Published : 18/01/2023 18:55 IST

పాలు పొంగిపోకుండా..

స్టౌ మీద పాలు పెడతాం.. మరో పనిలో నిమగ్నమవుతాం.. లేదంటే  ఏదో ఆలోచనలో మునిగిపోతాం. దాంతో పాలు పొంగిపోయి స్టౌ, కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌ అంతా పాడైపోతుంది. మళ్లీ వాటన్నింటినీ శుభ్రం చేసుకోవడానికి సమయం వృథా! తరచూ ఇది మనకు అనుభవమే! మరి, పాత్రలో పాలు కాచే క్రమంలో అవి పొంగిపోకుండా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

చాలామందికి పాత్రలో పాలు పోశాక.. అందులో నీళ్లు కలపడం అలవాటు. కానీ ముందు కొన్ని నీళ్లు పోసి.. అవి మరుగుతున్నప్పుడు పాలు పోస్తే అవి పొంగిపోవట!

పాలు పొంగిపోవడానికి పాత్ర పరిమాణం కూడా ఓ కారణమే. ఈ క్రమంలో చిన్న పాత్ర తీసుకొని దాని నిండా పాలు పోస్తే అవి పొంగిపోతాయి. కాబట్టి పాలు కాయడానికి వెడల్పు, లోతు ఎక్కువగా ఉన్న పాత్రను తీసుకోవాలి. తద్వారా అవి పొంగిపోకుండా చక్కగా కాగుతాయి.

పాలు కాయడానికి ఉపయోగించే పాత్ర అంచులకు కాస్త వెన్న రుద్ది.. కాచినట్లయితే అవి పొంగకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు.

ఒక్కోసారి అక్కడే ఉండి పాలు కాస్తున్నప్పటికీ అందులోని నురగ పైకి వస్తూ పాలు పొంగిపోతుంటాయి. ఇలాంటప్పుడు పైకి వస్తున్న నురగపై కొన్ని నీళ్లు చల్లితే సరి.

పాలు, ఇతర పదార్థాలు పొంగిపోకుండా ఉండేందుకు ప్రస్తుతం మార్కెట్లో స్పిల్‌ స్టాపర్స్‌ దొరుకుతున్నాయి. వీటిని మూతలాగా గిన్నెకు ఫిక్స్‌ చేస్తే.. పాలు పొంగిపోవు. వీటిని సిలికాన్‌తో తయారుచేస్తారు కాబట్టి.. వేడి పాల వల్ల అది కరిగిపోదు.

పాలు మరుగుతున్నప్పుడు అర టీస్పూన్‌ వంట సోడాను అందులో వేయడం వల్ల అవి పొంగిపోకుండా జాగ్రత్తపడచ్చు.. అలాగే పాలు విరిగిపోకుండా ఎక్కువసేపు తాజాగా ఉంచేందుకు ఇది దోహదం చేస్తుంది.

పాలలోని మీగడ మందపాటి లేయర్‌లా తయారై పొంగడం చూస్తుంటాం. ఈ సమయంలో ఒక టీస్పూన్‌/బీటర్‌ సహాయంతో పాలను కలిపినట్లయితే పాలు పొంగిపోకుండా చూసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని