మీ నగల్ని ఎలా భద్రపరుస్తున్నారు?

కుందనపు బొమ్మలా కనిపించాలంటే.. ధరించే దుస్తులతో పాటు వాటికి నప్పేలా పెట్టుకునే ఆభరణాలదీ కీలక పాత్ర! అందుకే నగల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు అమ్మాయిలు. అయితే ఇలా ఆభరణాలు ధరించడంతోనే సరిపోదు.. వాటిని భద్రంగా దాచుకోవడమూ ముఖ్యమే అంటున్నారు నిపుణులు....

Published : 18 May 2024 18:16 IST

కుందనపు బొమ్మలా కనిపించాలంటే.. ధరించే దుస్తులతో పాటు వాటికి నప్పేలా పెట్టుకునే ఆభరణాలదీ కీలక పాత్ర! అందుకే నగల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు అమ్మాయిలు. అయితే ఇలా ఆభరణాలు ధరించడంతోనే సరిపోదు.. వాటిని భద్రంగా దాచుకోవడమూ ముఖ్యమే అంటున్నారు నిపుణులు. అప్పుడే అవి ఎక్కువ కాలం మన్నడంతో పాటు విరిగిపోవడం, మెరుపు తగ్గిపోవడం, డ్యామేజ్‌ కావడం.. వంటి సమస్యలు రావని చెబుతున్నారు. అందుకోసం ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుందంటున్నారు.

దేనికదే విడివిడిగా!
నగలన్నిటినీ ఒకే బాక్స్‌లో కాకుండా విడివిడిగా అమర్చాల్సి ఉంటుంది. అయితే ఆయా ఆభరణాలు చేయించుకునే క్రమంలో లేదంటే కొనేటప్పుడే వాటిని ప్రత్యేకమైన బాక్సుల్లో పెట్టిస్తారు. కాబట్టి వాడకం పూర్తయ్యాక వాటిని నేరుగా ఆయా బాక్సుల్లో అమర్చితే సరిపోతుంది. ఒకవేళ బాక్స్‌లు లేనట్లయితే వెల్వెట్‌ లేదా శాటిన్‌ క్లాత్‌ అమర్చిన బాక్సులు బయట మార్కెట్లో దొరుకుతాయి. మీకున్న ఆభరణాల సైజును దృష్టిలో ఉంచుకొని ఆయా బాక్సుల్ని కొనుగోలు చేయచ్చు. ఇలా వీటిని భద్రపరిచే క్రమంలో అందులో కొన్ని కర్పూరం బిళ్లలు వేయడం మర్చిపోవద్దు. తద్వారా బాక్స్‌లో తేమ లేకుండా, నగలు పాడవకుండా ఈ బిళ్లలు ఉపయోగపడతాయి.

ఆరు నెలలకోసారి!
కొంతమంది నగల్ని తరచూ వాడుతుంటారు. మరికొంతమంది నెలల తరబడి తీయకుండా లాకర్లోనే ఉంచుతారు. ఇది ఎంత మాత్రమూ సరికాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆభరణాలు తరచూ వేసుకున్నా, వేసుకోకపోయినా కనీసం ఆరు నెలలకోసారి వాటిని శుభ్రపరచడం తప్పనిసరి అంటున్నారు. ఈ క్రమంలో వాడిన ప్రతిసారీ, వాడకపోతే ఆరు నెలలకోసారి వాటిని మైక్రోఫైబర్‌ క్లాత్‌తో నెమ్మదిగా తుడవాలి. ఈ క్రమంలో వాటిపై చేరిన దుమ్ము, ఇతర మలినాలు తొలగిపోతాయి.. నగలు శుభ్రపడతాయి. అలాగే మెరుగు పెట్టించాల్సిన అవసరం ఉన్న వాటికి మెరుగు పెట్టించచ్చు.

చివరగా ధరించాలి!
సాధారణంగా పూర్తిగా తయారై నగలు పెట్టుకున్నాక.. ఆఖర్లో పెర్‌ఫ్యూమ్‌ కొట్టుకుంటాం.. కానీ పెర్‌ఫ్యూమ్‌ కొట్టుకున్నాకే ఆఖర్లో నగలు పెట్టుకోమంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ సుగంధ పరిమళాల్లోని రసాయనాల వల్ల నగల మెరుపు తగ్గిపోయే ప్రమాదముంటుందట! అలాగే వీటిని భద్రపరిచే క్రమంలోనూ రసాయనాలు లేని చోట, సూర్మరశ్మి నేరుగా పడని చోట గాలి చొరబడని డబ్బాల్లో భద్రపరచుకోవాల్సి ఉంటుంది.

వెండి నగలైతే ఇలా!
వెండి పట్టీలు, వెండితో చేసిన ఇతర ఆభరణాల్ని సైతం బంగారు నగల్లాగే గాలి చొరబడని డబ్బాల్లో, ఇతర లోహాలకు దూరంగా భద్రపరచాల్సి ఉంటుంది. ఎందుకంటే వెండి నగలపై ఉండే ఆక్సైడ్‌ పూత గాలి తగలడం వల్ల క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. తద్వారా అవి కొన్నాళ్లకు మెరుపు కోల్పోయి నల్లగా మారతాయి. కాబట్టి భద్రపరిచేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ రోజుల్లో వెండి ఆభరణాల్ని భద్రపరచుకునేందుకు యాంటీ-టర్నిష్‌ పేపర్‌/క్లాత్‌ వంటి ప్రత్యేకమైన క్లాత్స్‌ మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. వాటిని ఎంచుకోవచ్చు.. ఒకవేళ అవి అందుబాటులో లేని పక్షంలో మస్లిన్‌ క్లాత్‌ (మెత్తటి వస్త్రం), టిష్యూ పేపర్లలోనూ వెండి నగల్ని అమర్చి లాకర్‌లో పెట్టేయచ్చు. ఈ క్రమంలో కొన్ని సిలికాజెల్‌ శాషేలు లేదంటే యాక్టివేటెడ్‌ చార్‌కోల్‌ను ఆ డబ్బాల్లో ఉంచి వెండి నగల్ని భద్రపరచాలి. తద్వారా ఆ డబ్బాలో తేమ ఏదైనా ఉంటే ఇవి పీల్చుకుంటాయి. తద్వారా అవి ఎక్కువ కాలం మన్నుతాయి. ఒకవేళ అవి మెరుపు కోల్పోయినట్లయితే వాటికి కాస్త టూత్‌పేస్ట్‌ను రుద్ది.. ఆపై మెత్తటి గుడ్డతో తుడిచేస్తే సరిపోతుంది.

వాటిపై గీతలు పడకుండా!
సాధారణంగా వజ్రాల ఆభరణాలు ఎక్కువ కాలం మన్నినప్పటికీ.. పదే పదే వాడే క్రమంలో వీటిపై గీతలు పడడం, డ్యామేజ్‌ కావడం.. వంటివి ఎక్కువగా జరుగుతాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వాడిన ప్రతిసారీ సబ్బు నీటితో శుభ్రపరచడం, పొడి గుడ్డతో తుడవడం, పూర్తిగా ఆరిన తర్వాత ప్రత్యేకమైన బాక్సుల్లో విడివిడిగా భద్రపరచడం వల్ల.. ఇవి డ్యామేజ్‌ కాకుండా జాగ్రత్తపడచ్చు.. అలాగే ఎక్కువ కాలం కొత్త వాటిలా మెరిపించుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్