస్తే కాసేపటికే తలంతా బరువుగా అనిపిస్తుంటుంది. అందుకే తలస్నానం చేశాక జుట్టును పొడిగా తుడుచుకోవాలని, లేదంటే జలుబు చేస్తుందని చెబుతుంటారు మన ఇళ్లల్లో ఉండే పెద్దవారు. కానీ వారి మాటల్ని మనలో చాలామంది పెడచెవిన పెడుతుంటారు. అయితే ఇలా పెద్దలు చెప్పిన మాట అక్షరాలా నిజమంటున్నారు నిపుణులు. అప్పటికే జుట్టు తడిగా ఉండడం, రాత్రుళ్లు వాతావరణం కూడా చల్లగా ఉండడంతో.. ఈ రెండింటి ప్రభావంతో జలుబు చేసే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు.. తడి జుట్టు వాతావరణంలోని ఫ్లూ వైరస్‌ను త్వరగా ఆకర్షించడం కూడా ఇందుకు మరో కారణమంటున్నారు. కాబట్టి తడి జుట్టుతోనే పడుకోకుండా ముందుగా ఆరబెట్టుకోవాలని సూచిస్తున్నారు.

చుండ్రు వేధిస్తుంది!

తడి జుట్టుతో అలాగే పడుకోవడం వల్ల చుండ్రు సమస్య కూడా తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో జుట్టుకు సరిగ్గా గాలి తగలక కుదుళ్లలో ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు రావడమే ఇందుకు కారణమంటున్నారు. దీంతో పాటు కేశాల్లోని తడిదనం వల్ల దిండు కూడా తేమగా అయిపోతుంది. తద్వారా వాతావరణంలోని బ్యాక్టీరియా దిండుకు త్వరగా ఆకర్షితమవుతుంది. ఇలా కుదుళ్లలోని ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు, వాతావరణంలోని బ్యాక్టీరియా.. ఈ రెండూ దిండు ద్వారా మన చర్మానికి అంటుకొని మొటిమలకు కారణమవుతాయట! అందుకే సాధ్యమైనంత వరకు జుట్టు ఆరబెట్టుకున్నాకే నిద్రకు ఉపక్రమించాలంటున్నారు నిపుణులు.

ఈ సమస్యలు కూడా!

✬ జుట్టు తేమగా ఉన్నప్పుడు దిండుపై పడుకోవడం వల్ల ఆ తడిదనంతో పాటు జుట్టులోని సహజసిద్ధమైన నూనెలు కూడా దిండులోకి ఇంకుతాయి. ఫలితంగా కేశాలు తమ సహజత్వాన్ని కోల్పోయి నిర్జీవమైపోతాయి.

✬ తడి జుట్టుతో అలాగే నిద్రపోవడం వల్ల రోగ నిరోధక శక్తి పైనా ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. దీనికి తోడు ఏసీ గదుల్లో పడుకుంటే ఆ చల్లదనం, జుట్టులోని తేమ కలగలిసి తలనొప్పి, జలుబు.. వంటి ఇతరత్రా అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

✬ జుట్టును సరిగ్గా ఆరబెట్టుకోకుండా అలాగే వదిలేసుకొని నిద్ర పోవడం వల్ల జుట్టు చిక్కులు కడుతుంది. ఫలితంగా మరుసటి రోజు దువ్వినప్పుడు ఎక్కువ జుట్టు రాలిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్