ఈ బామ్మ గారి ఫిట్‌నెస్ సీక్రెట్.. అదేనట!

ఇంట్లో, ఆఫీస్‌లో కాస్త పని ఎక్కువైతే అలసట దరిచేరుతుంది. వయసులో ఉన్నా వయసు పైబడిన వారిలా ఆపసోపాలు పడుతుంటారు చాలామంది. ఈ 80 ఏళ్ల గ్రానీని చూస్తే అలాంటి వారందరి అలసట హుష్‌కాకి అయిపోవాల్సిందే! ఈ వయసులోనూ ఎవరిపైనా ఆధారపడకుండా తన పనులు....

Published : 18 Jan 2023 20:37 IST

(Photos: Instagram)

ఇంట్లో, ఆఫీస్‌లో కాస్త పని ఎక్కువైతే అలసట దరిచేరుతుంది. వయసులో ఉన్నా వయసు పైబడిన వారిలా ఆపసోపాలు పడుతుంటారు చాలామంది. ఈ 80 ఏళ్ల గ్రానీని చూస్తే అలాంటి వారందరి అలసట హుష్‌కాకి అయిపోవాల్సిందే! ఈ వయసులోనూ ఎవరిపైనా ఆధారపడకుండా తన పనులు తాను చేసుకుపోయే ఈ బామ్మ.. ఇటీవలే జరిగిన ‘టాటా ముంబయి మారథాన్‌’లో పాల్గొంది. అలుపులేకుండా దాదాపు ఐదు కిలోమీటర్లు పరిగెత్తి.. అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరి, ఈ వయసులోనూ ఇంత చురుగ్గా ఉండడానికి కారణమేంటని అడిగితే.. ఈ బామ్మ ఏం చెప్పిందో చూద్దాం రండి..

మారథాన్‌లో పాల్గొనడానికి వయసుతో సంబంధం లేదు. చిన్నారుల దగ్గర్నుంచి వృద్ధుల దాకా.. ప్రతి ఒక్కరూ ఈ పరుగులో చురుగ్గా పాల్గొనడం మనం చూస్తుంటాం. ఏటా ముంబయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘టాటా ముంబయి మారథాన్‌’ కూడా ఇందుకు మినహాయింపు కాదు. రెండేళ్ల విరామం అనంతరం ఇటీవలే నిర్వహించిన ఈ మారథాన్‌లో భారతీ జితేంద్ర పాథక్‌ అనే 80 ఏళ్ల బామ్మ పాల్గొని.. తన పరుగుతో అందరినీ ఆకట్టుకుంది.

50 నిమిషాలు.. 5 కిలోమీటర్లు..!

మహారాష్ట్రకు చెందిన 80 ఏళ్ల భారతి అక్కడి సంప్రదాయం ప్రకారం తొమ్మిది గజాల నౌవారీ చీర, స్పోర్ట్స్‌ షూ ధరించి.. జాతీయ జెండాను చేతబూని పరుగు ప్రారంభించింది. తోటి పోటీదారులతో పోటీపడుతూ మరీ.. 51 నిమిషాల్లో సుమారు 4.2 కిలోమీటర్లు పరిగెత్తింది. ఈక్రమంలో కాసేపు వేగంగా, మరికాసేపు నెమ్మదిగా.. ఎలాంటి అలుపు లేకుండా ఉత్సాహంగా ముందుకు సాగే బామ్మ పరుగు తోటి పోటీదారుల్లో స్ఫూర్తి రగిలించిందని చెప్పచ్చు. మరి, చిన్నపిల్లలా అందరితో పోటీపడి మరీ పరిగెత్తడం వెనుక ఉన్న రహస్యమేంటని ఈ బామ్మను అడిగితే.. ‘ఇది నేను పాల్గొన్న ఐదో మారథాన్‌. రోజూ ఉదయాన్నే కాసేపు నడక, రన్నింగ్‌.. వంటి వ్యాయామాలు చేయడం నాకు అలవాటు. అవే ఈ వయసులోనూ నన్ను ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంచుతున్నాయి. చాలామంది వయసు మీద పడే కొద్దీ అది చేయకూడదు, ఇది చేయకూడదు అని తమకు తామే కొన్ని ఆంక్షలు విధించుకుంటారు. నేను అలా కాదు. నా దృష్టిలో వయసు ఓ సంఖ్య మాత్రమే! మనసుకు నచ్చింది చేయడానికి, వయసుకు అస్సలు సంబంధం లేదు..’ అంటూ తన మాటలతోనూ స్ఫూర్తి నింపుతోందీ గ్రానీ.

స్టార్‌ బామ్మ!

అయితే భారతి బామ్మ మారథాన్‌ పరుగుకు సంబంధించిన వీడియోను ఆమె మనవరాలు డింపుల్‌ మెహతా ఫెర్నాండెజ్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ‘మా బామ్మ సంకల్పం, ధైర్యానికి జోహార్లు.. తనే మాకు స్ఫూర్తి!’ అంటూ క్యాప్షన్‌ పెట్టారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. చాలామంది ఈ బామ్మను చూసి ప్రేరణ పొందుతున్నారు. ‘యువతరానికి మీరు స్ఫూర్తిప్రదాత!’, ‘స్టార్‌ బామ్మ’.. అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏదేమైనా వ్యాయామంతో వయసునూ జయించచ్చన్న విషయం ఈ బామ్మ తన పరుగుతో చెప్పకనే చెప్పింది కదూ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్